Home Unknown facts సప్త వృక్షాలు, సప్త దేవాలయాలు ఉన్న అరుదైన శనీశ్వరుడి ఆలయం తెలుసా ?

సప్త వృక్షాలు, సప్త దేవాలయాలు ఉన్న అరుదైన శనీశ్వరుడి ఆలయం తెలుసా ?

0

శనిదేవుడికి ప్రత్యేకంగా ఒక దేవాలయం అనేది ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైనేదే ఈ శ్రీ శనేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయంలో 22 అడుగుల శనేశ్వరుడి విగ్రహం భక్తులకు దర్శనం ఇస్తుండటం విశేషం. ఈ ఆలయంలో సప్తవృక్షాలు, సప్తదేవాలయాలు ఉండటం మరో విశేషం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.Sapthavrkshalu Sapthadevalayalu

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మోమిన్ పేట మండలం కేంద్రానికి 6 కీ.మీ. దూరంలో ఎన్కతల అనే గ్రామంలో అత్యంత మహిమ గల శ్రీ శనేశ్వరస్వామి వారి దేవాలయం ఉన్నది. ఏనుగుతల ఆకారంలో ఒక శిలాశాసనం ఈ గ్రామంలో ఉండటంతో ఈ గ్రామానికి ఏనుగుతల అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది ఎన్కతల గా మారింది.

శనీశ్వరుడు ఈ జన్మకు సంబంధించే కాదు పూర్వజన్మల పాప కర్మలకూ దండనను విధించే క్రతువును నిర్వహించే బాధ్యత కలిగి ఉన్నవాడు. జన్మరీత్యా మనిషికి శనిమహర్దశా కాలాలు నడుస్తున్నప్పుడు వాళ్ల వాళ్ల పాపకర్మలను బట్టి వారిని ఆరోగ్యపరంగా, మానసికంగా దండిస్తూ ఉంటాడు. అయితే శనీశ్వరుణ్ణి శరణువేడటం ద్వారా ఆ బాధల నుంచి ఉపశమనం పొందొచ్చన్నది పురాణ వచనం. జాతక చక్రప్రకారం బుధ, గురు, శుక్ర మహర్దశలు ఎలా వస్తాయో అలాగే శనిమహర్దశా వస్తుంది. అయితే ఆ సమయంలో శనీశ్వరుడి వల్ల కలిగే బాధలు అధికంగా ఉండేవాళ్లు ఆయన్ను శాంతింపజేయడానికి పూజలు చేస్తుంటారు. శనీశ్వర మంత్రాన్ని చదవడం వల్ల ఆయన శాంతిస్తాడని అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయడమూ శుభఫలితాన్నిస్తుందని చెబుతారు.

ఇక ఆలయ విషయానికి వస్తే, ఈ దేవాలయ ప్రాంగణం అంత గతంలో పూర్తిగా అటవీ ప్రాంతం. ఈ ప్రాంతం నందు గతంలో నిర్మించిన దేవాలయం ఒకటి జీర్ణావస్థ స్థితిలో ఉండగా, ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని శంకర్ భారతి మహారాజ్ స్వామీజీ నూతనంగా నిర్మించి శని విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదేవిధంగా ఇచట సప్తదేవాలయాలు కూడా నిర్మించి అచటనే సప్తవృక్షాలను నాటారు. ఈ సప్తవృక్షాలను అశ్వని దేవతల రూపాలుగా పేర్కొంటారు.

సప్త వృక్షాలలో వేపచెట్టు ఆదిశక్తిగా, జిల్లేడుచెట్టు ఆదిగణపతిగా, రావిచెట్టు విష్ణుమూర్తిగా, శివరావిచెట్టు శివుడిగా, మేడిచెట్టు దత్తాత్రేయుడు గా, ఉసిరిక చెట్టు శ్రీ కృష్ణుడిగా, మారేడు చెట్టు మాతృ స్వరూపునిగా ఆరాదించబడుతున్నాయి.

గ్రహపీడ, దుష్టశక్తులు, మానసిక ఆందోళన, దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నవారు సప్తదేవాలయాలకు, సప్తవృక్షాల చుట్టూ 41 రోజులు ప్రదిక్షణలు చేస్తే, మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా గ్రహపీడ నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ప్రతి సంవత్సరం వచ్చే శనిత్రయోదశి రోజుల్లో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version