Home Unknown facts రాక్షసుడి కడుపున విష్ణుభక్తుడు అయిన ప్రహ్లాదుడు జన్మించడానికి కారణం?

రాక్షసుడి కడుపున విష్ణుభక్తుడు అయిన ప్రహ్లాదుడు జన్మించడానికి కారణం?

0

రాక్షశుడైన హిరణ్య కశిపుని కడుపున పుట్టినా ప్రహ్లాదుడు స్వతహాగా విష్ణుమూర్తి భక్తుడు. తండ్రికి ఇష్టం లేకపోయినా హరి నమ స్మరణ చేస్తూ ఎన్ని బాధలు పెట్టినా ఆ శ్రీహరి మీద భారం వేసాడు. చివరికి సాక్షాత్తు విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించాడు. అయితే ప్రహ్లాదుని పూర్వ జన్మ చరిత్ర గురించి తెలుసుకుందాం.

ప్రహ్లాదుడుపూర్వం సత్య యుగంలో శివశర్మ అనే బ్రాహ్మణోత్తముడు, ధర్మాచారపరాయణుడు విజయనగరంలో జీవిస్తుండేవాడు. అతని భార్య మహాపతివ్రత, సుగుణశీలి భర్తనే దైవముగా పూజిస్తుండేది. వారికి అయిదుగురు పుత్రులు ఉండేవారు. ఆ అయిదుగురు పుత్రులు కూడా భక్తి కలిగి తల్లితండ్రులను పూజిస్తూ, వారి ధర్మాన్ని ఆచరిస్తుండేవారు. శివశర్మ తన నలుగురు పుత్రులు విష్ణులోకానికి వెళ్ళిన తరువాత మిగిలిన ఐదవ పుత్రుడు, సోమశర్మను పిలచి, అతని చేతికి నాలుగవ కుమారుడు తెచ్చి ఇచ్చిన అమృత కలశాన్ని ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పి, తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరి వెళ్ళాడు.

ఇలా దాదాపుగా పది సంవత్సరాలు శివశర్మ తన భార్యతో కలసి అన్ని తీర్ధాలు తిరిగి, తమ ఇంటికి చేరుకునే సమయానికి శివశర్మతపోబలంతో, అతనికి అతని భార్యకి కూడా కుష్టు రోగం వచ్చేలా చేసాడు. ఆ కుష్టు రోగంతో భాదపడుతూ ఇంటికి తిరిగి వచ్చిన తల్లితండ్రులను చూసిన సోమశర్మ అత్యంత విస్మయం చెందాడు. “ఓ తండ్రీ! తమరు నిత్యం అత్యంత నియమ నిష్టలతో ఉంటారు. అటువంటి మీకు ఇలాంటి అవస్థ ఏ పాపమువలన కలిగిందో దయచేసి చెప్పండి” అని కన్నీళ్లతో అడిగారు.

సోమశర్మ మాటలు విన్న శివశర్మ “మీము పూర్వ జన్మలో ఏదో పాపం చేసే ఉంటాం దాని నివృత్తికోసం ఇప్పుడు ఈ విధంగా శిక్ష అనుభవించవలసి వచ్చింది. పూర్వం చేసిన కర్మలకు ఫలం తప్పకుండా అనుభవించవలసిందే కదా! నీవు మా గురించి మా పాపాల గురించి ఆలోచించక, నీవు పితృభక్తి తత్పరుడివి కాబట్టి ఈ శరీరాన్ని వేడి నీటితో కడిగి రక్షించు” అని బదులు ఇచ్చాడు. సోమశర్మ తనతల్లితండ్రులకు చేయవలసిన సేవలు చేస్తూ, వారి పుండ్లను శుభ్రం చేస్తూ, వారికి విధిగా స్నానం చేయిస్తూ, మంచి భోజనాన్ని పెడుతూ తన నిత్య కృత్యాలను చేస్తూ ఉన్నాడు. శివశర్మ, అతని భార్య వారి శరీరానికి కలిగిన భాదల వల్ల తమ కుమారుడు తమకు సరిగా సేవలు చేయడం లేదని, అతనిని తిడుతూ, బాధపెడుతూ ఉన్నారు. అయినా సోమశర్మ భయభక్తులు కలిగి తల్లితండ్రులకు సేవలు చేస్తూనే ఉన్నాడు.

ఇలా కొంతకాలం గడచిన తరువాత, శివశర్మ ఇక తన ఐదవ పుత్రునికి విడుదల ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. తను తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు వెళ్లేముందు సోమశర్మకు ఇచ్చిన అమృత కలశాన్ని దొంగిలించాడు. ఇక ఏమి తెలియనివాడిలా సోమశర్మను పిలచి ” పుత్రా సోమశర్మ! మీము ఇంతకు ముందు జన్మలలో చేసిన పాపాలకు ఇప్పటివరకు మేము అనుభవించిన శారీరిక క్లేశం సరిపోతుంది కాబట్టి మేము ఇక ఈ భాద నుండి విముక్తి పొంధాలని అనుకుంటున్నాం కాబట్టి నేను నీకు ఇంతకుముందు ఇచ్చిన అమృతకలశాన్ని తెచ్చి ఇవ్వు. ” అని అడిగాడు.

తండ్రి కోరిక మేరకు అమృతం ఇవ్వడానికి చూడగా, సోమశర్మకు అమృత కలశం కనిపించలేదు. ఈ విషయం తన తండ్రికి తెలిస్తే భాదపడతాడని అనుకోని, తన తపఃశక్తితో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని మరొక అమృత కలశం సంపాదించి తెచ్చి తన తండ్రికి ఇచ్చాడు. తన పుత్రుని పితృభక్తి ని చూసి అమితానందం పొందిన శివశర్మ తన భార్యతోసహా తన నిజ రూపం పొందారు. అప్పుడు శివశర్మ సోమశర్మతో “ఓ పుత్రా! నీ భక్తి కి మేము అత్యంత ప్రసన్నులం అయ్యాము. నువ్వు ఇంకొంతకాలం ఈ భూమి పై ఉండవలసి ఉంది కాబట్టి నిత్యం ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. నీకు ఉన్నత పదవులు సిద్దించగలవు” అని ఆశీర్వదించి వారు విష్ణులోకానికి చేరుకున్నారు.

సోమశర్మ తపస్సుచేసుకుంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడచింది. సోమశర్మకు అంతిమ ఘడియలు సమీపించగానే అతనికి తనకు దగ్గరలో ఎవరివో రాక్షస గర్జనలు, కోలాహలాలు వినిపించాయి. ఆ శబ్దాలు వింటూ, రాక్షసుల గురించి ఆలోచిస్తూ తుదిశ్వాస విడిచాడు. తుదిశ్వాస విడచే సమయంలో ఎవరు ఏవిషయం గురించి ఆలోచిస్తారో మరు జన్మలో వారు అలా జన్మిస్తారు. కాబట్టి సోమశర్మ రాక్షసయోనిలో జన్మించాడు. కానీ పూర్వజన్మలో చేసుకున్న అమితమయిన పుణ్యం కారణంగా అతనికి విష్ణు భక్తి ప్రాప్తించింది. అతనే విష్ణుభక్తులలో అగ్రగణ్యుడుగా అయ్యాడు.

 

Exit mobile version