శివపార్వతుల నివాస స్థలం కైలాస శిఖరం. హిమాలయాల్లో ఉన్న ముఖ్యమైన పర్వత శిఖరాల్లో కైలాస శిఖరం ఒకటి. హిందువులు, జైనులు, బౌద్దులు ఈ పర్వతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తాయి. ఇప్పటివరకు ఎవరు కూడా అధిరోహించలేని శిఖరం కైలాస పర్వతం. ఇక్కడ దర్శనీయ ప్రదేశాలు కైలాస గిరి, మానస సరోవరం. మరి కైలాస గిరి, మానస సరోవరం లో దాగి ఉన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పార్వతి పరమేశ్వరుల నివాస స్థలం కైలాస శిఖరం. మన దేశంలో ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడి మానస సరోవరంలో ఉంది. ఈ ప్రాంతంలో అమ్మవారి కుడి అరచెయ్యి పడిందని స్థల పురాణం. మనిషికి అర్ధం కానీ ఎన్నో రహస్యాలు ఇక్కడ ఉన్నవి అని చెబుతారు. ఇక్కడి కైలాస మానస సరోవర యాత్ర అనేది చాలా కష్టంతో కూడుకున్నది. అయితే ఇక్కడి దర్శనీయ ప్రదేశాలైన కైలాస గిరి, మానస సరోవరంలో ప్రత్యేక ఆలయాలు కానీ, దేవుడి విగ్రహాలు కానీ ఏమి ఉండవు. పూర్వం రావణుడు తన తల్లి కోరిక తీర్చడం కోసం ఈ ప్రాంతంలోనే శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివుడిని మెప్పించి ఇక్కడే ఆత్మలింగాన్ని పొందాడని స్థల పురాణం.
ఇక కైలాస గిరి విషయానికి వస్తే, సముద్ర మట్టానికి 22778 అడుగుల ఎత్తులో కైలాస శిఖరం ఉంది. ఈ కైలాస శిఖరం అనేది టిబెట్ భూభాగంలో ఉంది. ఈ పర్వత ప్రాంతంలో మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. ఈ కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉంటాయి. ఒకవైపు సింహం, రెండవ వైపు గుర్రం, మూడవ వైపు ఏనుగు, నాలుగవ వైపు నెమలిలా ఈ పర్వతం అనేది కనిపించడం విశేషం. ఇంకా ఈ కైలాస పర్వతం అనేది ఒక్కో సమయంలో ఒక్కో రంగులో దర్శనమిస్తుందని చెబుతారు. విష్ణుపురాణం ప్రకారం, కైలాస పర్వతం నాలుగు ముఖాలు, స్పటిక, బంగారం, రుబి, నీలం రంగులతో రూపొందినట్లు తెలియుచున్నది.
జైన తీర్థంకరులలో మొదటివాడైన ఆదినాధ ఋషభదేవ్ ఇక్కడే నిర్వాణం చెందాడని జైనుల విశ్వాసం. ఇది ఇలా ఉంటె, ఈ పర్వతం దగ్గరికి వెళ్లిన యాత్రికులు పర్వతాన్ని తాకే ప్రయత్నం చేయరు, అధిరోహించే ప్రయత్నం కూడా చేయరు. ప్రపంచంలో ఎవరు కూడా అధిరోహించని పర్వతాలలో ఈ కైలాస శిఖరం ఒకటిగా చెబుతారు. అయితే కొంతమంది ఈ పర్వతాన్ని అధిరోహించాలని చూసినప్పటికీ వారు అదృశ్యమయ్యారట.
ఇక మానస సరోవరం విషయానికి వస్తే, ప్రపంచం మొత్తంలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచి నీటి సరస్సు మానస సరోవరం. ఇక్కడి నీటికి ఉన్న స్వచ్ఛత ఈ భూమిమీద మరెక్కడా కూడా ఉండదని చెబుతారు. అయితే ఋషుల కోరిక కోసం బ్రహ్మ తన మనస్సు నుండి ఈ సరస్సుని సృష్టించడం వలన దీనికి మానస సరోవరం అనే పేరు వచ్చినది చెబుతారు. ఈ సరస్సు చుట్టుకొలత దాదాపుగా 84 కిలోమీటర్లు. దేవతలు ఈ సరోవరంలో స్నానం చేయడానికి ప్రతి రోజు రాత్రి స్వర్గలోకం నుండి ఇక్కడి వస్తారని ప్రతీతి. అంతేకాకుండా ఉదయం 3 నుండి 5 గంటల సమయంలో బ్రహ్మి ముహూర్తంలో శివుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం.
ఈవిధంగా ఎన్నో రహస్యాలు నిలయమైన, అందరికి సాధ్యం కానీ ఈ కైలాస – మానస సరోవర యాత్ర చేయడానికి సుమారుగా 18 రోజులు పడుతుంది.