ఆర్తజన రక్షకుడు, భువనైక మోహన రూపుడు, వేదాలకు మూలమైన దేవుడు.. కథా నాయకుడై పురాణాలను నడిపించిన పరంధాముడు.. మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగావతారం ఎత్తిన మహా విష్ణువునరసింహ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి. వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తులలో నరసింహ తత్వం వర్ణించబడి వుంది.
జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లే జరుగవు. మన చుట్టూ ఉండే బంధుమిత్రులు, చేసే ఉద్యోగం, వివాహం, సంతానం అన్నీకూడా మన నియంత్రణ లేకుండానే ఏర్పడుతుంటాయి. పూర్వకర్మలద్వారా వచ్చే ఆలోచనలుకూడా మన నియంత్రణ లేకుండా ఉంటాయి. వాటివల్ల మళ్ళీ కర్మ, మళ్ళీ జన్మ పునరావృతమవుతూనే ఉంటాయి. కానీ వాస్తవానికి మన ఆలోచనలే మనకు భయాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంటాయి. మన ఆలోచనలు, పూర్వకర్మల్లో చేసిన పనులే ప్రస్తుతం మనకు శోక కారణాలు కూడా అవుతుంటాయి. అందుకని, అటువంటి ఆలోచనల వల్ల వచ్చే భయాలను మన దగ్గరకు రాకుండా, అనవసరమైన ఆపదలు, రోగాలు మన దరి చేరకుండా ఉండటానికి ప్రార్థించే దైవం నారసింహ స్వామి.
మండన మిశ్రునితో శాస్త్రచర్చ నేపథ్యంలో, ఒక రాజు శరీరంలోకి ఆదిశంకరులు ప్రవేశిస్తారు. ఈ సంగతి తెలుసుకున్న ఆ రాజ్యపు మంత్రి ఆయన శరీరాన్ని తగులబెట్టాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు శ్రీనృసింహ స్వామిని శంకరులు ప్రార్థిస్తారు. ఆయన దేహం దగ్ధం కాకుండా నారసింహుడు రక్షిస్తాడు. ఆ సందర్భంలో శంకరులు చేసిన ప్రార్థనే శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం.
అన్నమయ్యను కూడా ఆపద నుంచి కాపాడిన కరుణామయుడు నారసింహుడే. భక్తితో కొలిచినవారికి ఆయన కొంగు బంగారం. ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా ఆదుకొని, దుష్ట శిక్షణ చేశాడు. ఆర్తరక్షణ పరాయణుడైన నరసింహ స్వామి భక్తులను మృత్యువు నుంచి కాపాడతాడు. స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్ధం అందులో నిబిడీకృతమై వున్నట్లు తెలుస్తుంది.
ఈ నృశింహ మంత్రంలో ఉన్న ఒక్కొక్క నామం నృశింహుని ఒక్కో తత్త్వాన్ని తెలియజేస్తుంది. ఉగ్రం అంటే నృశింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రానే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది.
వీరం అంటే.. సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి. కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే.
మహావిష్ణుం అంటే అన్ని లోకాల్లో ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు.
జ్వలంతం అంటే సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్త్వమే జ్వలంత శబ్దానికి అర్థం.
సర్వతోముఖం అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం.
నృసింహం అంటే.. సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్ఠమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు.
భీషణం అంటే నరసింహుని శాసనశక్తి ప్రతీక భీషణత్వం. అత్యంత భయంకరమైన రూపం ఇది.
భద్రం అంటే.. భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. ఇదే భద్రత్వం.
మృత్యుమృత్యుం అంటే.. స్మరణ మాత్రం చేత అప మృత్యువును దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే. మృత్యువును కలిగించేదీ, మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే.
మృత్యువు అంటే కేవలం మరణం అని మాత్రమే అర్థం కాదు. ఇంతకన్నా చావే నయం, అని మనం చాలాసార్లు అనుకుంటాం. తీవ్రమైన రోగం, ఆర్థిక సమస్యలు (అప్పులు), అవమానాదులు అన్నీ మరణ సదృశాలే. రోగ భయం, మృత్యు భయాదులనుండి దూరం చేసే మంత్రరాజమిది. ఆరోగ్య సిద్ధికి, ఆయుష్షుకు సూర్యోపాసన ముఖ్యమైనట్లుగానే నరసింహ ఉపాసన కూడా.