పూర్వం ఈ ఆలయాన్ని కట్టించిన రాజులూ వారి రాజ్యంలోని విలువైన రత్నాలను, వజ్రాలను ఈ ఆలయ పునాది కింద దాచిపెట్టారని చెబుతుంటారు. అందుకే ఇక్కడ విలువైన వజ్రాలు దొరుకుతున్నాయని అంటున్నారు. ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఈ ఆలయ గర్భగుడిలో విగ్రహం అనేది ఉండదు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో దాగి ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ రాష్ట్రం, మోహసానా జిల్లాలో మోఢేరా అనే ప్రాంతంలో అతి పురాతన సూర్యదేవాలయాం ఉంది. ఈ ఆలయం పుష్పవతి నది ఒడ్డున ఉంది. ఈఆలయాన్ని క్రీస్తుపూర్వం 1022 లో చాళుక్య వంశానికి చెందిన మొదటి భీమ్ దేవ్ సోలంకి నిర్మించినట్లుగా తెలియుచున్నది. అయితే సోలంకి రాజుల కాలంలో రత్నాలు, వజ్రాలు రాశులుగా పోసి అమ్మేవారని స్థానికుల కథనం. ఈ ఆలయాన్ని అంత కూడా ఎర్రని ఇసుక రాతితో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన ఎర్రటి రాయి ఇక్కడ తప్ప చుట్టూ పక్కల ఎక్కడ కూడా కనిపించదు. ఇంకా సున్నం ఉపయోగించకుండా ఒక రాయిలోకి మరొక రాయిని అమర్చి ఈ ఆలయాన్ని కట్టిన అప్పటి టెక్నాలజీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇక ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న పీఠంపై విగ్రహం అనేది ఉండదు. ఆ పీఠంపై పూర్వం సూర్యదేవుడు వచ్చి అక్కడ కూర్చుని వెళ్లాడని ఒక నమ్మకం. ఇక్కడ విశేషం ఏంటంటే, మర్చి 21 వ తేదీ కానీ సెప్టెంబర్ 23 వ తేదీన కానీ ఈ ఆలయానికి సూర్యోదయం కాకముందు చేరుకుంటే ఆ రెండు రోజుల్లో సూర్యుడు భూమధ్యరేఖని దాటడం జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్దారణ చేసారు. ఆ రోజుల్లో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండు రోజుల్లో కూడా ఈ సూర్యదేవుని ఆలయంలో గర్భగుడిలో ఉదయం సూర్యుడి తొలి కిరణాలూ సూర్యపీఠాన్ని తాకడం మనం కళ్లారా చూడవచ్చు.
ఇక పురాణానికి వస్తే, శ్రీ రాముడు రావణుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్య పాపం తొలగించుకొనుటకు వశిష్ట మహర్షిని అడుగగా, వశిష్ట మహర్షి ధర్మారణ్య వెళ్ళమని సలహా ఇచ్చాడు. అప్పటి ధర్మారణ్య ప్రాంతమే ఇప్పుడు ఇక్కడి మోఢేరా అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ఆలయం అంతకుడా అడుగడునా శిల్పాలతో నిండి ఉంటుంది. ఇక్కడ సూర్యకుండ్ అనే ఒక పుష్కరణి ఉంటుంది. ఈ పుష్కరణిలో 108 మెట్లు ఎంతో అద్భుతంగా నిర్మించారు. చాళుక్యులు సూర్యవంశీకులు అవడంతో వారి కులదైవం అయినా సూర్యభగవానుడి కోసం ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా కట్టించారు. ఈ ఆలయ నిర్మాణంలో సున్నం అనేది అసలు ఉపయోగించకుండా ఇరానీ శిల్ప కళ శైలిలో నిర్మించడం విశేషం. ఇక్కడ సూర్యదేవునితో పాటు అనేక దేవీదేవతల విగ్రహాలు, రామాయణ మహాభారతంలోని కొన్ని దృశ్యాలను శిల్పాలుగా మలిచారు.
ఇలా గర్భగుడిలో విగ్రహం లేని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం రెండు రోజులు తొలి సూర్యకిరణాలు గర్భగుడిలోని సూర్యపీఠాన్ని తాకడం చూడటానికి భక్తులు ఆ సమయాల్లో అధిక సంఖ్యలో వచ్చి ఆ అద్భుతాన్ని చూసి తరిస్తారు.