పులస, మన తెలుగు వారికి బాగా పరిచయం వున్న పేరు. భోజన ప్రియులకు ఈ పేరు వింటేనే నోరూరుతుంది.ప్రతి యేటా వర్షా కాలంలో లభించే ఈ చేప కోసం మీన ప్రియులు ఎగబడుతుంటారు, తాము రుచిచూడడమే కాక దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు కూడా పంపిస్తుంటారు. పుస్తెలమ్మైన పులస తినాలి అనే సామెత మన తెలుగు ప్రజలలో ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఎక్కువగా ఉంది దీన్ని బట్టే అర్థమవుతోంది మనకు పులసంటే ప్రాణమని.
ఇంగ్లీష్ లో ఇలిష్ అని పిలవబడే ఈ చేప నిజానికి సముద్ర చేప, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరికి వచ్చిన వరద వల్ల, ఆ ఎర్ర నీటిలో సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టడానికి ఎదురు ఈదుకుంటూ గోదావరి పాయలలోకి వస్తుంది. ఇవి అంతర్వేది దగ్గర గోదావరి, సముద్ర సంగమ ప్రాంతం నుంచి నది లోకి వస్తాయి. ఈ చేపలు ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్రాలలో సంచరిస్తూ, గుడ్లు పెట్టడానికి గోదావరికి వచ్చి తిరిగి మళ్లీ సముద్రం లోకి వెళ్లిపోతాయి.
గోదావరిలో వీటి వేట సంప్రదాయ నాటు పడువల్లో జరుగుతుంది అరకిలో నుంచి కిలోన్నర వరకు ఉండే ఒక్కొక్క పులస, కిలో 4 నుంచి 5 వేలు పలుకుతుంది. ఈ చేపలు తక్కువగా దొరకటం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నరసాపురం, అంతర్వేది, సిద్ధాంతం, రావులపాలెం లో ఎక్కువగా వీటి అమ్మకాలు ఉండి ఆ ప్రాంతాలు పులస ప్రియులతో కళకళలాడూతుంటాయి.