Home Unknown facts జీవితంలో ఒక్కసారైనా ఈ 6 ఆలయాల దర్శనం ఒక అద్భుతం

జీవితంలో ఒక్కసారైనా ఈ 6 ఆలయాల దర్శనం ఒక అద్భుతం

0

భారతదేశం సంస్కృతికి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. అయితే ఎన్నో అతి ప్రాచీన అద్భుత ఆలయాలు ఇప్పటికి చెక్కు చెదరకుండా దర్శనం ఇస్తున్నాయి. అలాంటి అతి పురాతన ఎన్నో విశేషాలు కలిగిన కొన్ని ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వారణాసి:

1-Varnasi

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసి జిల్లాలో కాశి విశ్వేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు కాశి విశ్వేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్మకం. భారతదేశంలో వుండే అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ఇక సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుడి త్రిశూలం పైన కాశీనగరం నిర్మించబడిందని పురాణం. శివుడికి ఈ ప్రాంతం అత్యంత ప్రీతి పాత్రమైనదని చెబుతారు. హిందువులు పవిత్రంగా భావించే ఏడు నగరాలలో వారణాసి ఒకటి. ఎన్నో మహిమలు గల ఈ ప్రదేశాన్ని పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని శివుడు స్థాపించాడని పురాణం. ఇక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఉన్నదీ. ఇక్కడి బనారస్ ప్రాంతాన్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తుంటారు. ఈ నగరంలో సుమారు ఇరవై మూడు వేల దేవాలయాలు ఉన్నట్లుగా ఒక అంచనా.

మధురై:

తమిళనాడు రాష్ట్రంలోని మధురై లో శ్రీ మధుర మీనాక్షి దేవాలయం ఉంది. భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం 283 గజాల పొడవు, 243 గజాల వెడల్పుతో ఒక పెద్ద కోట లాంటి ఆవరణలో ఉంది. ఈ ఆలయ గోపురం 160 అడుగుల ఎత్తులో ఉంటుంది. తమిళ పురాణాల ప్రకారం శివుడికి, మీనాక్షి దేవికి వివాహం ఇక్కడే జరిగిందని చెబుతారు. ఆ ఆలయంలో ఉన్నంత శిల్ప కళ నైపుణ్యం మరెక్కడా కూడా లేదనే చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో ఎక్కువమంది దర్శించే ఆలయాల్లో మీనాక్షి దేవి ఆలయం ఒకటి. ఇక ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నాలుగు దిక్కుల నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంబీరంగా కనబడుతుంది. ఈ ఆలయం దాదాపుగా 2500 సంవత్సరాల క్రితం నిర్మించిందని చెబుతారు.

ఉజ్జయిని:

మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఉజ్జయిని ప్రాంతంలో శ్రీ మహాకాళేశ్వరాలయం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఇక్కడ కొలువై ఉన్న మహాకాళేశ్వరుడు దక్షిణముఖంగా స్వయంభువుగా వెలిసాడు. ఈ ఆలయం 5 అంతుస్తులతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నిత్యం శ్మశానం నుంచి తెచ్చిన బూడిదతో స్వామికి భస్మ హారతి ఇస్తారు. ఇంకా ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకి ఇక్కడ జరిగే చితాభస్మాభిషేకం ఒక అపురూప దృశ్యం. నమక చమకాలతో ఈ భస్మాభిషేకం సుమారు 2 గంటల పాటు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో రోజు శవ భస్మం తో జరిగే చితాభస్మాభిషేకం చుస్తే అకాల మృత్యు బాధలు ఉండవని చెబుతారు.

ఇంకా ఉజ్జయిని నగరంలో కాలభైరవుని ఆలయం ఉంది. అతి పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఇక్కడ కాలభైరవుని విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్వామి మద్యపాన ప్రియుడు. ఈ ఆలయ చుట్టూ పక్కల స్వామివారి కోసమే దుకాణాల్లో మద్యం అమ్ముతుంటారు. అయితే సీసాలో ఉండే మద్యం స్వామి నోటి దగగ్ర ఉంచితే శబ్దం చేస్తూ సీసా కాలి అవ్వడం మనం ప్రత్యేక్షంగా చూడవచ్చు. ఇది ఎంత వరకు వాస్తవం అనేది ఇప్పటికి అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇంకా ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా ఉత్సవం జరుగుతుంది.

పుష్కర్:

రాజస్థాన్ లో అజ్మీర్ కు వాయువ్య భాగం లో సుమారు 10 కిలో మీటర్ల దూరం లో పుష్కర్ దగ్గర గాయత్రి గిరి లో ఉన్న శక్తి పీఠం ఇది. దీనినే బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు. అమ్మవారి కంఠా భరణం ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం. ఇక్కడి అమ్మవారు గాయత్రీదేవి. నిత్యంహోమాలు, పూజలతో కళకళ లాడుతుంది. ఈ సరస్సు ఒడ్డునే బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. ఇదొక్కటే ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం. మనదేశంలో అతి ముఖ్య తీర్ధరాజంగా ఇది ప్రసిద్ధి చెందింది.

తంజావూరు:

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఈ బృహదీశ్వరాలయం ఉంది. ఇక గర్బాలయంలో ఉన్న శివలింగం అధ్భూతంగా పూర్తిగా నల్ల రాయితో చేయబడిన పదహారడుగుల ఎత్తు 21 అడుగుల కైవారం కలిగి చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఈ స్వామికి అభిషేకం చేయడానికి విగ్రహం పక్కనే ఎత్తుగా కట్టబడిన మెట్లు ఉన్నాయి. ఈ శివలింగ విగ్రహాన్ని చెక్కిన శిలకోసం ఎన్నో చోట్ల వెతికి చివరకు నర్మదానదీ గర్భములో నుండి సంపాదించినట్లు తెలుస్తుంది. ఈ శిలను వెలికి తీసి శివలింగంగా చెక్కి తీసుకురావడానికి రాజరాజ చక్రవర్తి తానే స్వయంగా దగ్గర ఉండి 64 మంది శిల్పులతో ఆ శిలని శివలింగంగా మలిచి ఏనుగుల చేత మోయించుకొని వచ్చాడంటా. ఇంకా తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో అతి పురాతన ఎన్నో విశేషాలు గల అద్భుత ఆలయాలు ఉన్నాయి.

అయోధ్య:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాదు జిల్లాకి 6 కి.మీ. దూరంలో సరయు నది తీరంలో అయోధ్య అనే పుణ్యక్షేత్రం ఉంది. ఈ ప్రదేశం 108 దివ్యతిరుపతిలలో ఒకటిగా, శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమిగా, మోక్షదాయకమైన సప్తపురములలో అయోధ్యాపురం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీరాముడి జన్మస్థలం అత్యంత పుణ్యస్థలం అయినా అయోధ్యని జీవితంలో ఒకసారైనా వెళ్లి సీతారాముడిని దర్శించాలని ప్రతి రామభక్తుడు కోరుకుంటారు.

ఈవిధంగా ఎన్నో విశేషాలు కలిగిన అతిపురాతన ఆలయాలుగా ప్రసిద్ధి చెందిన భారతదేశంలో ఉన్న ఈ కొన్ని ఆలయాల దర్శనం ఒక అద్భుతం అనే చెప్పవచ్చు. జీవితంలో ఒక్కసారైనా వీటిని దర్శిస్తే అంతకంటే పుణ్యం మరొకటి ఉండదు.

Exit mobile version