ప్రసిద్ధి గాంచిన హిందూ దేవాలయాలు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ అరుదైన దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. అయితే ఇక్కడి శిల్పకళానైపుణ్యం, ఆలయ కట్టడం ప్రతి ఒక్కటి కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కంబోడియాలోని సీమ్ రీప్ అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అంగ్‌కోర్ వాట్ దేవాలయం. ఖ్మేర్ సామ్రాజ్యకాలంలో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో అంగ్‌కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పలు చారిత్రక ఆధారాలు రుజువు చేస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సముదాయంగా ప్రసిద్ధి గాంచిన ప్రదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంగ్‌కోర్ వాట్, బయాన్ అను దేవాలయాలతో పాటు అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయం మన హిందూ నాగరికతకు ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. ఈ దేవాలయ గోడలపై విష్ణుమూర్తి మొదలగు హిందూ దేవుళ్లతోపాటు, రామాయణ, మహాభారత కాలంనాటి అద్భుతమైన ఘట్టాలు శిలా రూపాల్లో అత్యద్భుతంగా చెక్కబడి మనకు దర్శనమిస్తాయి. అంగ్‌కోర్ వాట్ ప్రధాన ఆలయం చుట్టూవున్న మూడవ వసారాలో గోడలపై చెక్కివున్న శిల్ప కళ అత్యద్భుతం. ఈ నాల్గువైపుల దాదాపు ఒక కిలోమీటరు వున్న వసారాలో 13 అడుగుల ఎత్తైనగోడలపై హిందూపురాణాలన్ని చెక్కబడివున్నవి. పడమట వసార దక్షిణం వైపు కురుక్షేత్ర యుద్ధం చిత్రీకరించబడినది. భీష్ముడు అంపశయ్యపై శయనించిన దృశ్యం మొదలు యుద్ధంలో పాండవులు కౌరవులు యద్ధంచేయు దృశ్యములు చక్కగా చెక్కబడినవి. నైరుతి మూలవున్న గదిలో హిందూ ఇతిహాసముల గూర్చి చిత్రీకరించివున్నవి. గరుడునిపై వున్న విష్ణువు, రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తుట, శివుడు అడవిలో ధ్యానించుట, సూర్య చంద్రులు, రాముడు వాలిని సంహరించుట మొదలగు దృశ్యములున్నవి.ఇక దక్షిణవసారా పడమటివైపు రెండవ సూర్యవర్మన్ రాజు పరివారంతో పోవు ఊరేగింపు దృశ్యమున్నది. దక్షిణపు వసారా తూర్పువైపు మానవులు మరణించిన తర్వాత స్వర్గం, నరకాలకు పోవుట, అచ్చట వారు ఏ విధంగా వారి యొక్క పుణ్య, పాపఫలాలను అనుభవించు దృశ్యాలు చెక్కివు న్నారు. మూడు వరుసలలో వున్న ఈ దృశ్యంలో పై రెండు వరసలలో పుణ్యం చేసినవారు స్వర్గానికి పోవుట, క్రింది వరుసలోని వారు పాపఫలాలను అనుభవించుటకు నరకమునకు పోవుట వున్నవి. యమధర్మరాజు వృషభముపైన వున్నదృశ్యం, చిత్రగుప్తుడు, మరియు రౌరవాది నరకములలో పాపులను దండిచుట చక్కగా చెక్కారు. ఇలా ఇక్కడి ప్రతి అంగుళం కూడా వీక్షకులను ఆశ్చర్యం లోకి నెట్టివేస్తూ ఒక మధురమైన అనుభూతిని ఇస్తూ విశేషంగా ఆకట్టుకుంటుంది.