ఈ ఆలయం చాలా పురాతన, మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం విశేషం ఏంటంటే తేత్రాయుగంలో పరుశురాముడు ప్రతిష్టించిన 108 శివలింగాల వరుసలో ఇది చివర మహేశ్వరలింగంగా తెలియుచున్నది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ క్షేత్రం భక్తుల పాలిట ఆరోగ్యక్షేత్రముగా విరాజిల్లుతుంది. ఈ ఆలయంలో శ్రీ జడల రామలింగేశ్వరుడు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మొదలగువారు ఇచట కొలువై ఉన్నారు. ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, తేత్రాయుగంలో కార్తవీర్యార్జునుడు అను రాజు ఒక రోజు వేటకు వెళ్లి జమదగ్ని మహర్షి ఆశ్రమమునకు ఆతిధ్యమునకు వెళ్లెను. జమదగ్ని తన వద్ద గల శబళ అను హోమధేనువు మహిమతో ఆ చక్రవర్తి సమస్త పరివారానికి పంచభక్షపరమాన్నాలతో విందును ఏర్పాటు చేసాడు. అప్పుడు విషయం తెలుసుకున్న రాజు ఆ హోమధేనువును నాకివ్వమని మహర్షిని కోరగా, జమదగ్ని “హోమధేనువు తపః ప్రభావముగల మహర్షుల వద్ద తానంతట తానై ఉండును కానీ బలవంతంగా ఎవరి వద్ద ఉంచుట సాధ్యం కాదని” చెప్పగా, చక్రవర్తి వినక బలవంతంగా దాన్ని తీసుకురమ్మని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. అంతట జమదగ్ని ఆ గోవుతో నిన్ను నేను రక్షించలేను నిన్ను నీవు రక్షించుకొనుము అనగా అప్పుడు హోమ ధేనువు కార్తవీర్యార్జునుని సైన్యమంతటిని తృటిలో సంహరించెను. అప్పుడు చక్రవర్తి జమదగ్ని పైకి యుద్ధమునకు రాగ, మహర్షి కుమారుడు పరశురాముడు కార్తవీర్యార్జుని ఓడించాడు. అందుకు కార్తవీర్యార్జునుడు కోపించి పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో జమదగ్ని తల ఖండించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో జమదగ్ని తల ఖండించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన పరశురాముడు మహాకోపాద్రిక్తుడై, వేయ్యి చేతులు గల కార్తవీర్యార్జునుడిపై దండెత్తి అతనిని సంహరించి, 21 మార్లు భూప్రదిక్షిణ చేసి క్షత్రియుడను వాడు కనిపించకుండా సంహరించి, ఈ భూమండలమంతయూ, బ్రహ్మ మానస పుత్రుడైన కశ్యప ప్రజాపతికి దక్షిణగా సమర్పించాడు. ఆ తరువాత విశ్వకళ్యాణార్థమై 108 క్షేత్రములలో శివలింగ ప్రతిష్టలు చేసి, ప్రతి క్షేత్రం నందు తన తపః శక్తిని శివలింగమునకు ధారపోసి వాటికీ ప్రాణ ప్రతిష్ట చేసి, దివ్యక్షేత్రములుగా మలచాడు. తాను తలపెట్టిన 108 శివలింగములలో 108 వ శివలింగ ప్రతిష్ట చివరగా ఈ క్షేత్రమున ప్రతిష్టించాడు. ఇలా ప్రతిష్టించి తపోనిష్టితో కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసినను శివుడు ప్రత్యక్షం కానందున ఆగ్రహించి ఆ శివలింగం పైన తన గండ్రగొడ్డలితో కొట్టాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇన్నాళ్లు నీవు తపస్సు చేసిన ఈ క్షేత్రం సుప్రసిద్ధ క్షేత్రములలో ఒకటిగా వెలుగొందునని, ఇచట ఇప్పటినుండి కలియుగాంతం వరకు నేను నిలిచి యుండి భక్తుల కొరికేలు నెరవేర్చునని, ఈ క్షేత్రం భక్తుల పాలిట ఆరోగ్యక్షేత్రం గా విరాజిల్లునని వాగ్దానము చేసెను. ఇలా ఈవిధంగా పరమశివుడు ఇక్కడ వెలిశాడని స్థల పురాణం తెలియచేస్తుంది.