పండగ అంటే ఏ మతానికైనా ఒక్కటే. దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. పండుగ మానావాళికి మంచిని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ‘ రంజాన్ ‘ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్ ని జరుపుకుంటారు. దానికి ప్రధానమైన కారణం ముస్లింలు అతి పవిత్రంగా భావించే ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే.
ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ఉపవాసవ్రతం’. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘రోజా’ అని అంటారు. సౌమ్ అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ముస్లింలంతా విధిగా కఠిన ఉపవాసదీక్షను పాటిస్తారు. అయితే జబ్బుగా ఉన్నవారు లేదా ప్రయాణం చేస్తున్న వారు ఇతర దినాల్లో ఉపవాసాలు పూర్తి చేయాలని దివ్య ఖురాన్ చెబుతుంది. ఇక ఉపవాసం పాటిస్తున్నవారు కొన్ని 5 నియమాలు కచ్చితంగా పాటించాలని ఖురాన్ చెబుతుంది.
1.ఉపవాస సమయంలో చెడు మాటలు పలకడంతో పాటు, వాటిని వినటం కూడా నిషేధమే.
2. ఉపవాసి తన దృష్టి చెడు కార్యాల వైపు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
3.ఉపవాసి తన శరీర భాగాలన్నిటినీ చెడు పనుల నుంచి కాపాడుకోవాలి. అనైతిక, నిషిద్ధ కార్యాల నుంచి చేతల్ని, చేతుల్ని కట్టిపెట్టుకోవాలి. అక్రమ సంపాదనతో ఇఫ్తార్ చేయకూడదు.
4. అబద్ధాలు, చాడీలు చెప్పటం, పరోక్ష నింద, అనవసర కబుర్లతో కాలయాపన, నోటిదురుసు లాంటివన్నీ ఉపవాస స్ఫూర్తికి విరుద్ధం. ముఖ్యంగా పరోక్ష నింద వల్ల ఉపవాసం భంగమవుతుంది. సాధారణ రోజుల్లోనూ ఇవన్నీ నిషేధితాలు. రంజాన్ మాసంలో వీటి విషయంలో మరింత జాగరూకత వహించాలి.
5. ‘అల్లాహ్ దర్బారులో నా రోజా స్వీకృతమవుతుందో లేదో, అల్లాహ్ అభీష్టం మేరకు నా ఉపవాసాన్ని చేస్తున్నానో లేదో’ అనే భయం ఉపవాసికి ఉండాలి. నా ఉపవాసం ఫలవంతం అవుతుందో లేదో అనే ఆందోళనే రోజాను చక్కగా నిర్వర్తించేలా చేస్తుంది.
‘రోజా’ ఉపవాసానికి సహెరీ, ఇఫ్తార్లు ప్రాణం లాంటివి. తెల్లవారు జామున ఫజర్ నమాజుకు గంట ముందు నిద్రలేచి ఆహారం భుజించడాన్ని సహెరీ అంటారు. రోజా పాటించాలంటే సహెరీ తప్పనిసరి. ‘సహెరీ భుజించండి. సహెరీలో శుభముంది. సహెరీ భుజించే వారిని దైవదూతలు దీవిస్తారు’ అని ముహమ్మద్ ప్రవక్త చెప్పారు. సహెరీ భుజించడం వల్ల శరీరంతో పాటు ఆత్మకూ శక్తి లభిస్తుంది అని చెబుతారు.
నెల పొడుపుతో రంజాన్ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి దినాన్ని రంజాన్ పండుగగా నిర్ణయిస్తారు. అల్లా రక్షణ, కరుణ అందరూ పొందాలన్న ఆశయంతో ఈద్గాలో బారులుతీరి పండుగ నమాజు చేస్తారు. ధనిక, బీద తారతమ్యం లేక, సహృదయాలతో సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు. ద్వేషాలన్నీ సమసి ప్రేమపూరిత భావం ఇనుమడిస్తుంది. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది.
‘జకాత్’ తో పాటు ‘ ఫిత్రా’ దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందుకు దేవుడి పట్ల కృతజ్ఞతగా పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం – ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయట.