Home Unknown facts సింహాద్రి అప్పన్న ఆలయం గురించి ఆశ్చర్యకర నిజాలు

సింహాద్రి అప్పన్న ఆలయం గురించి ఆశ్చర్యకర నిజాలు

0

వరాహ – నరసింహ అవతారాల సమ్మేళనంగా అలరాలుతున్న సింహాద్రి నాథుడు ద్వయరూపాల్లో దర్శనమిచ్చే భక్తవరదుడు. ఏడాదికి ఒక్క రోజు మాత్రమే లభించే సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని కొన్ని క్షణాల పాటైనా కనులార వీక్షించడం మహా అధ్బుతంగా భక్తులు భావిస్తారు. మరి శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు? ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం ఎందుకు ఉంటుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Simhadri Appannaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్టణం జిల్లా, విశాఖపట్టణముకు 11 కీ.మీ దూరములో తూర్పు కనుమలలో సింహగిరి పర్వతంపైన వెలసిన దైవం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి. విశాఖపట్టణం లోని చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలు స్వామిని సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. ఇది దక్షిణ భారత దేశములోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో తిరుపతి తరువాత గొప్ప పేరు పొందిన ఆలయం.

ఈ ఆలయ పురాణానికి వస్తే, హిరణ్యకశుని భటులు ప్రహ్లదుని చంపడం కోసం అతడిని సముద్రములో పడవేసి, అతడు లేచి బయటికి రాకుండా పైన ఒక పర్వతాన్ని పడవేశారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు వచ్చి, ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డునకు విసిరి ప్రహ్లదుడిని రక్షించాడు. అదియే సింహాచలం కొండ. ఆ సముద్రమే విశాఖ వద్ద గల సముద్రం. ఆ సమయములో ప్రహ్లదుని కోరికపై హిరణ్యాక్షుని సంహరించే వరాహరూపం, నరసింహరూపంలో స్వామి వారు దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయంలో స్వామి పేరు శ్రీ వరాహ నరసింహస్వామి.

అయితే ప్రహ్లదుని రక్షించిన స్వామి తరువాత ఒక పుట్టలో ఉండిపోయాడని, షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవ చక్రవర్తి ఆ పుట్టని తొలగించి అచ్చట ఆలయాన్ని నిర్మించారని చెప్పుతారు. నిజ రూపములో కనిపించే స్వామి విగ్రహానికి వరాహముఖం, నరుని శరీరం, సింహ తోక యుండుట విచిత్రం. ఇతర నరసింహ క్షేత్రాలలో సింహకారానికి తోక ఉన్నట్లు కనిపించదు. అంతేకాకుండా ఇతర క్షేత్రాలలో స్వామికి 4 చేతులుంటే ఇచ్చట మాత్రం 2 చేతులతో కనిపిస్తాడు. ఇక్కడ స్వామి పాదాలు భూమిలో కప్పబడి ఉంటాయి.

ఈ ఆలయములో శివలింగాకృతిలో ఎప్పుడు చందనంతో కప్పబడి స్వామి వారి రూపం ఉంటుంది.
ఏడాదిలో ఒక రోజు మాత్రమే చందనపు పొరలు తొలగించుకొని తన నిజ రూపంతో భక్తులకి దర్శనమిస్తాడు. ఇలా సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజ రూప దర్శనం భక్తులకి లభిస్తుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.

ఇలా నిజ రూప దర్శనం వెనుక ఒక పురాణం ఉంది, సిమహాగిరి పై ఈశాన్య దిక్కున గంగధారకు సమీపంలో పుట్టలో ఉన్న స్వామిని అక్షయతృతీయ నాడు చక్రవర్తి గుర్తిస్తాడు. పుట్టను తొలగించి గంగధార జలాలతో, పంచామృతాలతో స్వామిని అభిషేకించి, ఆరాధిస్తాడు. ఆ స్వామి చాలా ఏళ్ళు పుట్టలో ఉన్నందున అలాంటి చల్లదనం కోసం పుట్టమన్నుకు బదులు గంథంతో తనను కప్పి ఉంచాలని ఆ ఆదేశిస్తాడు. దీంతో పుట్ట మన్ను బరువుకు సమానమైన శ్రీగంధాన్ని అక్షయ తృతీయ రోజున తొలిసారిగా పురూరవుడు సమర్పిస్తాడు. అప్పటినుండి వరాహలక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం ఆ రోజున నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇక చందన యాత్ర అంటే, ఏటా అక్షయ తృతీయ రోజున స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ రోజంతా స్వామి నిజరూపంతో భక్తులకు సాక్షత్కరిస్తారు. మళ్ళీ అదే రోజు రాత్రి చందన సమర్పణ చేస్తారు. దాదాపుగా 500 కిలోల శ్రీ చందనపు పూతతో స్వామిని నిత్యా రూపంలోకి తీసుకువస్తారు. ఆ మొత్తం చందనాన్ని స్వామికి నాలుగు విడతలుగా సమర్పిస్తారు.

ఈరోజు, మంగళవారం అక్షయ తృతీయను పురస్కరించుకుని తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామిని మేల్కొలిపి గంగ ధార నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం బంగారు, వెండి బొరిగెలతో స్వామి దేహంపై కప్పి ఉంచిన చందనాన్ని తొలగించారు. ఆ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

Exit mobile version