Home Unknown facts స్వామి వెలిసిన కొండని గొడ్రాలికొండ అని పిలుస్తారు ఎందుకు ?

స్వామి వెలిసిన కొండని గొడ్రాలికొండ అని పిలుస్తారు ఎందుకు ?

0

మన దేశంలోని కొన్ని ఆలయాల స్థల పురాణం ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని ఆలయాల మహత్యం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఆలా ఆశ్చర్యాన్ని కలిగించే పుణ్యక్షేత్రమే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం. ఇక్కడ పూర్వం ఒక పుట్ట కొండగా మారగా ఆ కొండపైన స్వామివారు వెలిశారని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Venkateswara Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం, రాజంపల్లె గ్రామం సమీపంలో గొడ్రాలికొండ అనే చిన్న కొండ పైన తిరుమలనాథ స్వామివారి ఆలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇంకా ఈ క్షేత్రం చారిత్రక ప్రాధాన్యత గల సుప్రసిద్ధ క్షేత్రం. సంతానం లేని దంపతులు నిష్ఠిగా ఈ స్వామివారిని కొలుస్తూ కొండచుట్టు ప్రదక్షిణ చేస్తే వారు సంతానవంతులవుతారని ఇక్కడి భక్తుల నమ్మకం.

అయితే ఓ గొడ్రాలు భక్తి కారణంగా ఈ కొండ ఏర్పడటం వలన దీనిని గొడ్రాలికొండ అనే పేరుతో పిలుస్తూ వుంటారు. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం ఈ ప్రదేశానికి దగ్గరలో గల గ్రామంలో రాజయ్య, రాజమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. భర్త బద్ధకస్తుడు కావడంతో రాజమ్మే పొరుగూరు వెళ్లి పాలను అమ్మేసి వస్తూ వుండేది. మార్గ మధ్యంలో ఆమెకి ఒక పాము పుట్ట కనిపించడంతో, అందులో వేంకటేశ్వరస్వామి ఉన్నట్టుగా భావన చేసుకుని రోజు కొన్ని పాలు పోయసాగింది. తనకి సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్ధించసాగింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ఆ పుట్టలో ప్రవేశించి ఆ పాలను తాగుతూ ఉండేవాడు.

స్వామి మహిమ కారణంగా ఆ పుట్ట రోజురోజుకీ కొండలా పెరుగుతూ వెళ్లిందట. దాంతో ఆమె తెచ్చిన పాలన్నీ అందులో పోయడానికే సరిపోయేవి కావు. విషయం తెలుసుకున్న భర్త రాజమ్మను అనుసరిస్తూ వచ్చి దండించబోగా స్వామి ప్రత్యక్షమై వారిస్తాడు. ఆ దంపతులకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. అలా రాజమ్మ భక్తి శ్రద్ధలకు ఈ కొండ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. నేటికీ సంతాన లేమితో బాధలుపడుతోన్న వాళ్లు, ఈ క్షేత్రాన్ని దర్శించి సంతానాన్ని పొందుతూ వుండటం విశేషం.

అయితే మూడు కిలోమీటర్ల చుట్టుకొలత గల ఈ కొండచుట్టు సంతానం లేని దంపతులు తడి బట్టలతో ప్రదక్షిణ చేసి ఆ రాత్రి అక్కడే నిద్రిస్తే వారికీ సంతానం కలుగుతుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం.

Exit mobile version