ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు. ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. ఇక ఆంజనేయస్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు. అయితే ఆంజనేయుడు అభయాంజనేయస్వామిగా పూజలను అందుకుంటున్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నవి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో ఆంజనేయుడు కుడి చేయి అభయ ముద్రతో, ఎడమచేత గధను ధరించి అభయాంజనేయస్వామిగా భక్తులకి దర్శమిస్తున్నాడు. ఈ ఆలయంలో ప్రతి మంగళ, శనివారాలలో తాపాలపాకులతో నాగవల్లి సహస్ర నామార్చనను జరిపిస్తారు. అంతేకాకుండా వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని ఎంతో వైభవంగా జరిపిస్తారు. ఇంకా ఫాల్గుణ మాసంలో శుద్ధ పంచమి నుండి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు హనుమాన్ మండలదీక్ష కార్యక్రమాన్ని జరిపిస్తారు.
ఈ ఆలయంలో ఎన్నో ఉపాలయాలు అనేవి ఉన్నవి. ఇక్కడ గణేశ సన్నిధి ఉండగా, శ్రీ వేంకటేశ్వరస్వామి అతి సుందర విగ్రహం భక్తులకి దర్శనమిస్తుంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయం, శివాలయం, సాయి బాబా మందిరం, అయ్యప్పస్వామి కొలువై ఉండగా, ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగదేవత ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి మంగళ, శుక్రవారాలలో క్షిరాభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంకా ఇక్కడే సంతోషిమాత మందిరం ఉంది. అంతేకాకుండా గ్రామదేవత అయినా పోచమ్మతల్లి కొలువై ఉండగా ప్రతి ఆదివారం ఈ అమ్మవారికి వడిబియ్యం సమర్పిస్తారు.
ఇలా ప్రధాన దైవం అభయాంజనేయస్వామి కాగా, అనేక ఉపాలయాలు వేరు వేరు మూర్తులకు విడివిడిగా ఆలయాలు ఉండగా, గ్రహదోషాలు, జాతక సమస్యలు ఉన్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈవిధంగా ఇన్ని ఆలయాల సముదాయాలు ఉన్న ఈ ప్రసిద్ధ హనుమాన్ దేవాలయానికి ప్రతి రోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.