ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం షిరిడి. ఇక్కడ కొలువై ఉన్న సాయిబాబా ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి కుల, మతం లేకుండా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ షిరిడి సాయినాధుని ఆలయంతో పాటు కొన్ని దర్శనీయ స్థలాలు అనేవి ఉన్నాయి. మరి అవి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.మహారాష్ట్రలోని, అహ్మద్ నగర్ జిల్లా, కోపర్ గావ్ మండలం నుండి 15 కి.మీ. దూరంలో షిరిడి పట్టణం ఉంది. ఇక్కడ మొత్తం దర్శనీయస్థలాలు ఆరు ఉన్నాయి. గురుస్థానం:1854 లో సాయిబాబా 16 సంవత్సరాల బాలయోగిగా ఫకీర్ రూపంలో షిరిడీకి వచ్చారు. అయితే షిరిడి కి వచ్చిన తరువాత అయన తొలిసారి ఇక్కడ ఉన్న వేపచెట్టు క్రింద కూర్చొని కనబడటం జరిగింది. అయన ఎప్పుడు అక్కడే కూర్చొని ధ్యానం చేసుకునే వారని చెబుతారు. ఇక ఈ ప్రదేశాన్ని బాబా తన గురుస్థానం అని చెప్పేవారు. అందుకే భక్తులు ఈ ప్రదేశాన్ని గురుస్థాన్ గా కొలుస్తారు. ద్వారకామాయి:ఆ షిరిడీనాధుడు అరవై సంవత్సరాల పాటు నివసించిన ప్రదేశంగా ఇక్కడ ఉన్న పురాతన మసీదు అని చెబుతారు. సమాధి మందిరానికి కుడివైపు సమీపంలో ఉంటుంది. ఇక్కడ బాబా ఆనాడు రాజేసిన ధుని ఇప్పటికి అఖండగానే వెలుగుతూ ఉంది. షిరిడి వెళ్లే భక్తులకి ప్రసాదించే ఊదీని ఈ ధుని నుంచే సేకరించి ఇస్తారు. చావడి:ద్వారకామాయికి సమీపంలోనే ఈ చావడి ఉంది. ఈ చావడిలోనే బాబా తన జీవితంలో చివరి పది సంవత్సరాలు రోజు విడిచి రోజు ఇక్కడనే నిద్రించేవారు. ఆరతులు రచించిన తొలి రోజుల్లో బాబాకు సెజ్ హారతి, ఉదయాన్నే నిదురలేపే కాకడ ఆరతి భక్తులు ఆలపించడం ఇక్కడే మొదలైంది. చావడిలో ఒకప్పుడు నిద్రించిన స్థలంలోకి వెళ్లేందుకు ఇప్పటికి స్త్రీలకి ప్రవేశం లేదు. లెండివనం:ఒకప్పుడు ఇది పెద్ద తోట. ఈ ప్రదేశంలో లెండి అనే వాగు ప్రవహించేది అందుకే ఈ ప్రదేశాన్ని లెండి బాగ్ అని పిలుస్తారు. సాయిబాబా నాటిన ఎన్నో మొక్కలు ఇప్పటికి ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంటాయి. ఇక్కడ పూసిన పూలనే బాబా నిత్య పూజలకు అలంకరణకు వినియోగిస్తారు. సాయి సంగ్రహాలయం:ఇది బాబాకి సంబంధించిన ఒక మ్యూజియం. ఇందులో బాబా గోధుమలు విసిరిన తిరగలి, పొగ పీల్చిన చిలుం గొట్టాలు, సాయి పాదుకలు, బాబా కూర్చున్న రాతి శిల, అయన ధరించిన వస్త్రాలు, కంబళి, స్నానం చేయడానికి వినియోగించిన రాగి పాత్ర, భక్తులు సమర్పించిన సింహాసనం ఇలా ఇవ్వని కూడా ఈ మ్యూజియంలో దర్శించవచ్చు. ఖండోబా ఆలయం:బాబాను మొదటి సారిగా సారిగా సాయి అని పిలిచిన మహాభక్తుడు మహాల్సావతి కులదైవం ఖండోబా. ఈ స్వామిని వీరబద్రుడి అవతారం అంటారు. బాబా తన భక్తులు ఇచ్చే దక్షిణలో చాలా భాగం ఖండోబా ఆలయ నిర్వహణ కోసం ఇచ్చేవారట. ఇంకా ఈ ప్రదేశంలోనే మరి కొన్ని ఆలయాలను భక్తులు దర్శనం చేసుకోవచ్చు.ఇలా షిరిడి వెళ్లిన ప్రతి ఒక్కరు ఆ సాయినాధుడి దర్శనం తో పాటుగా ఈ ఆరు దర్శనీయస్థలాలను తప్పకుండ చూసి తరించాలని చెబుతారు.