Home People Remembering The Statesman And Iron Man Of India On His Birth Anniversary

Remembering The Statesman And Iron Man Of India On His Birth Anniversary

0

భారతదేశానికి స్వాత్యంత్రం రావడానికి ఎందరో మహానుభావులు వారి జీవితాన్ని త్యాగం చేసారు. అయితే లండన్ లో లా చదివి ఇండియా కి వచ్చి లాయర్ గా తనకంటూ ఒక గొప్ప పేరుని, డబ్బుని సంపాదిస్తున్న సమయంలో గాంధీజీ గారు చేపట్టిన సహాయనిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడై న్యాయవాద వృత్తిని వదిలేసి తన తెలివి తేటలతో స్వాత్యంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా స్వాత్యంత్రం వచ్చిన తరువాత ఐక్యత విషయంలో హైదరాబాద్ ని పాకిస్థాన్ లో కలువకుండా కాపాడి, ఇంకా సమస్యల్లో ఉన్న ఎన్నో సంస్థానాలను తన చాకచక్యంతో భారతదేశంలో ఎలాంటి అల్లరులు లేకుండా విలీనం చేసి దేశం మొత్తాన్నికలిపి ఒక్క తాటిపై నడిపించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి ఆయనకి ప్రధానమంత్రిగా అన్ని అర్హతలు, మద్దతు లభించిన గాంధీజీ ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కాదని నెహ్రూని ప్రధానమంత్రిగా చేసారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఉద్యమం ఎలా ఉండేది? స్వాత్యంత్రం వచ్చిన తరువాత ఆయన దేశానికి చేసిన కృషి ఎలాంటిది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Statesman And Iron Man Of India

గుజరాత్‌లోని నాడియార్‌లో 1875 అక్టోబర్ 31 వ తేదీన జవేరిభాయ్ పటేల్, లాడ్ బాయి దంపతులకి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించారు. ఆయన 1910 లో లండన్ లో బారిస్టర్ పూర్తి చేసుకొని 1913 లో భారతదేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాదిగా చేసారు. ఇలా తక్కవ కాలంలోనే మంచి పేరుని, డబ్బుని సంపాదిస్తున్న సమయంలో 1914 లో గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం గురించి తెలుసుకున్న ఆయన ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటివరకు సూటు, బూటు వేసుకుని ఉండే ఆయన ఉద్యమంలోకి వచ్చిన తరువాత వాటిని కాల్చివేసి, కుర్తా, ధోతులను ధరించడం మొదలుపెట్టారు. ఇలా ఆయన చాలా తక్కువసమయంలోనే గాంధీజీ గారికి ముఖ్య అనుచరుడై భారత జాతీయ కాంగ్రెస్ లో కీలక వ్యక్తిగా మారారు. బ్రిటిష్ వారు విధిస్తున్న పన్నులకి వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమాన్ని నడిపించి దేశ ప్రజల అందరి దృష్టిని పొందిన ఆయనకి అప్పటి నుండి సర్దార్ అనే పేరు వచ్చింది.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన ఐదు సార్లు జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఇలా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో మన భారతదేశానికి 1947 ఆగస్టు 14 వ తేదీన అర్ధరాత్రి స్వాత్యంత్రం లభించింది. ఇక స్వాత్యంత్రం వచ్చిన తరువాత గాంధీజీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఎన్నిక జరుగ ఎక్కువమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మద్దతు తెలుపగా నెహ్రు ఉపప్రధానమంత్రి గా అనుకున్నారు కానీ గాంధీజీ కి నెహ్రు గారి సాన్నిహిత్యం, ప్రధానమంత్రి గా చేయడానికే ఇష్టాన్ని చూపిన నెహ్రు గారి అలక కారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి పదవిని వదులుకొని, ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా కొనసాగారు.

ఇక మన దేశానికి స్వాత్యంత్రం వచ్చేప్పటికి దాదాపుగా 554 సంస్థానాలు ఉండేవి. అందులో జమ్మూ కాశ్మీర్, నైజం, గ్వాలియర్, సిక్కిం, బెనారస్ వంటివి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని వేలసంఖ్యలో జమీందార్లు, జాగీర్ దార్లు ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ముక్కలవకుండా అందరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఐక్యత చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపించిన చొరవ ఎన్నటికీ మరువలేనిది. ఈవిధంగా ఆయన ఎలాంటి గొడవలు లేకుండా దాదాపుగా అన్ని సంస్థానాలను దగ్గరికి చేసారు, కానీ జమ్మూ కాశ్మీర్, నైజం, జునాగఢ్ వంటివి భారత్ లో కలిసినప్పటికీ మా విధానంలో ప్రభుత్వ జోక్యం అసలు ఉండకూడదనే ఒక నియమాన్ని పెట్టాయి.

