రెండు తెలుగు రాష్ట్రలకు సింహాచలం అప్పన్న గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మిగతా అన్ని నరసింహ ఆలయాలకు భిన్నంగా సింహాచలం ఆలయంలో విగ్రహం స్వామివారి రూపంలో కాకుండా లింగం ఆకారంలో నిండుగా చందనం పూయబడి ఉంటుంది.
అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.
ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది. దాంతో ఆరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 1 రోజు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.