Home Regional Marks Are Just A Number Don’t Let Them Take Away Your Lives

Marks Are Just A Number Don’t Let Them Take Away Your Lives

0

ఇదివరకు విద్యార్ధులను ఎగిరే పక్షులతో పోల్చేవారు. కొత్తతరానికి నాంది అని, సరికొత్త శకానికి పునాది అని అబ్బో మహ బాగా పొగిడేసేవారు. కానీ.. ఇప్పుడు ఎల్.కె.జి నుంచి డిగ్రీ వరకూ ఏ విద్యార్ధిని చూసినా ప్రెజర్ కుక్కర్లే గుర్తొస్తున్నాయి. చదువుకొనే విద్యాసంస్థను బట్టి సదరు విద్యార్ధి మీద ప్రెజర్ పెరుగుతుందన్నమాట. విద్యాసంస్థల్లో లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు పెట్టే ప్రెజర్ సరిపోదన్నట్లు.. ఇంట్లో తల్లిదండ్రులు “ఆ శేఖరం గారి అబ్బాయి కాలేజ్ ఫస్ట్ వచ్చాడట, ఆ కుమార్ కొడుకు స్టేట్ ఫస్ట్ వచ్చాడట. వాడు వీడు చిన్నప్పుడు కలిసే చదువుకొన్నారు.. కానీ వాడేమో అలా అద్భుతంగా చదువుతుంటే, మన పుత్రరత్నం ఏమో ఇలా చదువుకోకుండా పాడైపోతున్నాడు” అని కంపేర్ చేయడం మొదలుకొని తిట్టడం వరకూ ఇచ్చే ప్రెజర్ మామూలుగా ఉంటుందా చెప్పండి.

Telangana Intermediate Results

ఇలా కాలేజీల్లో, ఇళ్ళల్లో ఉండే ప్రెజర్ కారణంగా విద్యార్ధి అనేవాడు భవిష్యత్ గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాడు. ఫ్యూచర్ లో ఏమవ్వాలి అని ఆలోచించుకొనే స్వేచ్చ తల్లిదండ్రులు ఇవ్వడం మానేయగా.. విద్యాసంస్థలు ఆ చిన్నపాటి కలల్ని వీక్లీ టెస్ట్ లు, స్పెషల్ క్లాసులు అంటూ చంపేస్తున్నారు. ప్రస్తుత తరం విద్యార్ధులు నేర్చుకోవడం అనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ప్రతి టెన్త్/ఇంటర్ చదివే విద్యార్ధి చేసేది బట్టీ పట్టడమే. ఆ బట్టీ పట్టే అంశం భవిష్యత్ లో ఎంతవరకూ పనికొస్తుంది అనే విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతం వారి ధ్యేయం అంతా ఎన్ని చాప్టర్లు లేదా మోడల్ పేపర్లు బట్టీ పట్టామ్.. ఎన్ని మార్కులు సంపాదించాం, తల్లిదండ్రులు/లెక్చరలు తమపై పెట్టుకున్న ఆశలు అనే ప్రెజర్ ను తీర్చామా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు.

అలాంటి పనికిమాలిన చదువులు దేశ భవిష్యత్ ను నిర్ణయిస్తున్న ఈ సమాజంలో.. ఆ చదువులో తక్కువ మార్కులు వచ్చాయనో లేక ఫెయిల్ అయ్యామనో కొందరు విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడడం అనేది ఈ ప్రయివేట్ విద్యాసంస్థలు మరియు తమ కలల్ని పిల్లలపై రుద్ది రక్షసానందం పొందే తల్లిదండ్రులు సిగ్గుపడాల్సిన విషయం. కానీ.. వాళ్ళు సిగ్గుపడడం లేదు, పడరు కూడా. ఒక్కొక్కళ్లదీ ఒక్కో వెర్షన్. కానీ.. దేశ భవిష్యత్ అయిన విద్యార్ధులు మాత్రం తమ కలల్ని కాలేజ్ బ్యాగుల అడుగున తొక్కిపెట్టేస్తున్నారు, తమ ఆశల్ని పోటీ ప్రపంచపు పునాదుల అడుగున అదిమిపెట్టి అణగారిపోతున్నారు.