ఆ తరువాత నైజం నవాబు కలిస్తే పాకిస్థాన్ లోనే కలుస్తాము ఇండియా లో కలువము అంటూ చెప్పడంతో జునాఘడ్ నవాబూ కూడా పాకిస్థాన్ లోనే కలుస్తాం అని ప్రకటించాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లో నాయకులంతా అయోమయంలో ఉండగా వీరందరిని కలిపే బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే తీసుకోవాలని గాంధీజీ గారు కోరగా అప్పుడు నెహ్రు గారు జమ్మూ కాశ్మీర్ మా తాతల కాలం నాటి జన్మస్థలం కావున ఆ బాధ్యతలను నేను తీసుకుంటాను అని చెప్పి జునాఘడ్ బాధ్యతలు పటేల్ గారికి ఇద్దామని, ఇక నైజం విషయంలో ఎవరు జోక్యం చేసుకోకపోవడం మంచిదంటూ చెప్పగా ప్రధానమంత్రి నెహ్రు అంగీకారంతో పటేల్ గారు జునాఘడ్ ఆపరేషన్ పోలో నిర్వహించి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా జునాఘడ్ ని 1948 సెప్టెంబర్ 13 న భారత్ లో కలిపారు. ఆ తరువాత అదే సంవత్సరం సెప్టెంబర్ 15 వ తేదీన రష్యాలో జరిగే సోషల్ కాన్ఫిరెన్స్ కి నెహ్రు స్థానంలో పటేల్ గారు వెళ్ళాల్సింది కానీ అప్పటి నైజం నవాబు హైదరాబాద్ లో హిందువుల పైన క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని హైదరాబాద్ లో ఉంటున్న కొండా లక్ష్మణ్ బావూజీ పటేల్ గారికి తెలియచేయడంతో అనారోగ్యం కారణంగా రష్యా వెళ్ళలేను అని నెహ్రు గారికి అబద్దం చెప్పి ఆయన్ని రష్యా పంపించి హైదరాబాద్ కి వచ్చి పోలీస్ యాక్షన్ ప్రకటించి నైజం నవాబుని అరెస్ట్ చేసి మొత్తం నైజం ప్రాంతం అంతటిని సెప్టెంబర్ 17 వ తేదీన భారతదేశంలో కలిపారు.

ఇది ఇలా ఉంటె జమ్మూ కాశ్మీర్ విలీన బాధ్యతలు తీసుకున్న నెహ్రు గారు జమ్మూ కాశ్మీర్ దేశంలో విలీనం అయినప్పటికీ భారతదేశంలో ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకోవచ్చు కానీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం వెళ్లి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చూసి రావాల్సిందే తప్ప అక్కడ ఎవరుకూడా నివాసం ఏర్పరుచుకోవడానికి వీలులేదంటూ ఒక ఆర్టికల్ విధించారు. దీంతో అక్కడ నివసించే చాలా మంది అక్కడి నుండి వేరే ప్రాంతాలకు వలస పోయారు. ఇదే విషయంలో పటేల్ గారికి నెహ్రు గారికి మనస్పర్థలు అనేవి వచ్చాయి. ఇక చివరకు ఆయన 1950 డిసెంబరు 15న మరణించారు. అయితే ఆయన మరణించిన 40 సంవత్సరాల తరువాత 1991 లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.

ఇది ఇలా ఉంటె, గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళిగా 600 అడుగుల ఎత్తున్న ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం దాదాపు గా 2,990 కోట్ల రూపాయల వ్యయంతో తయారైన ఈ విగ్రహాన్ని ఐక్యతా విగ్రహం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ గా పిలుస్తారు. 2103 వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత ఈ కంచు విగ్రహం తయారీ మొదలైంది. న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెద్దది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఇదేనని చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని ఈ నెల అక్టోబర్ 31వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించనున్నారు.

ఇలా స్వాత్యంత్రం రావడానికి ఎంతో కృషి చేసి, స్వాత్యంత్రం వచ్చిన తరువాత పదవిలో ఉన్నదీ తక్కువ సమయమే అయినప్పటికీ ఎన్నో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని యావత్ దేశాన్ని ఐక్యం చేసిన భారత దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం కోసం చేసిన కృషి ఎప్పటికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Exit mobile version