ప్రతి దేవుడు ఏదోక అవతార రూపంలో భక్తులకి దర్శనం ఇస్తుంటే, త్రినేత్రుడైన పరమశివుడు ఒక్కడు మాత్రం ప్రతి దేవాలయంలో శివలింగ రూపం లో దర్శనం ఇస్తుంటాడు. మరి శివలింగం అంటే ఏంటి? శివుడు ఎందుకు అలా దర్శనం ఇస్తాడు? ఏ లింగాన్ని ఎవరు ఎలా పూజించాలనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశమేలింగం. భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇది అంతా లయం చెందుతుంది. అందుకే దీనిని లింగం అని అన్నారు. ‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. అందుకే అది లింగమైంది. ఈ సృష్టి సమస్తం శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిభిడృకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయరూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు. శివలింగాలు ఐదు రకాలుగా మనకు గోచరిస్తుంటాయి. తనంతట తానుగా అవతరిచినది స్వయంభూలింగం. ధ్యానపూర్వకమైనది బిందు లింగం. మంత్రపూర్వకమైనది ప్రతిష్ఠాలింగం. నాలుగవది చర లింగం. ఐదవది శివుని విగ్రహమైన గురులింగం. అయితే పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు. ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందోనన్న విషయాలు లింగపురాణంలో వివరించి వున్నాయి. అందులో రత్నాజ శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతోపాటు వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది. శివునికి సంబంధించిన లింగాలలో అత్యంత పవిత్రమైన లింగం బాణలింగం. ఇవి తెల్లగా, చిన్న అండాకారలంలో నదీప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి వుంటాయి. ఇది నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తుంది. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు. ఇక లింగపూజ చేసుకునేవారు ఉత్తరముఖంగా కూర్చొని వుండాలి. అలాగే రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు తమతోపాటు తప్పనిసరిగా పూజలో వుంచుకోవాలని శివపురాణంలో చెప్పబడింది.