శ్రీ రాముడు కొలువై ఉన్న అతి పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో విష్ణుమూర్తి అవతారంగా భావించే శ్రీరాముడు చతుర్భుజుడిగా కొలువై ఉన్నాడు. మరి నెమలి నీడకు విగ్రహ ప్రతిష్టకు ఏంటి సంబంధం? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రం, తిప్రయర్ నది తీరాన శ్రీ రామచంద్రమూర్తి ఆలయం ఉంది. విష్ణుమూర్తి అవతారంగా భావించే శ్రీరాముడు చతుర్భుజుడిగా కొలువై ఉండగా స్వామికి ఇరువైపులా శ్రీదేవి – భూదేవి లను ప్రతిష్టించారు. అతి ప్రాచీన ఆలయం అని చెప్పే ఈ ఆలయ ప్రాంతంలో సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రగ్నుల నాలుగు విగ్రహాల లో శ్రీరాముని విగ్రహానికి ఇక్కడ ప్రతిష్ట జరిగింది.
అయితే ఒక రోజు, ఈ విగ్రహం పైన నెమలి నీడ పడినప్పుడే విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆకాశవాణి పలికినది. కానీ ఎన్ని రోజులు గడిచిన నెమలి నీడ పడలేదు. అప్పుడు ఒక భక్తుడు నెమలి ఈకలు పట్టుకొని ఉండగా అక్కడ శ్రీరామప్రతిష్ఠ జరిగింది. అయితే ఇలా జరిగిన కొన్ని రోజులకి ఒక నెమలి ఎగురగా దాని నీడ నేలపై పడింది. అప్పుడు నీడ పడిన ప్రదేశంలో బలిపీఠం ప్రతిష్టించారు.
ఇలా ప్రతిష్టించిన బలిపీఠం స్థిరంగా ఉండకుండా గిరగిరా తిరుగుతూ ఉంటె ఒక యోగి మంత్రోచ్చారణతో బలంతో ఒక మేకును కొట్టగా అప్పుడు బలిపీఠం అనేది తిరగడం ఆగిపోయింది. బలిపీఠం పై మేకు కొట్టిన గుంట మనకి ఇప్పటికి కనిపిస్తుంది. ఇలా ఆ రోజు నుండి బలిపీఠం కూడా విగ్రహంతో సమానంగా పూజలు అందుకుంటుంది.
పూర్వం టిప్పు సుల్తాన్ ఇక్కడ ఉన్న అమ్మవారి చేతిని ఖండించగా ఆ చేతి నుండి రక్తం కారుట వలన తన తప్పు తెలుసుకొని చేతికి బంగారు తొడుగు చేయించాడని చెబుతారు. ఇలా శ్రీరాముడు చతుర్భుజుడై కొలువై ఉన్న ఈ ఆలయానికి దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.