Home Unknown facts Parvathi parameshwarulaku subramanyaswamy yelaa janminchadoo thelusaa?

Parvathi parameshwarulaku subramanyaswamy yelaa janminchadoo thelusaa?

0

శివపార్వతుల కుమారుడు సుబ్రమణ్యస్వామి. ఈయనను దేవతల సేనాధిపతి అని అంటారు. సుబ్రమణ్యస్వామిని ‘స్కందుడు’, ‘కార్తికేయుడు’, ‘షణ్ముఖుడు’, ‘మురుగన్’ అనికూడా పిలుస్తుంటారు. ఈ స్వామి యొక్క వాహనం నెమలి. అయితే లోకకల్యాణం కోసం దేవతలు జన్మిస్తారని చెబుతుంటారు. మరి ఈ సుబ్రమణ్యస్వామి ఎలా జన్మించాడు? ఎందుకు జన్మించాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. parvathiఇక అయన జన్మ రహస్యం విషయానికి వస్తే, బ్రహ్మ మానస పుత్రుల్లో సనత్కుమారుడు ఒకడు. ఆయన సంపూర్ణ వైరాగ్యమూర్తి. తన తపస్సు తప్ప ప్రపంచం, సుఖదుఃఖాలను గురించిన చింత లేనివాడు. అటువంటి వాడికి ఒకనాడు ఒక కల వచ్చింది. కలలో తాను దేవసేనాధిపత్యం వహించి రాక్షసులతో యుద్ధం చేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇహలోకమే వద్దనుకునే నాకు ఈ కల ఏమిటని అడిగాడు. బ్రహ్మ దివ్యదృష్టితో పరిశీలించి అది అలా జరగబోతోంది కాబట్టి కలగా వచ్చింది. కానీ, ఇది రాబోయే జన్మలోనిది అని చెప్పాడు. అయితే ఈ విషయం శివ పార్వతులకు తెలిసింది. అప్పుడు సనత్కుమారుడంతటివాడికి మరో జన్మ ఉంటే అతడు తమకే సంతానమైతే బాగుంటుందని వారికి అభిప్రాయం కలిగింది.ఆ తరువాత సనత్కుమారుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి శివుడు వెళ్లాడు. తపోనిమగ్నుడైన సనత్కుమారుడు శివుణ్ని పట్టించుకోలేదు. కోపించిన శివుడు లయకర్తనైన నేనే స్వయంగా వచ్చినా పలకరించవా అని గద్దించాడు. శపించగలను జాగ్రత్త అని హెచ్చరించాడు. కళ్లు తెరచిన సనత్కుమారుడు శాప ఫలితం నా దేహానికే గాని ఆత్మకు కాదు గదా అన్నాడు. శపిస్తానన్నా భయపడని వైరాగ్యమూర్తిని చూసి ఆశ్చర్యపోయిన శివుడు సనత్కుమారుడితో ఆదరంగా నీకు వరం ఇస్తాను కోరుకో అన్నాడు. దానికి అతడు ప్రపంచం మీద ఏ ఆశా లేని నాకు వరం దేనికి? కావలిస్తే నీకే వరమిస్తాను కోరుకో అన్నాడు. వచ్చిన అవకాశం జారవిడువరాదని భావించిన శివుడు స్వామీ! నీవంటి వైరాగ్య సంపన్నుడు నాకు పుత్రుడిగా జన్మించాలని కోరుకొన్నాడు. దానికి ఆయన అంగీకరించాడు.ఇది విన్న పార్వతి పురుషుడివైన నువ్వు నాకు పుత్రుడిగా అన్నావు కదా. పురుషుడికి గర్భధారణ ఎలా? మళ్ళీ వెళ్లి మాకు పుత్రుడుగా అని అడగమంది. కానీ తపోనిష్ఠలో ఉన్న సనత్కుమారుడి నుంచి బదులు లేదు. కొంతకాలానికి అతడు ఒక నిప్పు ముద్దగా శంకరుడిలో ప్రవేశించాడు. అది శివుడి మూడో కంటి నుంచి వెలువడి వేగంగా వెళ్లి శరవనంలో పడింది. ఆ నిప్పు ముద్ద ఒక కుమారుడి రూపం ధరించగా కృత్తికా స్త్రీలు ఆరుగురు తమ స్తన్యంతో పోషించారు. అందుకే సుబ్రమణ్యస్వామి షణ్ముఖుడయ్యాడు. ఈవిధంగా మార్గశిర శుక్ల షష్ఠినాడు కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతిలా ప్రకాశించాడని, ఈ తిథి అతడికి ప్రియమైనదని భవిష్యోత్తరం చెబుతోంది. కుమారస్వామి జన్మించిన షష్ఠి గనుక దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారని పురాణాలూ చెబుతున్నాయి. ఇలా లోక కళ్యాణం కోసం పార్వతీపరమేశ్వరులకి కుమారస్వామి జన్మించి దేవతల సేనాధిపతి గా పిలవబడుతూ భక్తులచే పూజలందుకొంటున్నాడు.

Exit mobile version