Home Unknown facts శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి ఈ ప్రదేశానికి రావడానికి కారణం ఏంటి ?

శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి ఈ ప్రదేశానికి రావడానికి కారణం ఏంటి ?

0

ప్రపంచ ప్రసిద్దిగాంచిన గొప్ప పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కలియుగ ప్రత్యేక్ష దైవంగా ఇక్కడ వెలిశారు. అయితే ఆ స్వామివారు వైకుంఠం నుండి ఇక్కడికి రావడానికి కారణం భృగు మహర్షి ఒక కారణం అని చెబుతారు. మరి భృగు మహర్షి ఎవరు? శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమిమీదకు రావడానికి భృగు మహర్షి ఒక విధంగా కారణం ఎలా అయ్యాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Maharishi Bhrigu and Vishnu

బ్రహ్మ దేవుని హృదయస్థానం నుండి జన్మించినవాడు భృగు మహర్షి. ఈయనని నవ బ్రహ్మలలో ఒకరిగా చెబుతారు. సప్తఋషులలో ఒకరైన భృగు మహర్షి మొట్టమొదటి జ్యోతిష్య రచయిత. ఇది ఇలా ఉంటె, ఒకరోజు మునులందరూ ఒకచోట ఉన్నప్పుడు వారికీ ఒక సందేహం కలిగింది, మనకి ఉన్న త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే విషయం పైన చర్చకి రాగ వారందరు కలసి వీరిలో ఎవరు గొప్ప అనేది నీవే తేల్చాలని భృగు మహర్షిని కోరగా అప్పుడు భృగు మహర్షి ముందుగా బ్రహ్మ లోకానికి వెళ్లగా బ్రహ్మ దేవుడు చూసి చూడనట్టుగా ఉండటంతో ఆగ్రహించిన మహర్షి నీవు భూలోకంలో పూజకి అనర్హుడివి, నీకు ఎటువంటి ఆలయాలు అనేవి ఉండవు అని శపించి కైలాసానికి బయలుదేరుతాడు.

ఇలా భృగు మహర్షి కైలాసానికి వెళ్లగా, కైలాసం లో శివుడు, పార్వతి ఏకాంతంలో ఉండటం చూసి ఆగ్రహించిన మహర్షి ఇప్పటినుండి నీకు భూలోకంలో లింగానికి మాత్రమే పూజలు ఉంటాయని శివుడిని శపించి తిరిగి అక్కడినుండి వైకుంఠానికి బయలుదేరుతాడు. ఇక వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పవళించి ఉండగా, తన రాకని విష్ణువు గమనించలేదని ఆగ్రహించిన భృగు మహార్షి తన కాలితో శ్రీ మహావిష్ణువు గుండెల పైన తన్నాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు భృగు మహర్షి కాలిని నొక్కుతూ ఆ మహర్షి కాలిలో ఉన్న నేత్రాన్ని చిదిమేసాడు. దాంతో ఆ మహర్షి గర్వం అణిగింది. ఇక ఆ సమయంలోనే శ్రీ మహాలక్ష్మి, తాను ఉండే శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష స్థలంలో మహర్షి తన్నగా ఆ మహర్షికి పాదసేవ శ్రీ మహావిష్ణువు చేయడాన్ని తట్టుకోలేని లక్ష్మిదేవి వైకుంఠాన్ని వదిలేసి పాతాళానికి వెళ్లిపోయింది.

ఇలా పాతాళానికి వెళ్లిన లక్ష్మీదేవి కపిల మహర్షి కోరిక మేరకు భూలోకానికి వెళ్లి కరివీరపురం, నేటి కొల్హాపూర్‌ లో నివసించసాగింది. అయితే తన భార్య వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోవడం తట్టుకోలేని శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి లక్ష్మీదేవి కోసం అన్వేషిస్తూ కరివీరపురం లో ఆ దేవిని చూసి ఆ తరువాత ఆ దేవి తిరుచానూర్‌లో పద్మావతిగా అవతరించి, తిరిగి, తన వక్షస్థలం చేరే విధంగా చేసుకుంటాడు.

ఈవిధంగా భృగు మహర్షి కారణంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి శ్రీ వెంకటేశ్వరస్వామిగా కలియుగ దైవంగా తిరుమల తిరుపతిలో వెలిసాడని పురాణం.

Exit mobile version