Home Unknown facts వినాయకుడిని దొంగ అని పిలవడం వెనుక కారణం ఏంటో తెలుసా ?

వినాయకుడిని దొంగ అని పిలవడం వెనుక కారణం ఏంటో తెలుసా ?

0

హిందువులు వినాయకుడిని ప్రతి పూజలో మొదటగా పూజిస్తారు. వినాయకుడు దర్శనం ఇచ్చే ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో ఆశ్చర్యం ఏంటంటే, వినాయకుడిని దొంగ అని పిలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? వినాయకుడిని దొంగ అని పిలవడం వెనుక కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Ganeshaతమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాకి కొంత దూరంలో ఉన్న తిరుక్కాడియాయూర్ లో శ్రీ అమృత కడేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీ అభిరామి అమ్మవారి సమేత శ్రీ అమృత కడేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో అష్టదిక్పాలకులలో ఒకరైన శ్రీ శివభగవానుడు ఇచ్చట అష్టమ స్థానంలో వెలసియున్నాడు. ఇక్కడ బిల్వవృక్షం, పింజలా వృక్షములు ఉన్నాయి.

ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కొరకు పాలకడలని మదించి అమృతం గ్రహించే సమయంలో గణపతిని పూజించడం మరచినారు. అప్పుడు వినాయకుడు ఆగ్రహించి ఒక బిందెడు అమృతం ప్రస్తుతం ఉన్న ఆలయ గర్భగుడిలో దాచిపెట్టగా ఆ బిందె నిండా ఉన్న అమృతం మహాశివలింగంగా అవతరించిందని పురాణం.

ఈవిధంగా అమృతం నుండి ఉత్భవించిన ఆ స్వామికి అమృత కడేశ్వరస్వామి అనే పేరు వచ్చినది. అయితే అమృతాన్ని దొంగలించినందున ఇక్కడ వినాయకుడిని కళ్ళల్ వినయగర్ అనే పేరు వచ్చినది. కళ్ళల్ అంటే దొంగ అని అర్ధం. అయితే 63 మంది నాయనార్ లలో కుంగిలియానాయనార్ మరియు కారినాయనార్ లు ఈ స్వామిని పూజిస్తూ నివసించిన స్థలం ఇదేనని చెబుతారు.

ఇంకా యమధర్మరాజు బారినుండి మార్కండేయుని రక్షించుటకు శివుడు యముడిని సంహరించడం వలన ఈ స్వామిని కాలసంహారకుడు అని భక్తులు పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కాల సంహార ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇలా ఎన్ని విశేషాలు ఉన్న ఈ ఆలయానికి దసరా సమయంలో, కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version