మన హిందూ సంప్రదాయంలో సకల దేవతాగణములకు అధిపతి గణపతి. అందరు అన్ని కార్యములకు, పూజలకు మొదటగా పూజించేది గణపతిని. ఈ స్వామిని వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు అంటూ ఎన్నో రకాలుగా భక్తులు పిలుస్తుంటారు. అయితే గణపతి 36 రూపాలు ఉండగా అందులో 16 మాత్రం చాలా ప్రముఖమైనవిగా చెబుతారు. మరి వినాయకుడు శివుడికి భక్తులకి మధ్య సాక్షిగా ఎలా నిలిచాడు? ఆ సాక్షి గణపతి ఎక్కడ దర్శనమిస్తాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా లో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు, సముద్రమట్టానికి దాదాపుగా 458 మీ. ఎత్తున్న కొండపైన వెలసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయంలో శివుడు మల్లికార్జునస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న మల్లికార్జునస్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈవిధంగా జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న అద్భుత క్షేత్రమే శ్రీశైలం.
శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి సాక్షి గణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే గణపతి విగ్రహం ఏదో వ్రాస్తున్న భంగిమలో కూర్చొని ఉన్న విధంగా భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. ఇక సాక్షి గణపతి ప్రత్యేకత ఏంటంటే, శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించిన భక్తులను స్వామి తన చిట్టాలో వ్రాసుకొని కైలాసంలో ఉన్న పరమశివుడికి నివేదించి సాక్షముగా ఉంటాడని ప్రతీతి. అంటే శ్రీశైలానికి వచ్చి శివుడిని దర్శనం చేసుకున్న భక్తులకి కైలాసా ప్రవేశానికి అనుమతి లభిస్తుందని అప్పుడు శ్రీశైలానికి వచ్చిన భక్తులకి గణపతి సాక్షిగా ఉంటాడని చెబుతారు. ఇలా భక్తులు శ్రీశైలానికి వచ్చారని గణపతి సాక్ష్యంగా ఉంటాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతి అనే పేరు వచ్చినదని అంటారు.
మన సంప్రదాయం ప్రకారం మొత్తం 32 మంది గణపతులు ఉన్నారు. అందులో మనకి 16 మంది గణపతులు పేర్లు వినిపిస్తుంటాయి. ఆయనను పూజించినా, ధ్యానించినా సర్వ శుభాలూ సమకూరుతాయి. ఆయన వల్లనే మునులు కూడా సంసార సాగరాన్ని దాటగలుగుతున్నారు. ఆయనే బ్రహ్మ. ఆయనే హరి. ఇంద్రుడు, చంద్రుడు, పరమాత్మ, సమస్త జగత్తుకూ సాక్షి కూడా ఆయనే. మానవాళి దుఃఖాలను పోగొట్టుకోవటం కోసం ఆ స్వామిని పూజించటం కంటే సులభమైన మార్గం మరొకటి లేదు.