పంచభూతాలు, అష్టదిక్కుల తర్వాత అత్యంత ప్రాధాన్యత నవగ్రహాలకు దక్కుతుంది. మనిషి జన్మకుండలిలో నవగ్రహాలు ఏవిధంగా వాటి ప్రభావం చూపుతాయో.. అదే విధంగా మనం నిర్మిస్తున్న గృహంలో కూడా నవగ్రహాలు వాటి ప్రభావాన్ని చూపుతాయి. జన్మకుండలిలో లగ్నానికి ప్రాధాన్యం ఉన్నట్టే.. గృహానిర్మాణంలో స్థల నాభి ముఖ్యపాత్ర పోషిస్తుంది. స్థల నాభికి పూర్వం వైపు అంటే తూర్పు వైపు సూర్యుడు, పడమర వైపు శని, ఉత్తరం వైపు బుధుడు, దక్షిణం వైపు కుజుడు ఉంటారు.
ప్రతీ ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు… ఎంత చేసినా ఏదో ఒకరకంగా ఇబ్బంది పడి ఉంటారు. కర్మ సిద్ధాంతం నమ్మిన వారు తప్పక గ్రహప్రభావమని భావిస్తారు. దీనికోసం భక్తులలో దాదాపు అందరూ ఏదో ఒక సందర్భంలో నవగ్రహారాధన చేస్తారు. నవగ్రహాల అనుగ్రహం ఉంటే బాధలు పోతాయి అనేది కర్మ సిద్ధాంతం పేర్కొంటుంది. కాబట్టి వ్యతిరేకంగా ఉన్న గ్రహాలకు ఆయా మార్గాలలో శాంతి చేసుకుంటారు. నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తుంటారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజ గ్రహానికి కందులు, బుధ గ్రహానికి పెసలు, గురు గ్రహానికి సెనగలు, శుక్ర గ్రహానికి బొబ్బర్లు, శని గ్రహానికి నువ్వులు, రాహుగ్రహానికి మినుములు, కేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా పరిగణిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇకపోతే నవధాన్యాలను దైవకార్యాల్లోను శుభకార్యాలలోను ఉపయోగిస్తారు. వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలోపోసి ఉంచడమనే ఆచారం వుంది. అవి మొలకెత్తి బాగా పెరిగితే ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని భావిస్తారు. అంతే కాకుండా నవధాన్యాల నవగ్రహాల అనుగ్రహం వారిపై బాగానే ఉంటుందని విశ్వసిస్తారు. నవధాన్యాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి వుండి ఎంతో బలమైన పోషకాలను అందిస్తాయి. ఆ పోషకాలను స్వీకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించమనే అర్థం కూడా ఇందులో వుందని పండితులు అంటున్నారు.
నవధాన్యాలలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉన్నాయి. వాటిని సమపాళ్లలో స్వీకరించినప్పుడే దేహానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. జీవితంలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు గల వాళ్లని కలుపుకు పోయినప్పుడే, పరిపూర్ణత ఏర్పడుతుందనే విషయాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది.