అయన ఒక మహర్షి, అవధూత, పేదవాడి ఆకలి తీర్చడం, లేనివాడి కడుపు నింపడం నిజమైన మాధవసేవ అని చెప్పిన గొప్ప మనిషి, ఆకలి అన్నవారికి అన్నం పెట్టిన ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ కాశి నాయన. మరి ఆయన ఎవరు? ఆధ్యాత్మిక వైపు ఎలా అడుగులు వేశారు? ఆయన సమాధి చెందిన పుణ్యస్థలం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్త్రం, కడప జిల్లా, నరసాపురం మండలంలో జ్యోతిక్షేత్రం ఉన్నది. ప్రతి రోజు ఈ క్షేత్రం ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నరసాపురం మండలాన్ని కాశినాయన మండలంగా మార్చింది. అయితే రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా 100 కి పైగా కాశినాయన పేరిట ఆశ్రమాలు నడుస్తున్నాయి.
ఇక కాశినాయన గారి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, సీతారామపురం మండలం, బెడుసుపల్లిలో సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకి కాశిరెడ్డి గారు జన్మించారు. ఆయన అసలు పేరు మున్నల్లి కాశిరెడ్డి. ఆయనకి చిన్నతనం నుండి కూడా దైవభక్తి ఎక్కువగా ఉండేది. తనకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చదువు ఆపివేసి వ్యవసాయ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు కాశిరెడ్డి గారు వేప చెట్టు కింద కూర్చొని ఉండగా తనకి మనసులో ఏదో ఆలోచన కలిగి అలా నడుచుకుంటూ ప్రకాశం జిల్లా వెలుగొండ గ్రామానికి చేరుకున్నాడు.
ఆ గ్రామంలో అతిరాచ గురవయ్య స్వామిలో కాశిరెడ్డి గారికి సద్గురు సాక్షాత్కారం అవ్వగా, ఆ స్వామిదగ్గర శిష్యరికం చేసి తన గమ్యం ఏంటో తెలుసుకొని తీర్థయాత్రలు చేయడం ప్రారంభించారు. దేశంలో కన్యాకుమారి నుండి కాశి వరకు ఆయన దర్శించని ఆలయం లేదు. కాశి నాయన గారు కాశీలో మూడు సంవత్సరాలు, గరుడాద్రి లో 12 సంవత్సరాలు తపస్సు చేసారు. ఆయన ఏమని బోధించేవారు అంటే, అమ్మ అన్నం ఆకలి అంటే మీకు ఆ స్థోమత లేకున్నా కనీసం గంజి అయినా పోయండి, పది మంది అన్నం ఒక్కరు తినకూడదు. నలుగురికి సరిపోయే అన్నం పది మంది పంచుకోవాలి అని అనేవారు. దేశంలో ఉన్న పూజకి నోచుకోని ఎన్నో పురాతన ఆలయాలని ఆయన పునరుద్ధరించి మళ్ళీ ఆ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చారు.
ఇక జ్యోతిక్షేత్రంలోని నరసింహస్వామి ఆలయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి 1995 డిసెంబర్ 6 వ తేదీన లో జ్యోతిక్షేత్రంలో దేవతల విగ్రహ ప్రతిష్ట చేసి, వేలాదిమంది భక్తులను అక్కడికి రప్పించి వారందరి సమక్షంలో ఆయన సమాధి చెందారు. నల్లమల అడవుల్లో ఉన్న ఈ జ్యోతిక్షేత్రానికి ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలు జరుగగా, లక్షకి పైగా భక్తులు ఇక్కడ అన్నదాన సేవలో పాల్గొంటారు.
ఈవిధంగా అన్నదాత అవధూత గారి జ్యోతిక్షేత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి ఏ కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి కూడా ఎప్పుడు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.