విమానాన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టింది ఎవరు అంటే రైట్ సోదరులు అని చెబుతుంటారు. కానీ మన దేశంలో పురాణ కాలంలోనే విమానాలు వాడేవారు. గగన విహారం భారతీయులకు కొత్తేమీ కాదు కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో మన పూర్వికులు అంతరిక్షంలో అవలీలగా తిరిగేవారని ఈ విమానాలు గాలిలో, నీటిలో, భూమి పై కూడా వాయువేగంతో ప్రయాణించేవని పురాణాలు చెబుతున్నాయి. మరి మొట్టమొదటి విమానం అయినా పుష్పక విమానం గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.పుష్పక విమానం భారతీయ పురాణాలలో చెప్పిన విధంగా ఇది గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఇందులో విచిత్రం ఏమిటంటే ఎంతమంది ఇందులో కూర్చున్నా అందులో మరొకరికి చోటు ఉంటుందట. ఇలాంటి ఎన్నో విచిత్రమైన విశేషాలు కలిగిన పుష్పక విమానం గురించి వాల్మీకి రామాయణంలో పేర్కొన్నాడు.విశ్వకర్మ బ్రహ్మదేవుని కోసం ఈ విమానాన్ని తయారు చేసాడు. దీని తయారీకి తేలికైన లోహాలతో బాటు మణిమాణిక్యాలు కూడా వాడాడు అని చెబుతారు. బ్రహ్మ ముల్లోకాలూ సంచరించేందుకు మనో వేగంతో ప్రయాణించే విధంగా దీన్ని రూపొందిచాడు విశ్వకర్మ. అనంతర కాలంలో కుబేరుడు తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆ విమానాన్ని వరంగా పొందాడు. కుబేరుని భాగ్యాన్ని చూసి అతని సోదరుడు రావణుడు అసూయ చెందుతాడు. కుబేరుణ్ణి యుద్దంలో ఓడించి రావణుడు పుష్పకవిమానాన్ని సొంతం చేసుకుంటాడు. రామరావణ యుద్దంలో రావణ సంహారం తరువాత ఈ విమానం విభీషణుడి వశమవుతుంది. ఈ విమానంలోనే సీతా సమేతంగా రామ లక్ష్మణులు, వానర సైన్యం అమోధ్యను చేరుకున్నారని పురాణ కథ. ఇంతకీ ఆవిమానంలో మనం ఉహించినట్టుగా కేవలం ఆసనాలు మాత్రమే ఉండవు. ఎందుకంటే హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు, రావణుడు కానుకగా పొందిన ఆ పుష్పకము లోపల చూడగానే సాక్షాత్తు స్వర్గలోకమే అవతరించిందా? అన్న భ్రాంతి కలిగిందట. ఇక ఆ పుష్పకము యజమాని మనసు ననుసరించి మనో వేగముతో పయనిస్తుందట. అసలు శత్రువులకు దొరికే పరిస్థితి ఎప్పుడూ ఉండదట. అంతే కాదు ఆ విమానానికి బయట లోపలివైపున విశిష్టమైన శిల్ప రీతులు గోచరిస్తాయట. కర్ణ కుండలాలతో శోభిస్తున్న ముఖములు గల వారు, మహా కాయులు, ఆకాశంలో విహరించే రాక్షసులు తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తించే వారు, విశాల నేత్రములు గల వారు, అతి వేగముగా సంచరించ గల వేలాది భూతగణాల వారు ఆ విమానాన్ని మోస్తున్నట్టుగా దాని వెలుపలి భాగంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అదంతా చూసిన హనుమంతుడు ఈ విమానం రావణుడి స్థాయికి తగినట్టు దర్పంగా ఉంది అనుకున్నాడట. ఇంకా చెప్పాలంటే మెరుపు తీగల్లాంటి నారీ మణులు ఎందరెందరో ఆ విమానంలో ఉండటమే గాక అనేక సుందర దృశ్యాలు చిత్రీకరించ బడి ఉన్నాయట. వాటిలో అవి భూమి మీద పర్వత పంక్తులా? అన్నట్టుగా చిత్రించిన చిత్రాలు ఆ పర్వతాల మీద వృక్ష సమూహములు పుష్పాలు వాటి కేసరములు, పత్రములు స్పష్టముగా చిత్రీకరించబడి ఉన్నాయట.ఇంతటి గొప్ప అరుదైన పరిజ్ఞానం పురాతనకాలం నుండే ఉందనడానికి ఈ “పుష్పక విమానం” ఒక నిదర్శనం.