Home Unknown facts భీష్ముడు కాలం చేసే ముందు ధర్మరాజుకి చెప్పిన విషయం

భీష్ముడు కాలం చేసే ముందు ధర్మరాజుకి చెప్పిన విషయం

0

మహాభారతంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలుఉన్నాయి. అందులో ముఖ్యమైన వ్యక్తి భీష్మ పితామహుడు.. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన, ప్రధానమైన వ్యక్తి. ఈయన పరమ పవిత్రమైన గంగా దేవి పుత్రుడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. దేవలోకంలో ఇంద్రుడు, శ్రీమహావిష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన వారు అష్ట వసువులలలో భీష్ముడు ఒకరు. అష్ట వసువులు అంటే మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు. వశిష్టుని శాపంతో మానవులుగా జన్మించిన ఈ ఎనిమిది మందిలో భీష్ముడు తప్ప మిగతా ఏడుగురు పుట్టిన కొద్దికాలానికే దేవలోకం చేరుకున్నారు. కురుకుల యోధుడైన భీష్ముడు తన తండ్రి కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. పాండవులతో పోరు మంచిది కాదని ధుర్యోదనుడికి హితబోధ చేసినా అతడు వినిపించుకోకపోవడంతో అయిష్టంగానే యుద్ధంలో పాల్గొన్నాడు.

భీష్ముడుచివరికి అంబ మళ్ళీ జన్మించి శిఖండిగా ఎదురుగా నిలబడే సరికి శాస్త్రాలు వొదిలేసాడు. అర్జునుడి బాణాల పాన్పు మీద చివరికి క్షణాలు గడిపాడు. అప్పుడు ధర్మరాజు ” భీష్మపితామహా ! నరుడు చేసే కర్మలకు అతడి పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి సుఖదుఃఖాలు, శుభాశుభయాలు ఉంటాయి కదా ఆ కర్మల కర్త అతడేనా ! కాదా ! అని నాకు అనుమానంగా ఉంది దానిని వివరించండి ” అని అడిగాడు. దానికి సమాధానంగా భీష్ముడు ! ధర్మనందనా ! ఒక సారి ఇంద్రుడు ప్రహ్లాదుడి మధ్య జరిగిన సంవాదం వింటే నీ సందేహం తీరుతుంది.

సత్వగుణ సంపన్నుడు, ఎల్లప్పుడూ సంయమనం పాటించే వాడు, అహంకారము లేని వాడు, కోపమంటే తెలియనివాడు, నిందను స్తుతిని సమానంగా పరిగణించేవాడు, ఇనుమును బంగారమును సమానంగా విలువ కట్టేవాడు అయిన ప్రహ్లాదుడు తన మందిరంలో కూర్చుని ఉండగా ఇంద్రుడు అతడి అంతరంగం తెలుసుకోవాలని అక్కడకు వచ్చి ” ప్రహ్లాదా ! నీవు సంపద లేకున్నా దుఃఖించవు, శత్రువుల చేతికి చిక్కుతానన్న భయము లేదు, అసలు ఏమీ చేయవు ఇంతటి బేలగా ఉంటే ఎలా ? ” అని అడిగాడు.

అందుకు సమాధానంగా ప్రహ్లాదుడు ” ఇంద్రా ! కలిమి లేమి పక్క పక్కనే ఉంటాయి. సంపదలు ప్రయత్నిస్తే వస్తాయి లేకుంటే రావు అనుకోవడం నీ బేలతనమే ! సంపదలు సంపాదించనవసరం లేదు విధి అనుకూలిస్తే వచ్చి పడతాయి ప్రతికూలిస్తే హారతికర్పూరంలా కరిగి పోతాయి. దీనికి మానవ ప్రయత్నంతో పని లేదు. శత్రువులు ఓడించడం, మిత్రులు కాపాడడము, సంపదల రాకపోక అంతా విధిలిఖితమే. మానవుడి మనసును అనుసరించి భావాలుపుడతాయి, పోతాయి. చంచలమైన మనసులోని భావాలు చంచలమైనవే అని తెలుసుకుని మనసుని నిగ్రహించాలి. తన పనులన్నిటికీ తానేకర్తను అనుకోవడం అవివేకమే అవుతుంది. అలా అయితే మానవులు చేసే కర్మలన్నిటికీ సమ ఫలితాలు ఉండాలి కదా ! అఖిలకర్మలకు కర్త ఆ పరమేశ్వరుడే కాని మానవుడు కాదు.

తాను చేసే కర్మలకు తానేకర్తను అన్న అహంకారంతో కర్మలు చేసే వాడికి కర్మఫలం అంటుకుటుంది. ఫలాపేక్ష లేక కర్మలను చేస్తూ సుఖదుఃఖాలకు లోను కాక మనసు నిలకడగా ఉంచుకున్న వాడు మహనీయుడు. కాబట్టి దేవేంద్రా! నేను ఈ లోకంలో ఉన్న సకల ప్రాణులకు అనిత్యములే అని అసత్యములని తెలుసుకుని సంసార బంధం లో చిక్కకుండా ఉంటాను.

శాంతితోను ఇంద్రియనిగ్రహముతో ఉండే వాడికి బాధలు దరిచేరవు. నేను అలా నిశ్చింతగా జీవిస్తున్నాను ” అని ప్రహ్లాదుడు అన్నాడు. ఇంద్రుడు ” దానవేంద్రా ! నీకు ఇంతటి ప్రశాంతచిత్తం ఎలా అలవడింది చెప్పవా ! ” అని అడిగాడు. ప్రహ్లాదుడు ” దేవేంద్రా ! ఆత్మావలోకం, మంచిప్రవర్తన, మనసును ప్రసన్నంగా ఉంచుకోవడం, అప్రమత్తత, పెద్దలను వృద్ధులను గౌరవించడం లాంటి ఉత్తమ లక్షణాలు మానవులకు మేలుచేసి మానవుడికి ప్రజ్ఞా శాంతి ఇస్తాయి. ఇది విన్న ఇంద్రుడు ఆశ్చర్యముతో తిరిగి స్వర్గానికి వెళ్ళాడు” అని బీష్ముడు చెప్పాడు.

 

Exit mobile version