Home Unknown facts Pandava Thirthanni Darshisthe Punyam Labisthunda?

Pandava Thirthanni Darshisthe Punyam Labisthunda?

0

సూర్యుడు వృషభ రాశిలో ఉండగా శుక్ల పక్షంలో ద్వాదశితో కూడిన ఆదివారం గానీ, కృష్ణ పక్షంలో ద్వాదశితో కూడిన మంగళవారం గానీ పాండవ తీర్థంలో స్నానం ఆచరించడం పుణ్యప్రదమని వరాహ పురాణం చెబుతోంది. మరి ఈ పాండవ తీర్థం ఎక్కడ ఉంది? దీనివెనుక ఉన్న పురాణ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.Pandavaతిరుమల కొండల్లో ప్రకృతి రామణీయకతతో, ఆధ్యాత్మిక సౌరభంతో విలసిల్లుతున్న108 పుణ్యతీర్థాలు ముక్తిధామాలై శ్రీనివాసుని దివ్యత్వాన్ని చాటుతుంటాయి. అలాంటి పుణ్య తీర్థాల్లో పాండవ తీర్థం ఒకటి. పాండవ తీర్థం ఆనందనిలయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక పురాణానికి వస్తే, ద్వాపర యుగంలో పాండవులు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు వనవాస సమయంలో తిరుమల వచ్చారని ఒక కథ ప్రచారంలో ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత పాప పరిహారార్థం తిరుమల విచ్చేశారని మరో గాథ. తిరుమలలో పాండవులు పాండవ తీర్థం పరిసరాల్లో కొన్నాళ్లు ఉండి తపస్సు చేశారట. ఇక్కడి గుహలో పంచ పాండవులు, కుంతీదేవి, ద్రౌపది విగ్రహాలు మనం చూడొచ్చు.

అయితే యుద్ధం వల్ల కలిగిన దోషం నివృత్తి చేసుకోవడానికి పాండవులు లక్ష గోవులను దానం చేయాలని నిశ్చయించుకున్నారట. పాండవుల చేతుల మీదుగా గోవులను దానం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే శ్రీకృష్ణుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి దానాన్ని స్వీకరించాడట.అందుకే ఈ తీర్థాన్ని గోగర్భ తీర్థమని కూడా పిలుస్తారు. అంతేకాదు పాండవ తీర్థం గో గర్భం ఆకారంలో ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందని కొందరు చెబుతారు. అయితే పాండవులు గోవులతో సహా పాండవ తీర్థంలో కొన్నాళ్లు ఉన్నారట. గోవులకు నీటి కోసం భీమసేనుడు ఒక శిలను తన గదతో మోదాడని, అందులో నుంచి పాతాళగంగ ఉబికి వచ్చిందని ఆ తీర్థమే పాండవ తీర్థంగా స్థిరపడిందని పురాణాలూ చెబుతున్నాయి.పాండవ తీర్థంలో మరో ఆకర్షణ శిలారూపంలో ఉన్న శివుడు. తిరుమల క్షేత్రపాలకుడు రుద్రుడు. పెద్ద బండరాయి రూపంలో ఆనంద నిలయంలోనే ఉండేవాడట. ఒకానొక రోజున ఓ బాలుడు ఈ బండరాయిపై పడి మృతిచెందాడట. దీంతో కలత చెందిన రుద్రుడు ఆనంద నిలయం వదిలి పాండవ తీర్థంలో స్థిరపడ్డాడని స్థలపురాణం చెబుతోంది. శిల రూపంలో ఉన్న శివయ్యను పాండవులు భక్తిప్రపత్తులతో సేవించారట.నేటికి శివరాత్రి, కార్తీక మాసంలో రుద్రశిలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పాండవ తీర్థం తపస్సు ఆచరించడానికి అనువైన ప్రదేశం. వ్యాసమఠం పీఠాధిపతి మలయాళస్వామి ఈ తీర్థం పరిసరాల్లోనే కఠోర తపస్సు ఆచరించి ముక్తి పొందారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న పాండవ తీర్థాన్ని దర్శిస్తే పుణ్యం లభిస్తుందని చెబుతారు.

Exit mobile version