Home Unknown facts గంగ భూమి మీదకు రావడానికి గల కారణమూ ?

గంగ భూమి మీదకు రావడానికి గల కారణమూ ?

0
Ganga Devi

ఎవరైనా అత్యంతకష్టమైన పనిని చేయడానికి సంకల్పించినపుడు భగీరథప్రయత్నం అని అంటుంటాం. గంగమ్మతల్లి ఈ భూమికి రావడానికి వెనుక గల అసలు కారణం కూడ భగీరథ ప్రయత్నమే.

“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు”

ఎక్కడ, ఏ నీళ్ళలో స్నానం చేస్తున్నప్పటికీ ఈ శ్లోకంలో పేర్కొన్న ఏడు నదులను స్మరించుకోవాలని పెద్దలవాక్కు.ఆ నదుల వరుసలో ప్రథమ తాంబూలం గంగానదికే. గంగ పేరును తలచుకుంటేనే ప్రతి ఒక్క భారతీయుని హృదయం భక్తితో పులకిస్తుంది. పవిత్రమైన గంగానది స్పర్శతో ఎన్నో జీవితాలు పునీతమయ్యాయి. చీకటి అనే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానకాంతులు వెల్లివిరిసాయి. అందుకే ఆ పుణ్యనది జ్ఞానగంగ! పశుపక్ష్యాదులకు, వృక్ష, మానవజాతికి ప్రాణాధారమైన నీటికే ‘గంగ’ పర్యాయపదమైనదంటే, ఆ తల్లి మన జీవనంలో ఎలా మమేకమైపోయిందో ఊహించుకోవచ్చు. అలా ఈ నేల మీద ప్రతి పుణ్యనది గంగా ప్రతి రూపమే, దివి నుంచి భువికి దిగివచ్చిన పావనగంగ పుట్టుక వెనుక ఒక రహస్యమైన కథ ఉంది. శివుడు మాత్రమే ఆపగలిగే గంగను ఒక మునీశ్వరుడు నోటితో ఆపాడు. ఆ మునీశ్వరుడెవరో తెలుసుకుందాం..

సగరుడు భూలోకాన్ని పరిపాలిస్తున్న సమయం అది. అతనికి కేశిని, సుమతి అనే ఇద్దరు భార్యలు, కేశినివల్ల అసమంజసుడు అనే కొడుకు, సుమతి వల్ల అరవైవేలమంది పుత్రులు కలిగారు. అసమంజసుడు పేరుకు తగ్గట్టుగా క్రూరునిగా దుష్టకృత్యాలను చేస్తుండేవాడు. చిన్న పిల్లల్ని నదిలోకి విసిరేసి పైశాచిక ఆనందాన్ని పొండుతుండేవాడు. ప్రజలతడిని అసహ్యించుకొని సగరునికి మొరపెట్టుకోగా, అతడు కొడుకును రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు.

అనంతరం సగరుడు ఏడు ఆశ్వమేథ యాగాలను తలపెట్టి, అశ్వాన్ని విడిచిపెట్టి, దానివెంట అరవైవేలమంది కొడుకులను పంపాడు. గుర్రం దేశమంతా తిరిగి చివరకు సముద్రంలో ప్రవేశించింది. అప్పుడు ఆ గుర్రాన్ని చూసిన ఇంద్రుడు, వాయుదేవుణ్ణి పిలిచి విషయాన్ని చెప్పగా, వాయువు ఆ గుర్రాన్ని బంధించి తీసుకెళ్ళి పాతాళంలో రసాతలంలోని కపిలముని ఆశ్రమంలో కట్టేశాడు.

సగరపుత్రులకు ఆ తర్వాత గుర్రం కనిపించకపోవడంతో రాజ్యానికి తిరిగి వెళ్ళి తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పారు. అశ్వమే లేనప్పుడు ఇక అశ్వమేథ యాగానికి అర్థమేముంది? అని సగరుడు కుమిలిపోయాడు. గుర్రంతో తిరిగి వస్తే తప్ప, మళ్ళీ రాజ్యప్రవేశం లేదని కొడుకులను ఆజ్ఞాపించాడు సగర చక్రవర్తి. తండ్రిమాటకు ఎదురు చెప్పలేకపోయిన సగర పుత్రులు సముద్రంలోకి వెళ్ళి రసాతలానికి చేరుకొని అక్కడ కపిలమహర్షి ఆశ్రమంలో కట్టేసిఉన్న అశ్వాన్ని చూసారు. కపిలుడే ఆ గురాన్ని దొంగిలించాడని భావించిన సగరపుత్రులు, కపిలుని దూషిస్తూ అనుచింతంగా ప్రవర్తించగా, ముని కోపంతో కనులు తెరవగా, ఆ జ్వాలల్లో భస్మమైపోయారు. ఈలోపు అసమంజసునికి అంశుమంతుడు అనే కుమారుడు కలిగాడు.

సగరుడు మనువడికే రాజ్యాన్ని అప్పగించాడు. అతను పినతండ్రుల జాడ కోసం ప్రయత్నిస్తాడు. అలా రసాతలానికి చేరుకున్న అతనికి పినతండ్రులు బూడిదకుప్పలుగా కనబడతారు. గరుత్మంతుని ద్వారా తన పినతండ్రులకు ఉత్తమగతులు కలగాలంటే గంగలో పునీతం చేయడం తప్ప మరోమార్గం లేదని తెలుస్తుంది. ఆ ప్రయత్నంలో కొన్ని తరాలు గడచిన తర్వాత భగీరథుని ప్రయత్నం ప్రారంభమవుతుంది.

భగీరథుడు తన పూర్వీకులు కపిలుని ఆగ్రహానికి గురై భస్మమైన సంగతిని తెలుసుకుని, వారికి సద్గతులు కలగాలంటే, ఆ భస్మరాశులపై గంగను ప్రవహింపజేస్తే ఫలితముంటుందని తెలుసుకుంటాడు. గంగను తలచుకొని తప్పస్సు చేసిన భగీరథుడు, ఆమెను ఒప్పిస్తాడు. అయితే తాను కిందికి ప్రవహిస్తున్నపుడు, తనను భరించగల శక్తి శివునికే ఉంది. కాబట్టి ఆయన భారిస్తానంటే, తను భూమిపైకి రావడానికి సమ్మతమేనని గంగ చెబుతుంది. భగీరథుడు తీవ్రమైన తప్పస్సుతో శివునికూడ ఒప్పిస్తాడు. ఆవిధంగా గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చిందని పురాణ కథనం.

అయితే భూమిపైకి దిగిన గంగ జహ్నుముని ఆశ్రమం లోకి వెళ్లగా కోపగించుకున్న జహ్నుముని గంగను నోటపడతాడు. అప్పుడు భగీరథుడు ఆ మునిని ప్రార్థించగా, కరుణించి తన చెవుల నుండి విడిచి పెడతాడు. అలా భగీరథుని ప్రయత్నం వల్ల భూమికి వచ్చిన గంగ భాగీరథి అని పిలువబడి, అనంతరం జహ్నుముని వలన జాహ్నవి అయింది. చివరకు నగరపుత్రుల భస్మం మీదుగా గంగ ప్రవహించగా, వారికి ఉత్తమగతులు లభించాయి.

 

Exit mobile version