Home Unknown facts దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహిమగల కొన్ని రాయలసీమ పుణ్యక్షేత్రాలు

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహిమగల కొన్ని రాయలసీమ పుణ్యక్షేత్రాలు

0

రాయలసీమ నలు దిక్కుల అనేక పుణ్యక్షేత్రాలు వెలిసాయి. ఇక్కడ వెలసిన ఈ ప్రాచీన ఆలయాలలో ఎన్నో మహిమలు, విశేషాలు అనేవి దాగి ఉన్నాయి. అయితే ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆ ఆలయాలు ఏంటి? ఆ ఆలయంలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? అక్కడ కొలువై ఉన్న ఆ స్వామివారు, అమ్మవారు ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుమల తిరుపతి దేవస్థానం:

Rayalaseemaloni konni prasiddha alayalu

తిరుమల తిరుపతి దేవాలయానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి కలియుగ దైవంగా భక్తులకి దర్శనం ఇస్తున్నారు. అయితే మొట్టమొదటిసారిగా వైఖాసన అర్చకుడు శ్రీమాన్ గోపీనాధ దీక్షితుల వారు శ్రీవారి మూర్తిని పుష్కరిణి చెంత, చింతచెట్టు కింద ఉన్న చీమలపుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించి అర్చించాడని పురాణం. తిరుమల కొండని ఆదిశేషుని శరీరంగా, దానిపై శ్రీమహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నట్లు పురాణాలూ వివరిస్తున్నాయి. ఏడుకొండలు ఆదిశేషుని ఏడు శీర్షాలుగా అభివర్ణించారు. ఇక పిలిస్తే పలికే ప్రత్యేక్ష దైవం, భక్తులపాలిటి కొంగు బంగారంలా, కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి.

కాణిపాకం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి దగ్గరలో కాణిపాకం ఉంది. ఈ పుణ్యక్షేత్రం బహుధా నది ఉత్తరపు ఒడ్డున ఉంది. పూర్వం ఇక్కడ దేవతలు విహరిస్తుండేవారంటా అందుకే ఈ ప్రాంతాన్ని విహరపురి అని పిలుస్తారు. ఇక్కడ వెలసిన వినాయకుడి మహిమలను చాల కథలుగా చెప్పుకుంటారు. ఈ ఆలయంలో వెలసిన వరసిద్ధి వినాయకస్వామికి కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పురాణం ప్రకారం, స్వామికి కొబ్బరి ఇష్టమని కొబ్బిరి కాయలు కొట్టి ఆ నీటితో స్వామిని అభిషేకించారు. ఆ భక్తులు సమర్పించిన స్వచ్చమైన కొబ్బరినీరు బావి నుండి పొంగి పొరలి బావి చుట్టూ గల ఆ కాణి భూమిలో పారింది. అంతకుముందు అంగ వికులులుగా నున్న ఆ ముగ్గరుకు చెందిన భూమి అంతట కొబ్బరి నీరు పారడం చేత ఆ ప్రాంతానికి కాణిపారకం అని పేరు వచ్చింది. అదే మాట కాలక్రమంలో కాణిపాకం గా మారి స్టిర పడింది.

ఇలా స్వామివారు ఆనాటి నుండి ఇప్పటివరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరు ఏదైనా తప్పు చేసిన, వివాదం వచ్చిన వారితో స్వామి యెదుట ప్రమాణం చేపిస్తారు. ఒకవేళ అబ్బడం చెప్పితే కొద్దీ రోజుల్లోనే శిక్షింపబడతారని, అందువల్లే ఎవరు అబద్దం చెప్పడం కానీ, స్వామి యెదుట చేసిన ప్రమాణం తప్పడం కానీ ఉండదని భక్తుల నమ్మకం.

శ్రీకాళహస్తి :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో శ్రీకాళహస్తి పట్టణం ఉంది. ఈ నగరం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. దేశంలోని అతి పెద్ద ఆలయాలలో ఒకటిగా చెబుతారు. ఆలయంలోపల అమ్మవారి సన్నిధి కి సమీపంలో ఒక ప్రదేశం నుండి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలు సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశి అని కూడా అంటారు. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగం గల గొప్ప శైవక్షేత్రం. ఇక్కడ రెండు దీపాలతో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగం అనడానికి ఈ దీపం ఒక నిదర్శనం. ఇంకా మరోదీపం ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇలా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్య్రం, దోషాలు తొలిగిపోయి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం అందుకే దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది.

తిరుమలకి తొలిగడపగా చెప్పే ఆలయం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, జిల్లా కేంద్రమైన కడపలో ఒక భాగములో ఉన్న దేవుని కడపలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరాలయం ఉన్నది. ఏడు కొండల పైన వెలసిన ఆ వెంకన్న స్వామి ఆలయానికి తొలి గడపగా ఈ ఆలయాన్ని చెబుతారు. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీకి వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి, తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లేవారికి కదిపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడు చోట్లకి వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మి ప్రసన్న వేంకటేశ్వరుడిని, శ్రీ సొమెహ్శ్వరస్వామిని దర్శించుకొని తరువాత ఈ మూడు క్షేత్రాలకు వెళ్లేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలిగడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే, శ్రీ వేంకటేశ్వరుని దేవేరి అయినా బీబీ నాంచారమ్మ ముస్లింల ఆడపడుచు కావడం వలన ఈ ఆలయానికి ముస్లింలు కూడా వస్తారు. ప్రత్యేకంగా ఉగాది పర్వదినాన ముస్లింలు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుంటారు.

ఒంటిమిట్ట :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ శ్రీ కోదండ రామాలయం అనే దేవాలయం ఉన్నదీ. ఇక్కడ ఒకే శిలపైనా శ్రీరాముని, సీతను, లక్ష్మణుని చూడవచ్చును. ఈ ఆలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు కాబట్టి ఈ ప్రాంతానికి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే అని పేర్కొంటారు.

లేపాక్షి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా హిందూపూర్‌కు 14 కి.మీ దూరంలో లేపాక్షి ఉంది. పురాణం ప్రకారం, రావణుడు, సీతాదేవిని అపహరించుకొని వెళుతుండగా ఆకాశంలో ఉన్న జటాయువు రావణుడి అడ్డుకొనగా దాని రెక్కలు కండించడం వలన ఆ జటాయువు క్రింద పడిపోతుంది. ఇక హనుమంతుడి సహాయంతో అటుగా వచ్చిన శ్రీరాముడు చలన స్థితిలో లేని ఆ జటాయువును లే పక్ష్మి అని పిలవడం వలన మోక్షాన్ని పొంది చివరకు లేపాక్షి గా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇంకా ఇక్కడ హనుమంతుడికి సంబంధించిన పాదముద్రలు ఇప్పటికి దర్శనం ఇస్తాయి. ఇంకా లేపాక్షిలో గుడికి 250 మీటర్ల దూరంలో దేశంలోకెల్లా అతిపెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. 8.23 మీటర్ల పొడవూ, 4.5 మీటర్ల ఎత్తులో మలిచిన ఏకశిలా రూపమిది. అయితే ఈశాన్యమూలలో ఉన్న అంతరిక్ష స్తంభం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. నేలను తాకకుండా సుమారు 8 అడుగుల స్తంభం పై కప్పు నుంచి వేలాడుతూ ఉంది.

నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, గుంతకల్ మండలంలో కసాపురం అనే గ్రామము కలదు. ఈ గ్రామము నందు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాల పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని స్వామివారిని నెట్టికంటి స్వామి అని, కసాపురం ఆంజనేయస్వామి అని భక్తులు పిలుస్తారు. నెట్టికల్లు అంటే మంచి రాయి అని అర్ధం. ఇంకా ఒక కన్ను కలవాడని కూడా అంటారు. విగ్రహంలో స్వామి కుడి కంటితో భక్తులను చూస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నారు. స్వామివారి దివ్యమంగళ సుందర రూపాన్ని అభిషేక సమయంలో నిజరూప దర్శనంలో మనం చూడవచ్చును. ఈ స్వామిని దర్శిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం.

కదిరి నరసింహస్వామి ఆలయం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, హిందూపురాణానికి తూర్పు దిక్కున సుమారు 90 కీ.మీ. దూరంలో కడపజిల్లా సరిహద్దులో ఉన్న కదరి గ్రామంలో శ్రీమత్ కదిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం ఉన్నది. ఇక్కడ విశేషం ఏంటంటే నరసింహస్వామి వారి అన్ని క్షేత్రాలలో లేనివిధంగా ఈ ఒక్క ఆలయంలో మాత్రమే అయన భక్త ప్రహ్లాదుని సహిత భక్తులకి దర్శనం ఇస్తుంటారు. ఇచట కదిరి వృక్షం నందు స్వామివారు స్వయంభువుగా వెలిశారు. హరిహర బుక్కరాయుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. ఇక్కడ కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. ఖ అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి ఖద్రి లేదా ఖాద్రి అనే పేరు వచ్చిందని అంటారు.

శ్రీశైలం:

తిరుమల తరువాత అంతటి ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైలం, అంతటి అనుగ్రహం కలిగిన దేవుడు మల్లన్న. ఇక్కడి పర్వతాలపై కొలువైన మల్లన్నను ఒకప్పుడు చుట్టుపక్కల గల గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకునే వారు. ఈ రోజున వివిధ దేశాలలోని భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. జ్యోతిర్లింగ, శక్తి పీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలసిన పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సకల లోకారాధ్యంగా భాసిల్లుతోంది. లక్షా 47 వేల 456 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో – ఎనిమిది శృంగాలతో అలరారే శ్రీశైలంలో నలభై నాలుగు నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలు, చంద్ర కుండ, సూర్యుకుండాది పుష్కరిణులు, స్పర్శవేదులైన లతలు, వృక్షసంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు ఉన్నాయని ప్రతీతి. గిరుల బారులను దాటి శ్రీశైల మల్లన్న సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదకరం. పౌరాణిక ప్రశస్తికి గుర్తుగా సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు సభక్తికంగా సంస్థాపించిన సద్యోజాతి లింగం, పంచపాండవ లింగాలు పూజలందుకుంటున్నాయి.

యాగంటి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుజిల్లా, జిల్లా కేంద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లి మండలం, బనగానపల్లి నుండి 15 కీ.మీ. దూరంలో ఎర్రమల కొండల్లో వెలసిన యాగంటిలో శ్రీ ఉపమహేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ఈ ఆలయంలో ఉమామహేశ్వరులు స్వయంభువుగా వెలిశారు. ఈ ఆలయం నందు ఆది దంపతులైన శివపార్వతులు ఒకే శిలలో దర్శనమిస్తారు. యాగంటి లోని నంది విగ్రహానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ నది విగ్రహం దిన దినానికి ఆ రాయి యొక్క పరిమాణం పెరుగుతుంది. ఇక్కడి 15 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు, 8 అడుగుల పొడవు గల నందీశ్వరుడు కూడా స్వయంభు అని తెలియుచున్నది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞాన తత్వాలలో ‘యాగంటి బసవన్న అంతకు అంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేనయా’ అని చెప్పారు. నిజంగానే ఈ నంది పరిమాణం రోజు రోజుకి పెరుగుతుంది. భారత పురావస్తు శాఖ కుడి ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

అహోబిలం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండలు, అడవుల మధ్యన ఉన్న ప్రాచీన వైష్ణవ దివ్యక్షేత్రంని అహోబిలం గా పిలుస్తారు. ఇది 108 దివ్య తిరుపతులలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందినది. ఈ అహోబిల క్షేత్రానికి “సింగ వేలు తుండ్రం” అనే పేరుండేది. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి ‘చెంచులక్ష్మి’ గా అవతరించిన ప్రదేశంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. నరసింహస్వామి సగం మానవరూపం, మరోసగం సింహం రూపం ఆకారంలో అవతరించిన విష్ణుమూర్తిని చూసిన దేవతలు భగవంతుని ప్రశంసిస్తూ అహో బలా అని కీర్తిస్తారు. అలా పిలువగా పిలువగా ఆ పిలుపు అహోబలా అని, ఆతర్వాత అహాబిలా అని వాడుకలోకి వచ్చిందని, తర్వాత అహోబిలం అని ఆ ప్రాంతానికి పేరు వచ్చిందని ఐతిహ్యం. ఈ అహోబిల క్షేత్రం రెండు భాగాలుగా రెండు ప్రదేశాలలో ఉంది. గుర్తు తెలియడం కోసం ఒక భాగాన్ని ఎగువ అహోబిలం అని, రెండవ భాగాన్ని దిగువ అహోబిలం అని అంటారు. దిగువ అహోబిలం అనే చోటనే అహోబిలం అనే ఒక చిన్న గ్రామం ఉంది. దిగువ అహోబిలం కి 8 కీ.మీ. దూరంలో కొండల మధ్యగా ఎగువ అహోబిలం ఉంది. ఎగువ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 2,800 అడుగుల ఎత్తున ప్రకృతి సంపదతో మనోహరంగా ఉంటుంది.

మహానంది :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలకు 14 కి.మీ. దూరంలో మహానంది మండలం, మహానంది వద్ద శ్రీ మహానందీశ్వరస్వామి వారి దేవస్థానం ఉంది. ఇది పురాణ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఈ గ్రామానికి అనుకోని 15 కి.మీ. దూరంలో నవనందులు ఉన్నాయి. వీటి అన్నిటిలోకి ఇక్కడ ఉన్న ఆలయం ప్రధానమైనది కావడంతో ఈ క్షేత్రానికి మహానంది అనే పేరు వచ్చింది. ఇది ప్రముఖ శివ క్షేత్రం. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇచ్చట జలమే ఒక విశేషం. శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది క్షేత్రానికి మాత్రమె సొంతం. లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి సదా నీరు ఊరుతూనే వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇచట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము అణగి వుంటుంది

Exit mobile version