Home Unknown facts వరలక్ష్మీ వ్రతం ఎందుకు ఆచరిస్తారో తెలుసా ?

వరలక్ష్మీ వ్రతం ఎందుకు ఆచరిస్తారో తెలుసా ?

0

దక్షిణయానం వేసవి చివరలో వర్షరుతువు ప్రారంభంలో వచ్చేదే శ్రావణమాసం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణయానం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అలాగే శ్రావణమాసంలో చంద్రుని ప్రభావం ఎక్కువ. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రుని సహోదరి శ్రీ మహాలక్ష్మీ. అందుకే శ్రావణమాసంలో మంగళవారం మంగళగౌరిని.. శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీని పూజిస్తారు. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో శ్రీమహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు.

Significance Of Varalakshmi Vrathamసర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్థిల్లాలని మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. శివుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి చెప్పినట్లు స్కాంద పురాణంలో ఉంది. సౌరమానం ప్రకారం హిందూ సంవత్సరాదిలో ఐదో నెల శ్రావణమాసం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతీరోజూ పండగలా చేసుకుంటారు. శ్రావణమాసానికి పరిపూర్ణత తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం.

పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు సతీమణి మహాలక్ష్మీ వివిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ.. అందర్నీ కంటికిరెప్పలా కాపాడుతుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే వరలక్ష్మిని పూజించడం చాలా శ్రేష్టం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తే.. విశేష ఫలితాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం.

శ్రావణ మాసంలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

అయితే ఈ పూజలు ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. అంతే కాదు పెళ్లి కాని కన్నె పిల్లలు కూడా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా ఈ పూజలో పాలుపంచుకుంటారు. వరలక్ష్మీ వ్రతం రోజు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారు ముందు రోజు నుంచి తన భాగస్వామికి దూరంగా ఉండాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే నిద్రలేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి పూజ చేయాలి.

పూజ చేస్తున్నంత సేపు మన మనసుని మొత్తం అమ్మవారి పై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చేయాలి. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం చేసేవారు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.అలాగే ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి. కనీసం అయిదుగురు ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి.

 

Exit mobile version