అరే తమ్ముడు/చెల్లాయ్ మీరు చదివేదే బ్రతకడం కోసం.. అలాంటి చదువు కోసం చావాల్సిన అవసరం ఏముంది? నువ్వే ఆలోచించుకో.. రోజుకి కనీసం మూడు మోడల్ పేపర్లు ఫినిష్ చేసి ఇంటికెళ్లు అని బెత్తం పట్టుకొని నీ ముందు రాక్షసుడిగా కూర్చునే లెక్చరర్/జూనియర్ లెక్చరర్ నువ్ పోతే నీ కుటుంబానికి అండగా నిలవరు. నీకంటే మన పక్కింటి రాము గాడికి ఎక్కువ మార్కులు వచ్చాయిరా అని వెధవ అని తిట్టే తల్లిదండ్రులు నువ్ చనిపోయిన తర్వాత వెక్కి వెక్కి ఏడ్వడం తప్ప ఏమీ చేయలేరు. అలాంటప్పుడు ఎవరు కోసం ఛస్తున్నావ్ నువ్వు? ఫెయిల్ అయితే ఈ సమాజం నిన్ను ఒక ఫెయిల్యూర్ గా చూస్తుంది అని భయంతో చచ్చే నువ్వు.. నువ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత అదే నిన్ను పిరికిపంద కింద జమకట్టి కనీసం నీకోసం ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చదనే నిజం నీకు తెలియదా? ఎందుకు తమ్ముడు/చెల్లాయ్ ఈ పిచ్చి నిర్ణయం తీసుకున్నావ్. ఈ ఏడాది ఒకేసారి 17 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షలు అనే రాకాసి కొన్ని లక్షల విద్యార్ధుల జీవితాలను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే విషయం వెలుగులోకి వచ్చింది కానీ.. ప్రతి ఏడాది వందల సంఖ్యలో విద్యార్ధులు ఈ మార్కుల టెన్షన్ తో, ఇంట్లో/కాలేజ్ ప్రెజర్ తో మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుసా?

ఈ విద్యార్ధుల బలవంతపు చావులు ఆపాలంటే మార్పు రావాల్సింది విద్యార్ధుల్లో మాత్రం కాదు. లక్షల మొత్తం ఫీజులు దొబ్బేసి.. విద్యార్ధులను గంటలకు గంటలు క్లాస్ రూమ్స్ లో ఉంచేసి వారి బుర్ర టెక్స్ట్ బుక్స్ తప్ప మరో విషయం గురించి ఆలోజింపనివ్వని విద్యాసంస్థల్లో రావాలి మార్పు, కుదిరినప్పుడల్లా పక్కింటోడి కొడుకుతో.. బంధువుల పిల్లలతో కంపేర్ చేసి.. పిల్లల్లో లేనిపోని భయాలు, అపోహలు, ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్స్ క్రియేట్ చేసే తల్లిదండ్రుల్లో రావాలి మార్పు.

ఈ రెండూ జరగనంత వరకూ విద్యార్ధుల బలవన్మరణాలను ఆ దేవుడు దిగివచ్చినా ఆపలేడు.

అయితే.. ఇంటర్ బోర్డ్ స్వయంగా ‘తప్పు మాదే, క్షమించండి.. తప్పు చేసినవాళ్లందరినీ శిక్షిస్తాం” అని మీడియా ముఖంగా చెప్పిన తర్వాత కూడా ఈ ఆత్మహత్యలు ఆగలేదంటే.. విద్యార్ధులు ఈ ఎక్స్ పెక్టేషన్స్ అనే ప్రెజర్ కుక్కర్లో ఎంతగా ఉడికిపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయినా ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యింది స్టూడెంట్స్ కాదు.. ఇంటర్ బోర్డ్ మరియు ప్రభుత్వం.

Exit mobile version