Home Unknown facts సూర్యుడికి నివేదనగా జరిపే పండుగే సంక్రాంతి…!!

సూర్యుడికి నివేదనగా జరిపే పండుగే సంక్రాంతి…!!

0
మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే! బీడు నేలను దుక్కి దున్ని పంటసిరిగా మార్చిన మానవుడికి ఇదే తొలి పండుగ. అప్పట్నుంచే మనిషి జీవితం బహు ముఖాలుగా, బహు విధాలుగా వికసించింది. అభ్యున్నతి దిశగా అడుగులు వేసింది. దీనంతటికి కారణం సూర్యుడు. సూర్య భగవానుడే మనకు జీవాధారం. సమస్త జీవరాశికి, వృక్షజాతి మనుగడకు ఆయనే కారణం.
  • ఈ సృష్టికి మూలాధారం సూర్య భగవానుడు. ఆ సూర్యుడే లేకపోతే… ఈ ప్రపంచం స్తంభించిపోతుంది. పండే పంటలకు ఆధారం సూర్యుడే. అందుకే… పాడిపంటలు చేతికి రాగానే… తమను చల్లగా చూసుకుంటున్న సూర్యుడికి నివేదనగా జరిపే పండుగే సంక్రాంతి. అలాగే పాడి పంటల్లో, కష్టనష్టాల్లో తమకు తోడుగా ఉంటూ… సేవలందించే మూగ జీవాలైన గోమాతలు, ఆవులను పూజించే సందర్భమే ఈ పండుగ.
  • తెలుగు లోగిళ్లలో కళా కాంతులు, సంతోషాలు నింపే పండుగను నాలుగు రోజులు జరుపుకోవడం మన ఆనవాయితీ. మొదటి రోజు భోగి, రెండోరోజు సంక్రాంతి, మూడోరోజు కనుమ, నాలుగో రోజు ముక్కనుమ జరుపుకుంటారు.
  • దేశమంతా జరుపుకునే పండుగ ఇది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పేరుతో దీన్ని పిలుస్తారు. నార్త్ ఇండియా ప్రజలు సంక్రాంతి రోజుల్లో గంగానదిలో స్నానం చేసి… సూర్యుడికి పూజలు చేస్తారు. వేల మంది హరిద్వార్, బెనారస్, అలహాదాబాద్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి… చలిగంగ స్నానాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ పాపాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి.
  • సంక్రాంతి నాడు కోల్‌కతాలో గంగా సాగర్ మేళా జరుగుతుంది. అదే సమయంలో… తమిళనాడులో పొంగల్ నాలుగు రోజులు జరుగుతుంది. సంక్రాంతి రోజును థాయ్ పొంగల్ అని పిలుస్తారు. పంజాబ్ హర్యానాలో భోగి నాడు లోహ్రీ జరుపుకుంటారు. గుజరాత్ ప్రజలు ఉత్తరాయణ్ పేరుతో సంక్రాంతిని 2 రోజులు జరుపుకుంటారు. కేరళలో మకర విళక్కు పేరుతో జరుపుకుంటారు. అదే రోజున శబరిమల అయ్యప్పస్వామి చెంత ఆకాశంలో మకర జ్యోతి దర్శనం ఉంటుంది.

Exit mobile version