పరమశివుడు లింగ రూపంలోనే ఎక్కువగా భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. కానీ ఇక్కడ గుట్టపైన వెలసిన శివుడు లింగ రూపంలో కాకుండా శివమూర్తి శిల్పం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది. మరి ఇంత విశేషాలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని, రంగారెడ్డి జిల్లా, కీసరమండలం లో శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇచట ఉన్న ఒక కొండని కీసరగుట్ట అని అంటారు. ఈ కీసరగుట్ట పైన అతి పురాతనమైన శివాలయం ఉంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు శ్రీ రామలింగేశ్వరునిగా పిలవబడుతున్నాడు. ప్రధాన ఆలయానికి సమీపంలో అనేక శివలింగాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగానికి బదులు శివమూర్తి శిల్పం దర్శనం ఇస్తుంది. ఇక స్థల పురాణానికి వస్తే, తేత్రాయుగంలో ఒకసారి శ్రీరాముడు సీతాదేవి, హనుమంతుడు ఇక్కడికి వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్దులై ఈ ప్రాంతంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకోని, ఈ విషయమై ఈ ప్రాంతంలోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగం ప్రతిష్టాపన కోసం ఒక ముహుర్తాన్ని నిర్ణయించారు. శ్రీరాముడు హనుమంతుడిని కాశీ క్షేత్రమునకు వెళ్లి శివలింగమును తీసుకొని రావాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు హనుమంతుడు బయలుదేరి వెళ్లగా అచట ఆంజనేయునికి శివుడు నూటొక్క శివలింగరూపములో దర్శనమిచ్చాడు. ఆవిధంగా నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ మహర్షులు సూచించిన సమయం ఆసన్నం అవుతుంది కానీ హనుమంతుడు ఇంకా రాకపోవడంతో, శ్రీరాముడు మహర్షులు నిర్ణయించిన సమయానికే లింగాన్ని ప్రతిష్టించాలని తలచి శ్రీరాముడు శివుడిని ప్రార్ధించగా శివుడు ప్రత్యేక్షమై శివలింగ రూపం ధరించగా అప్పుడు ఆ లింగాని రాములవారు ప్రతిష్టించారు. అందువలన ఈ స్వామికి శ్రీ రామలింగేశ్వరస్వామి అనే పేరు వచ్చినది. ఆ తరువాత వచ్చిన హనుమంతుడు అప్పటికే లింగం ప్రతిష్టించడం చూసి అలిగి తన తోకతో లింగాలను పడివేసాడు. అలా పడిపోయిన 101 శివలింగాలు అక్కడ అక్కడ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. అప్పుడు హనుమంతుడిని శాంతిపచేయడనికి శ్రీరాముడు, ఈ క్షేత్రం కేసరగిరి గా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదించి, హనుమంతుడు తెచ్చిన లింగాలలో ఒక లింగాన్ని స్వామివారి వామభాగములో ప్రతిష్టించాడు. అదే శ్రీ మారుతీ కాశీ విశ్వేశ్వరశివలింగం. మహాశివరాత్రి పండుగ సందర్బంగా ఈ ఆలయంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకొనుటకు రాష్ట్రము నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.