Home Unknown facts పది చేతులతో దర్శనమిచ్చే వీరభద్రస్వామి ఆలయం ఎక్కడ ఉంది?

పది చేతులతో దర్శనమిచ్చే వీరభద్రస్వామి ఆలయం ఎక్కడ ఉంది?

0

శ్రీ వీరభద్రస్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. వీరభద్రస్వామి దర్శనమిచ్చే ప్రసిద్ధ ఆలయాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, కాకుమాను మండలంలోని కొమ్మూరు అనే గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వెలసిన వీరభద్రస్వామి శ్యామల వర్ణంతో, పది చేతులతో ఆయుధాలను ధరించి ఉన్నట్లు భక్తులకు దర్శనమిస్తాడు.

పురాణం ప్రకారం, శివుని భార్య సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యాగానికి అందరు దేవతలు హాజరయ్యారు. పరమశివుడు, అతని భార్యను మాత్రం పిలువలేదు. ఈ అవమానాన్ని సహించలేని సతీదేవి తండ్రిని నిలదీసేందుకు యాగశాలకు వెళ్లింది. అక్కడ సతీదేవి తండ్రి శివుని గురించి దుర్భాషలాడటంతో ఆమె ఆ అవమాన భారాన్ని మోయలేక అగ్నికి ఆహుతయింది. దీంతో కోపోద్రిక్తుడైన పరమశివుడు తన తలలోని జటాజూటంలోంచి వీరభద్రుడిని పుట్టించాడు. అప్పుడు వీరబద్రుడు ప‌ట్టిసం అనే ఆయుధంతో ద‌క్ష ప్ర‌జాప‌తి శిర‌స్సు ఖండించి దేవ‌కూట ప‌ర్వ‌తంపై విల‌య‌తాండ‌వం చేసాడని స్కంధ‌పురాణంలో పేర్కొన్నారు.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ కొలువై ఉన్న ఈ స్వామి విగ్రహాన్ని రూపాయి నాణెంతో మీటితే సప్తస్వరాలు వినిపించడం గొప్ప విశేషంగా ఈ శిల్ప నైపుణ్యాని తెలియచేస్తుంది. ఇంకా పూర్వము ఈ ఆలయానికి నిత్యం ఒక సర్పం వస్తూ స్వామి వారిని దర్శించి పోతుండేది. ఒకసారి భక్తులందరికీ ఆ సర్పం నిర్జీవంగా కనిపించింది. భక్తులు దాని భక్తికి మెచ్చి ఆ పాము దేహాన్ని ఒక గాజు పెట్టెలో భద్రపరిచారు. కొంతకాలం తరువాత పాము దేహం అదృశ్యమై, ఆ గాజు పెట్టెను తెరువగా ఆ ప్రదేశమంతా దివ్యసుగంధ పరిమళాలు వ్యాపించినవి. ఇప్పటికి ఆ గాజు పెట్టెను మనం చూడవచ్చు.

ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి చుట్టూ పక్కల ప్రాంతాల నుండి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.