ముంగిట్లో ఇంద్ర ధనుస్సును నిలిపే రంగవల్లులు.. నోరూరించే పిండి వంటలు, కొత్త లుక్ ఇచ్చే సంప్రదాయ దుస్తులు.. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండగ శోభ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి ఘనంగా పండుగను జరుపుకుంటున్నారు. తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరికి వచ్చి సంక్రాంతి జరుపుకుంటారు. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు. సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటి.
జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఇది ఆంధ్రులకి అతి పెద్ద పండుగ. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రాంతి, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ) జరుపుతారు అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని పేర్కొంటారు.
అందుకే తెలుగు పల్లెలు ఈ సమయంలో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ పండుగకు నెలరోజుల ముందునుంచే ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ఇక భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు వేసి తమ సరదా తీర్చుకుంటారు.
ఇక సంక్రాంతి అనగానేనోరూరించే పిండి వంటలు తెలుగు రుచులు ఆశ్వాదించాల్సిందే. తెలుగువారికి అతి పెద్ద పండుగ కావడంతో తెలుగువాడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరికి వచ్చి ఈ పండుగ జరుపుకుంటారు. రెండో రోజు మకర సంక్రాంతి నిర్వహించుకుంటారు. ఈ రోజు ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేస్తారు.
మకర సంక్రాంతి రోజు బెల్లంతో పాటు గుమ్మడి కాయలు, నువ్వుల్ని దానం చేస్తే మంచిది. ఎందుకంటే మకర రాశికి అధిపతికి శని, అయితే శని వాత ప్రధాన గ్రహమని శాస్త్రం చెబుతుండగా వాతమనేది నూనె లాంటి పదార్థాల వల్ల, గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది కాబట్టి ఆ రోజు తెలకపిండి నలుగుతో స్నానం చేసి శనీశ్వరుని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడి కాయలు దానం చేయాలని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు.
ఇక మూడో రోజు కనుమను నిర్వహించుకుంటారు. కనుమ పండుగ పూట ఎక్కువగా పశువులకు ప్రాధాన్యం ఇస్తారు. ఏడాదంతా కష్టపడి పని చేసినా పశువులను ఆ రోజు ఎంతో బాగా చూసుకుంటారు.