Home Unknown facts నవరాత్రుల పూజా విధానం…

నవరాత్రుల పూజా విధానం…

0

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు జగన్మాతను ఆరాధిస్తారు. శరన్నవరాత్రుల పేరుతో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

devi durgaమామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత, (చైత్రపాడ్యమి మొదలు నవమి వరకు) శరన్నవ రాత్రులలో (ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు) ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చు. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం)గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చు. ‘

దేవీపూజకి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా పూజాగృహంలోగానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా వుండేట్లు సమప్రదేశం చూసుకుని, అక్కడ కడిగి పసుపునీళ్ళతో శుద్ధిచేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం ఏడు హస్తాల వెడల్పు, తొమ్మిది హస్తాల పొడుగు వుండటం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం వెడల్పు, నాలుగు హస్తాలు పొడుగు వుండేలా వేదికను అమర్చి పూలమాలలతో, మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి.

అమావాస్య రాత్రి ఉపవాసం వుండి మరునాడు (పాడ్యమి తిథి) వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్టించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి, మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్టించి పూజించడం పరిపాటి. నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్టించవచ్చు. సింహవాహనారూడురాలైన దేవీమాత విగ్రహం నిండుగా, కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది.

ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముందాయై విచ్చే’ అనేది రాగి రేకుమీద లిఖించబడినది వుంచి యంత్రాన్ని పూజించవచ్చును.

దేవీమాతలోనుండి వాగ్దేవి (ఐం), శంభువనిత పార్వతి (హ్రీం) కామబీజం.. లక్ష్మీదేవి (క్లీం) ముగ్గురు దేవేరులు ప్రకటితమై త్రిమూర్తులకు శక్తిప్రదానం చేస్తూ సృష్టిస్థితి లయకారిణులై విలసిల్లుతున్నారు. అందుకే దేవి నవరాత్రోత్సవాలలో అమ్మవారిని రోజుకొక దేవి అలంకరణలో ఉత్సవమూర్తిని పూజించడం జరుగుతుంది దేవీమందిరాలలో, ప్రతిరోజూ దీక్ష చేస్తున్న బ్రాహ్మణోత్తములు చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. మూలా నక్షత్రంతో కూడిన రోజు సరస్వతీదేవి అలంకారంలో శ్వేతాంబర ధారిణిగా, వీణాపాణియై నేత్రపర్వం గావిస్తుంది. దేవీమాత, ఆరోజు సరస్వతీ పూజ చేసి ఐం బీజోపాసన గావించడం వల్ల సర్వవిద్యలు కరతలామలకమౌతాయి.

పాడ్యమినాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం, అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే! పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి. పశుబలి నిషిద్దం, బియ్యప్పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం.

Exit mobile version