భారతదేశంలో హిందూ మతం ఉద్భవించింది అనటానికి ఎన్నో సాక్షాలు, ఆధారాలు ఉన్నాయి. మన హిందూ సంస్కృతికి, సాంప్రదాయాలకి, మత విశ్వాసాలకు పుట్టినిల్లు. ఉత్తరాన ఉన్న హిమాలయాలు ! ఇప్పటికీ ఎందరో యోగులు, సిద్ధులు, ఋషులు, అఘోరాలు హిమాలయాల్లో నివసిస్తున్నారని చెబుతారు. అలాగే భారతదేశం ఎన్నో జీవనదులకు నిలయం. పెద్ద, చిన్న ఉప నదులతో కలిసి వందల సంఖ్యలో ఉన్నాయి. కొన్ని నదులు ప్రాచీన కాలం నుంచి ప్రవహిస్తుండడం.. వాటికి దేవతల పేర్లు ఉండటంతో పుణ్య నదులుగా ప్రసిద్ధిగాంచాయి.
ఈ నదుల పేరిట పుష్కరాలు నిర్వహించడంతో పాటు భక్తులు నిత్య పూజలు చేస్తుంటారు. అయితే, దేశంలో ప్రవహిస్తున్న చాలా నదులు చివరకు సముద్రంలో కలుస్తుంటాయి. కానీ, ఒకే ఒక్క నది మాత్రం సముద్రంలో కలవదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఆ నది పేరు, జన్మస్థలం, విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా పురాణాల్లో మనం ఈ నది గురించి విన్నాం. ఇదో జీవనది. నాటి కురుక్షేత్ర యుద్ధం నుంచి నేటి వరకు ఒకే స్థాయి నీటిమట్టంతో ప్రవహిస్తున్న నది. దీని పేరే ‘యమునా’. హిమాలయ పర్వతాల్లో పుట్టిన ఈ నదికి ఎంతో ఘన చరిత్ర, పవిత్రత ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌కు ఉత్తరాన ఉన్న యమునోత్రి వద్ద ఇది ఉద్భవించింది. అందుకే దీనికి యమునా నది అని పేరు వచ్చింది. దీని పరివాహక ప్రాంతాన్ని హిందువులు పవిత్ర స్థలంగా భావిస్తారు. దీని తీరంలోనే పావనమైన కురుక్షేత్రం, బృందావనం ఉంది. ఈ నది ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 1,370 కిలో మీటర్లు ప్రవహించి అలహాబాద్ ప్రయోగక్షేత్రం వద్ద గంగానదిలో కలుస్తోంది.
భారత దేశంలోని ఎన్నో గొప్ప నదులు హిమాలయాల్లోనే ఉద్భవించాయి. హిమాలయాల్లోని యమునోత్రి ప్రాంతంలో అసిత ముని అనే మహర్షి తపస్సు చేసుకునే వారు. ఆయన నిత్యం గంగానదికి వెళ్లి స్నానం ఆచరించేవాడు. కాలక్రమేనా వృద్ధాప్యం వల్ల ఆయన గంగానదికి వెళ్లలేకపోవడంతో గంగానదే మహార్షి ఆశ్రమానికి దగ్గరగా ప్రవహించిందని పురాణాల్లో పేర్కొన్నారు.
దీనికి పూర్వమే సూర్యుని పుత్రిక యమున.. ఛాయాదేవి శాపం వల్ల హిమాలయాల్లో నదిగా మారి ప్రవహించిందని చరిత్ర చెబుతుంది. ఇలా యమునా నది జన్మించింది. గంగా, యమునా పక్కపక్కన్నే ప్రవహిస్తుండడంతో గంగకు ఎంత పవిత్రత ఉందో యమునకు కూడా అదే పవిత్రత గొప్పతనం వచ్చాయి. అందుకే భారతీయులు గంగా, యమునా అని పలుకుతారు. ఈ నది గంగా నదికి ఎడమవైపున పుట్టి.. కుడివైపున కలిసే ఏకైక ఉపనది. యమునా ప్రవాహం సంవత్సమంతా ఓకే మాదిరిగా, దిశ కూడా స్థిరంగా ఉండటం విశేషం.
భాగవతంలోనూ యమునా నది ప్రస్తావన ఉంది. కంసుని బారినుంచి శ్రీకృష్టుడిని కాపాడటానికి వాసుదేవుడు ఈ నదిని దాటవలసి వస్తే అది రెండు పాయలుగా చీలి దారి ఇచ్చిందట. భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు చేశారని, అగస్త్య మహర్షి కూడా దీని ఒడ్డున పూజాదికాలు చేశారని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఋగ్వేదంలోనూ ఈ నది ప్రస్తావన ఉంది. ఈ నదికి ప్రతి సంవత్సరం మహామేళా, 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. దీనికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు.