శ్రీ లక్ష్మినరసింహస్వామి వారు కొలువై ఉన్న ప్రముఖ క్షేత్రాలలో ఈ ఆలయం చాల ప్రాముఖ్యతని సంతరించుకుంది. అయితే స్వామివారు ప్రహ్లదుడిని రక్షించడానికి, హిరణ్యకశిపుని చంపడానికి ఈ రూపాన్ని ధరించాడు. ఇంకా ఇక్కడి విశేషం ఏంటంటే నవనారసింహ రూపాలు ఒకేచోట ఇక్కడ నెలకొని ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం యొక్క మరిన్ని విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండలు, అడవుల మధ్యన ఉన్న ప్రాచీన వైష్ణవ దివ్యక్షేత్రంని అహోబిలం గా పిలుస్తారు. ఇది 108 దివ్య తిరుపతులలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందినది. ఈ అహోబిల క్షేత్రానికి “సింగ వేలు తుండ్రం” అనే పేరుండేది. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి ‘చెంచులక్ష్మి’ గా అవతరించిన ప్రదేశంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. నరసింహస్వామి సగం మానవరూపం, మరోసగం సింహం రూపం ఆకారంలో అవతరించిన విష్ణుమూర్తిని చూసిన దేవతలు భగవంతుని ప్రశంసిస్తూ అహో బలా అని కీర్తిస్తారు. అలా పిలువగా పిలువగా ఆ పిలుపు అహోబలా అని, ఆతర్వాత అహాబిలా అని వాడుకలోకి వచ్చిందని, తర్వాత అహోబిలం అని ఆ ప్రాంతానికి పేరు వచ్చిందని ఐతిహ్యం. ఈ అహోబిల క్షేత్రం రెండు భాగాలుగా రెండు ప్రదేశాలలో ఉంది. గుర్తు తెలియడం కోసం ఒక భాగాన్ని ఎగువ అహోబిలం అని, రెండవ భాగాన్ని దిగువ అహోబిలం అని అంటారు. దిగువ అహోబిలం అనే చోటనే అహోబిలం అనే ఒక చిన్న గ్రామం ఉంది. దిగువ అహోబిలం కి 8 కీ.మీ. దూరంలో కొండల మధ్యగా ఎగువ అహోబిలం ఉంది. ఎగువ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 2,800 అడుగుల ఎత్తున ప్రకృతి సంపదతో మనోహరంగా ఉంటుంది. భవనాశిని నదీతీరమున గల కొండా గుహయందు సాలగ్రామరూపంలో స్వామి స్వయంభువుగా రాతిపీఠంపై ఉగ్ర నరసింహస్వామిగా తూర్పు ముఖంగా వెలసి భక్తులకి దర్శనమిస్తున్నాడు. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించినట్లు నిదర్శనంగా నేటికీ ఎగువ అహోబిలంలో ఒక ఉక్కు స్థంభం కనిపిస్తుంది. ఇంకా స్వామివారు హిరణ్యకశిపుని చీల్చి చంపిన తరువాత, స్వామి రక్త సిక్తములైన చేతుల్ని కడిగిన గుండమే “రక్తకుండం”. అందలి నీరు ఇప్పటికి ఇప్పటికి ఎర్రగానే కనబడుట విశేషం. ఇక్కడి రంగమండపముకు ఉత్తరదిశ నందు ఊయల మండపం, చుట్టూ గల స్తంభముల యందు నవనారసింహులను మనం దర్శించుకొనవచ్చును. ఇలా నరసింహస్వామి స్వయంభువుగా వెలసిన ఈ అహోబిలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొనుటకు అనేక ప్రాంతాల నుండి భక్తులు ఎప్పుడు తరలివస్తుంటారు.