Home Unknown facts ఏ కాలం నుండి శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైందో తెలుసా ?

ఏ కాలం నుండి శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైందో తెలుసా ?

0

తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కెల్లా అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు. అయితే స్వామి వారికి ఎన్నో రకాల ఆభరణాలు భక్తులు సమర్పించుకుంటారు. అందులో ముఖ్యమైన ఆభరణాల గురించి తెలుసుకుందాం.

The secret of Thirumala Srivari jeweleryశ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450) లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది.

ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు స్వర్ణయుగమేనని చెప్పవచ్చు. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేసారు. శ్రీకృష్ణ దేవరాయలు మొదటి సారి శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించారు.

మరో సారి నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించారు. తంజావూరు రాజు పాండ్యన్‌ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్‌ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు మార్పులు చెందినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది. స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు.

బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన థామస్‌ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి ‘అష్ట దళ పాదపద్మారాధన’ పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం.

అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌మీరా సమర్పించారు. వేంకటేశ్వర హెచరీస్‌ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్‌ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది.

తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా.. రెండా.. ఎన్నో ఆభరణాలను స్వామి వారికి భక్తులు సమర్పించారు.

 

Exit mobile version