Home Unknown facts దేవుడికి నైవేద్యం పెట్టడం వెనుక ఉన్న అంతరార్ధం

దేవుడికి నైవేద్యం పెట్టడం వెనుక ఉన్న అంతరార్ధం

0

నైవేద్యం అనేది మనం తీసుకోవడానికి ముందు దేవునికి ఆహారం సమర్పించే ప్రక్రియ. కాబట్టి దేవునికి ఆహారం సమర్పించే ముందు ఆ ఆహారం వండేటప్పుడు దాని రుచి చూడటం నిషిద్ధం. ఆహారాన్ని దేవుని మూర్తి ముందు ఉంచి పూజించడం జరుగుతుంది. ఆ పై దానిని పుణ్యఫలంగా ఆరగించవచ్చు.

దేవుడికి నైవేద్యంనైవేద్యం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. నైవేద్యము అంటే సరైన అర్ధం దేవునికి సమర్పణ అని – ఈ సమర్పణ ఆహారపదార్థమే కానవసరం లేదు. ఈ సమర్పణ భౌతిక వస్తు సంబంధమే అవ్వవలసిన అవసరం లేదు. ఒక మొక్కు, ప్రతిజ్ఞ, ఏదైనా చేయవచ్చు లేక చేయరాదు అన్న నిశ్చితాభిప్రాయం ఉన్నవన్నీ కూడా నైవేధ్యంగా భావించవచ్చు. అయితే నైవేద్యానికి, ప్రసాదానికి ఉన్న తేడా తెలుసుకోవడం అవసరం. వాడుకలో రెండూ సమానార్థంలో ఉపయోగించినప్పటికీ, ప్రసాదమంటే దేవుని దగ్గర లభ్యమయ్యేదిగా అర్థం.

పూజంతా చేసి, కొబ్బరి కాయ కొట్టి పరమాత్మకు నైవేద్యం పెడితే తినేస్తాడా? రెండు చిప్పలు మనింట్లోనే ఉంటాయి, మనమే అనుభవిస్తాం కదా ! ఆయన ప్రత్యేకంగా ఏ పంచ భక్ష్య పరమాన్నాలూ తెచ్చి ఎప్పుడూ పెట్టమనరు. మనం తినేది ఆయన ప్రసాదమనీ, మనం అనుభవించే సుఖాలు ఆయన అనుగ్రహమేననీ, మనసు లో స్మరించుకుని తినాలి అనుభవించాలి. “ప్రమోషన్ వచ్చింది, మంచి పోస్టింగ్ వచ్చింది, పిల్లలు వృద్ధిలోకొచ్చారు. మహాత్మా ఇది నీ ప్రసాదము” అని ఒక్కసారి చేతులు జోడిస్తే ఆయనకొచ్చేదేమీ లేదు, మనకు పోయేదీ లేదు. మనం తెలుపుకునే కృతజ్ఞత మాత్రమే. ఈ భావన లేకుంటే ఆ మానవుని దొంగగా భావించవలసిందే అని నిర్ద్వంద్వముగా చెప్తున్నారు.

మనం సాధించాము అనుకునే ప్రతి ఒక్క విజయం ఈ ప్రకృతి లో సృష్టి చేయబడిన ఇంకో మనిషి ద్వారా గానీ, ఏదో ఒక వస్తువు ద్వారా గానీ, పంచ భూతాలలోని ఏదో ఒక దాని ద్వారా లభించినదే కదా. అమ్మ, నాన్న, నేల, చెట్టు, కాలువ, చెరువు, పర్వతం, మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, ఉద్యోగం, బాస్, స్నేహితుడు, శత్రువు,– ఇలా ఎందరో, ఎన్నెన్నో. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే భూమిలో పంటలు పండించాలి. ఆలోచిస్తే వీటిలో మనం సృష్టించింది ఏమన్నా ఉందా?? ఈ భూమి, దున్నే నాగలి (కొయ్య, ఇనుప ఖనిజముతో చేసిందే ), నేలలో పదును, సారం, విత్తనం లో మొలకెత్తగల గుణం జీవం , నీరు , గాలి, ఎండ, అన్ని ప్రకృతి ప్రసాదాలే అని మనకు తెలుసు.

వాటిని అనుభవించబోతున్న క్షణంలో పరమాత్మ గుర్తుకు వస్తే, మనస్సులో కృతజ్ఞతా పూర్వక నమస్కారం చెయ్యగలిగితే, అదే దొంగ అనే ముద్ర పడకుండా పాపకూపంలో పడకుండా తప్పించుకోగల మహామంత్రం. ఈ డబ్బు అనేది కొద్ది శతాబ్దాల క్రితం కనుక్కున్నది మాత్రమే. కొన్ని సహస్రాబ్దాలుగా ఎవరి ధర్మం ప్రకారం వారు శ్రమ/ కర్మలు చేసి సమాజంలో మిగిలిన వారికి వారి ఉత్పత్తిని అందించి, వారి వద్ద మిగిలిపోయిన వస్తువులను తెచ్చుకోవటం, ఇదే పురాతనంగా ఉన్న ఆనవాయితీ, సాంప్రదాయం.

ఈ డబ్బు కనుక్కున్న రోజునుంచీ దాచుకోవటం, దురాశ, అసూయ, క్రోధం, ద్వేషం పెరిగిపోయాయి. సుఖం తగ్గిపోయింది, భయం పెరిగిపోయింది. విహిత కర్మలను చక్కగా ఆచరిస్తూ, ఈ ప్రకృతిలోని వనరులను వినియోగించినందుకు, ఆ కర్మల ద్వారా వచ్చిన సంపాదనలో కొంత భాగమును ఎవరి నుండి తీసుకున్నామో వారికి (యజ్ఞాల ద్వారా), మరి కొంత ప్రాణి కోటికి, అవసరమున్న వారికి వితరణ చేస్తూ, పరమాత్మ మీద కృతజ్ఞతాభావం తో ఉండేవారు పూర్వం.

ధనవంతుడు ధనం ఇవ్వచ్చు, విద్యావంతుడు విద్యను, పండితుడు తన విజ్ఞానాన్ని, ఇలా ఎవరి శక్తికి తగిన వితరణ వారు చేస్తూ ఉండాలి. “సమర్పణ, నివేదన – ఇది కృతజ్ఞత” – సత్ఫలితాలనిస్తుంది. “ఇలా కాదు, ఇది నాకే, అదీ నాకే, అన్నీ నేనే .. ఈ భావన స్వార్థ బుద్ధి. ఇటువంటి స్వార్థ బుద్ధులకు, దుష్ఫలితాలు తప్పవు, శిక్ష కూడా తప్పదు. అందుకే భగవంతుని మీద భక్తి తో ఆయన ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత నైవేధ్యంగా ఆయనకే సమర్పిస్తారు.

 

Exit mobile version