Home Unknown facts అఘోరాలు వచ్చే కొన్ని రహస్య ఆలయాల గురించి తెలుసా ?

అఘోరాలు వచ్చే కొన్ని రహస్య ఆలయాల గురించి తెలుసా ?

0

అఘోర అంటే భయం లేని వాడని అర్ధం. వీరు శివుడిని ఆరాధిస్తారు. వీరు ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తుంటారని చెబుతుంటారు. అఘోరాలు చాలా కఠినంగా ఉంటారు. వీరికి సంసారం, ఇల్లు, బంధాలు, కోరికలు ఏముండవు. శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఉంటూ ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటూ జీవనం కొనసాగిస్తారు. వీరు ధ్యానం చేస్తూ శివున్ని తమలో ఆవాహనం చేసుకుంటారు. కొన్ని సార్లు రోజుల తరబడి ఆహారం కూడా లేకుండా ధ్యాన ముద్రలో ఉంటారు. మరి అఘోరాలు వచ్చే కొన్ని రహస్య ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందం.

అఘోరాలు తమను తాము శివుని ప్రతిరూపాలుగా భావిస్తుంటారు. అందుకే స్మశానంలోనే సంచరిస్తూ కాలిన శవాల మధ్యలో బ్రతుకుతుంటారు. హిమాలయాల్లో ఉండే వీరి వయసు వందకు పైగానే ఉంటుంది. అఘోరాలు దత్తాత్రేయ స్వామిని ఆదిగురువుగా భావిస్తారు. ఇక మొదటిసారిగా బాబా కీనారాం అనే సాధువు అఘోరాగా మారాడని చెబుతారు. ఈయన దాదాపుగా 150 సంవత్సరాలు బ్రతికే ఉన్నాడని చెబుతారు. ఈయనకి దత్తాత్రేయుడు దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడని చెబుతారు. ఇక వీరు వచ్చే ఆలయాల విషయానికి వస్తే,

1. శ్రీశైలం – ఘంటారావం:

biggest secrets of Aghori Sadhus

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా లో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు, సముద్రమట్టానికి దాదాపుగా 458 మీ. ఎత్తున్న కొండపైన వెలసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయంలో శివుడు మల్లికార్జునస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న మల్లికార్జునస్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈవిధంగా జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న అద్భుత క్షేత్రమే శ్రీశైలం. ఇక్కడి ఆశ్చర్యాన్ని కలిగించే ఘంఠ మఠం అనే ఒక పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయం గురించి, ఇక్కడి మహత్యం గురించి తెలిసినవారు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఇక్కడ ఆణువణువూ ఒక అద్భుతమే అని చెప్పాలి. దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఘంఠ మఠం గురించి తెలిసిన సమాచారం ప్రకారం, పూర్వం ఘంటా కర్ణుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత దేవతలు విజయానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద గంటను మ్రోగించారని పురాణాలు చెబుతున్నాయి. ఆలా ఆ తరువాత ఎందరో మహారాజులు కూడా ఇక్కడ కొత్తగా ఘంటలని ప్రతిష్టించారు. ఇప్పుడు మనకి దర్శనం ఇచ్చే ఘంటా కూడా 600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతున్నారు. ఇక్కడ ఒక గుంట ఉండగా అందులో నిత్యం నీరు ఎప్పుడు ఉంటుంది. పూర్వం ఒకరు ఆ గుంట నుండి నీరు తీసుకువచ్చి ఆలయంలో ఉన్న సిద్దేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ ఉంటూ ఒకరు ఘంటను మ్రోగిస్తూ ఉండాలి. ఇలా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇలా ఘంటను మ్రోగిస్తూ సిద్దేశ్వర లింగాన్ని అభిషేకించినవారికి ఆకాశగమనం అనే విద్య లభిస్తుందని అంటే ఇలా ముగ్గురు ఏకకాలంలో చేస్తే ఆ ముగ్గురికి కూడా అష్టసిద్దులలో ఒకటైన గగనయాన సిద్ది కలుగుతుందని పురాణం. ఇంకా ఇక్కడ చిన్న నిర్మాణంలో ఒక దేవతారూపం ఉండగా, ఆ పక్కనే ఒక సాధకుడు ధ్యానిస్తున్నట్లుగా ఉండే విగ్రహం ఉంటుంది. ఇక్కడ సిద్ది, మోక్షం, పూర్వ జన్మరాహిత్యం పొందుటకు సాధువులు ఈ మఠానికి వచ్చేవారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది సిద్ది పొందినట్లుగా కొందరి నమ్మకం. ఇక్కడ ఘంటమఠం లో మొత్తం నాలుగు శివలింగాలు ప్రతిష్టించి ఉన్నాయి. ఇలా పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలసిన ఈ మహిమ గల ప్రాంతంలో అఘోరాలు కూడా వచ్చి ఎక్కువగా పూజలు చేసేవారని కొందరు చెబుతున్నారు.

2. తారాదేవి ఆలయం:

పశ్చిమబెంగాల్ రాష్ట్రం, తారపిత్ అనే ప్రాంతంలో తారాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని తాంత్రిక ఆలయంగా పిలుస్తారు. అందుకే ఇది తాంత్రిక ఆలయ పట్టణంగా పిలువబడుతుంది. తారపిత్ సాహిత్యపరంగా దేవత తారస్థానంలో కూర్చోవడం అని అర్ధం. బెంగాలీలో తారా అంటే కన్ను అని అర్ధం. అందుకే ఈ గ్రామానికి తారా అనే పేరు వచ్చింది. మన దేశంలోని దేవాలయాలలో అత్యంత శక్తివంతమైన ఆలయం ఇదేనని చెబుతారు. అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో సతీదేవి కళ్ళు పడ్డాయని చెబుతారు. మహాకాళియొక్క మరో రూపమే తారాదేవి. ఈమె దశమహావిద్యలలో ఒకరుగా వెలుగొందుచున్నది. గర్భాలయంలో ప్రతిష్టించిన తారాదేవి ఇచట సిల్కు వస్త్రము, పువ్వుల దండ మరియు ఆభరణములు ధరించి దర్శనం ఇస్తుంటుంది. అంతేకాకుండా గర్బాలయంలో తారాదేవి బాలశివునికి స్తన్యమిస్తున్నట్లు ఒక రాతిపై చెక్కిన శిల్పం ఒకటి కనిపిస్తుంది. భామకేపియా అనే సాధువుకు తారామాత ఇక్కడ దర్శనం ఇచ్చిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారి పాదముద్రలు కూడా మనం చూడవచ్చు. అయితే ఈ పాదముద్రలు ఆలయం పక్కనే ఉన్న స్మశానం లో ఉన్నాయి. భక్తులు పాదముద్రలను కూడా భక్తితో దర్శిస్తారు. ఇక ఇక్కడి స్మశానానికి అఘోరాలు వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతారు.

3. విద్యాచలం:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ లోని వింధ్యాచలం లో వింధ్యవాసిని ఆలయం ఉంది. ఈ ఆలయం ఉరి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ అమ్మవారు దుర్గాదేవి రూపం అని చెబుతారు. ఈ అమ్మవారినే కౌశికీదేవి అని కూడా అంటారు. ఈ ఆలయానికి దగ్గరలో గంగాతీరాన అష్టభుజ దేవి మందిరం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే ఒక గుహ ఉండగా ఆ గుహలో కాళికాదేవి ఆలయం ఉంది. ఈ గుహ ఆలయంలోకి అఘోరాలు వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతుంటారు.

4. పశుపతినాథ్ ఆలయం:

నేపాల్ దేశంలో ఖాట్మండు నగరంలో బాగమతి నది ఒడ్డున పశుపతినాథ్ దేవాలయం ఉంది. ఇక్కడ శివుడిని పశుపతిగా ఆరాధిస్తారు. శివుడిని పశుపతిగా కొలిచే ఈ ఆలయంలో గ్రహణం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి బాగమతి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని ఆరాదిస్తే పుణ్యం వస్తుందని, నేపాలీ దేశస్థులు కూడా ఈ ఆలయాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ పవిత్ర ఆలయానికి శివరాత్రి సమయంలో కొన్ని వేలసంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో దర్శనీయ స్థలాలు, చతుర్ముఖ స్వామివారు, ఆర్యఘాట్, గౌరీ ఘాట్, బ్రహ్మ దేవాలయం ఉన్నవి. ఇక్కడ ఉన్న ఆర్య ఘాట్ లో స్మశాన వాటిక ఉంది. ఇక్కడికి అఘోరాలు ఎక్కువగా వస్తుంటారని చెబుతుంటారు.

5. కపాలీశ్వరస్వామి ఆలయం:

చెన్నై నగరంలోని మైలాపూర్‌లోని అరుల్‌మిగు లో కపాలీశ్వరస్వామి ఆలయం. లయకారకుడైన శివుడు స్వయంగా భువిపై అవతరించిన క్షేత్రంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. అరుల్‌మిగు కర్పగవల్లిగా ఆమె పరమేశ్వరుని పక్కన వెలిసింది. అందుకే దీన్ని భూకైలాసంగా అంటుంటారు. అమ్మవారు నెమలి రూపంలో శివుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసింది అందుకనే మయిల్‌ అంటే నెమలి పేరుతో మైలాపూర్‌గా ఏర్పడింది. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ఆశ్రమానికి అఘోరాలు ఎక్కువగా వచ్చి ధ్యానం చేస్తుంటారట.

6. శ్రీ కాళికాదేవి ఆలయం:

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా పట్టణములో కాళీఘాట్ లో ప్రాచుర్యం పొందిన శ్రీ కాళికాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయములో ఉన్న అమ్మవారి వలనే ఈ నగరానికి కలకత్తా అని పేరు వచ్చినది. ఆలయములో అమ్మవారి పూర్తి సంపూర్ణ విగ్రహం అనేది ఉండదు. సుమారు మూడు అడుగులు ఉన్న శిరస్సు భాగం మాత్రం ప్రతిష్టించబడి ఉంటుంది. అంతేకాకుండా కలకత్తా కాళీ మాత పెద్ద కళ్ళతో,సుమారు 2 అడుగుల పొడవుగల నాలుక చాచి ఉంటుంది. కలకత్తా పట్టణానికి ఆరాధ్య దైవం అయినా కాళికామాత ఉన్న ఈ ఆలయం దేశములోని 51 శక్తి పీఠాలలో ఇది మూలాధారమైనది.ఇక్కడి భక్తులు దుర్గ, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురమ్మలను ఈ కాళికామాతలోనే దర్శిస్తారు. ఈ ఆలయానికి రాత్రి సమయాలలో అఘోరాలు వచ్చి ధ్యానం చేస్తుంటారని చెబుతుంటారు.

7. గుప్తకాశీ:

ఉత్తరాకాండ్ లోని గౌరీకుండ్ నుండి 34 కి.మీ. కేదారనాధ్ నుండి 48 కి.మీ. దూరంలో ఈ గుప్తకాశీ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి సిద్దేశ్వరమహదేవునిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయ వెనుక భాగంలో గంగ, యమునా నదుల నీటిపాయ ఉన్నది. ఈ నీటిని తీసుకొనే స్వామిని అభిషేకించాలి. పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉన్నది. ఈ ఆలయం ముందుభాగంలో, చదరంగా ఉన్న ఒక కుండం ఉన్నది. ఆలయం ముందు నుంచి, కుండలోనికి అయిదారు మెట్లు, ఈ మెట్లను అనుకోని, రెండు పక్కల గట్టుమీద, రెండు నందులు ఉన్నాయి. ఈ రెండు నందుల నోటి నుండి నీటిధార నిరంతరం క్రిందనున్న కుండలోనికి బాగా వేగంగా పడుతూ ఉంటుంది. ఈ రెండు దారాలలోని నీరు, సాక్షాత్తు గంగ, యమునా నదులోనుండి వచ్చినవే అని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. ఇక ఆలయంలోపల ఉన్న స్వామి అర్ధనారీశ్వరుడు. ఈయన రూపం సగభాగమే శివుడు అని, మిగిలిన సగభాగం పార్వతి అమ్మవారి ప్రతీక అని స్థల పురాణం మనకు వివరిస్తుంది. అందువల్ల ఇక్కడ ఆలయం చుట్టూ చేసే ప్రదిక్షణ ఇక్కడ చేయకూడదని, ఆలయం ముందు నుండి ఎడమవైపుగా, ఆలయం వెనుకవైపు వరకు మాత్రమే వెళ్లి మరల వెనుకకు తిరిగి రావాలని చెబుతారు. ఇలా చంద్రశేఖర మహాదేవ ఆలయంలోని స్వామి సాక్షాత్తు కాశీలోని విశ్వేశ్వరుడే అని ఇక్కడ భక్తుల నమ్మకం. అఘోరాలు ధ్యానం చేసుకోవడానికి ఎక్కువగా ఈ ఆలయానికి కూడా వస్తుంటారని చెబుతారు.

ఈవిధంగా అఘోరాలు ధ్యానం చేసుకోవడానికి, పూజలు చేయడానికి ఎక్కువగా ఈ ఆలయాలకు వస్తుంటారని చెబుతారు.

Exit mobile version