గుడికి గాని ఇంకేవైనా పవిత్ర స్థలాలకు గానీ వెళ్ళినపుడు చెప్పులని బయటే వదిలేసి వెళ్తాం. ఇది మనం తరతరాలుగా ఆచరిస్తున్నదే. గుళ్లోనే కాదు మన ఇంటిలోపల కూడా పూజ గదిలోకి చెప్పులేసుకుని వెళ్ళే ధైర్యం చేయం. ఎందుకంటే దేవుడి పూజ గది పవిత్రమైనది కాబట్టి. అయితే మన ఇంట్లో పూజ గదే కాదు మరి కొన్ని ప్లేసుల్లో కూడా చెప్పులేసుకుని వెళ్లొద్దట.
ఈ రోజుల్లో మనం శుభ్రం పేరుతోనో, నొప్పుల నుండి ఉపశమనం కోసమో ఇంట్లో కూడా చెప్పులేసుకొని తిరుగుతున్నాం. కొన్ని ప్లేసుల్లోకి మాత్రం చెప్పులేసుకుని వెళితే ఇంటికి చాలా అశుభం అంటున్నారు పండితులు. ముఖ్యంగా ఇంట్లో నిత్యావసరాలు నిలువ చేసే స్టోర్ రూమ్, బంగారం దాచి ఉంచే ఇనప్పెట్టె, బీరువాలు ఉండే ప్రాంతాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు ధరించి వెళ్లొద్దుట.
వంట గదిలోనూ ఆహారం తయారు చేసుకుంటాం పైగా నిప్పును మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి కిచెన్ లోకి కూడా చెప్పులతో వెళ్ళరాదు. ఇక డబ్బులు, దానం, బంగారం అంటేనే సాక్షాత్తు లక్ష్మీ దేవితో సమానం కాబట్టి డబ్బు ఉంచే ప్లేసుల్లో చెప్పులతో తిరగరాదు.
ఇక పుణ్య నదులైన గంగ, కృష్ణ, గోదావరి లను దైవంతో సమానంగా పూజిస్తాం. పుష్కరాలు, కుంభమేళాలు చేసుకుంటాం కాబట్టి నదుల్లోకి చెప్పులతో ప్రవేశించరాదు. వినాయకుడు, దుర్గా ఇలా విగ్రహాలు ప్రతిష్టించి మనం వేడుకలు చేసే చోట్లకు కూడా చెప్పులు వేసుకెల్లకూడదు.
అందుకే కాబోలు మన పూర్వీకులు అసలు దాదాపుగా పాదరక్షలు లేకుండానే జీవితం గడిపేవారు. ఇప్పుడైతే మనం చెప్పులు లేకుండా తిరగలేము కానీ కనీసం ఈ పవిత్రమైన ప్లేసుల్లోకి వెళ్ళినప్పుడైనా చెప్పులను దూరంగా పెడదాం.