హిందువులు దేవాలయాలకు వెళ్లినపుడు గంట కొట్టకుండా దేవుడి దర్శనం చేసుకోరు. గుడిలో గంటకు అంత ప్రత్యేకత ఉంది. చిన్నదైనా, పెద్దదైనా గంటను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు. భగవంతుడికి హారతి ఇచ్చినపుడు, నైవేధ్యం పెట్టినపుడు ఇలా ముఖ్యమైన పూజలు చేసిన ప్రతీసారి గంటను కొడతారు. అయితే అసలు దేవాలయం లో గంట ఎందుకు కొడతారు ? అనేది మనలో చాలా మందికి తెలియదు. గంట కొట్టడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూదాం..
ఆలయం లో కొట్టే గంటకు ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి. దేవుని ముందు గంట కొట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులను,వ్యతిరేఖ కిరణాలను దూరం చేస్తుంది. అంతే కాదు దేవుడి ముందు ఏమైనా కోరికలు కోరుకుని గంట కొడితే అవి సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతుందని భక్తుల నమ్మకం. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే అన్నీ శుభాలకు సంకేతం అని కూడా అంటారు. ఇక ఆలయంలో కానీ, ఇండ్లలో చేసుకునే ప్రత్యేక పూజలలో కానీ గంటను మోగిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
గంటలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. గంట నాలుక భాగంలో సరస్వతి దేవి కొలువై ఉంటుంది అని, ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, పొట్ట భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి పిడి భాగంలో గరుడ, చక్ర , హనుమా, నందీశ్వరుడు ఉంటారు. అంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అన్ని దేవుళ్లను ఆలయంలో ఆహ్వానిస్తుంటారు. హారతి సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. అందుకే హారతి సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్లు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్షగా దర్శించాలి అని పురోహితులు చెబుతుంటారు.
ఇక కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది. ఈ నాదం వినబడడం వలన మనిషిలో ఉన్న చింతలు, సమస్యలను తొలగిపోతాయని, మనసు దేవుడిపై మళ్లేలా చేస్తుందని నమ్ముతుంటారు. కొన్ని దేవాలయాల్లో గంటలను గుత్తులు, గుత్తులుగా ఒకేతాడుకి కట్టి ఉంచుతారు. ఇలాంటి గంటల వల్ల పెద్ద ప్రయోజనముండదు. కేవలం వాటిని అలంకార ప్రాయంగా అలా కట్టి ఉంచుతారు. అంతేకానీ వాటి వల్ల ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండదు.