ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు. ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. ఇక ఆంజనేయస్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు. మరి ఇక్కడ వెలసిన ఆంజనేయస్వామిని మహాశక్తివంతుడు అని ఎందుకు అంటారు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని, సికింద్రాబాద్ కి దగ్గరలో తాడుబందు వీరాంజనేయస్వామి ఆలయం ఉంది. అయితే రామాయణ కాలంలో జాబాలి మహర్షి మూడు ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించగా అందులో ఈ ఆలయంలో ఉన్న విగ్రహం మొదటిదిగా చెబుతారు. ఇక రెండవ విగ్రహం హృషీకేశ్ లో ఉండగా, మూడవ విగ్రహం తిరుపతి లో ఉంది. జాబాలి మహర్షి తన తపస్సు ని అంత ధారబోసి ప్రతిష్టించిన ఈ మూడు క్షేత్రాలను కలిపి జాబాలి క్షేత్రాలని అంటారు. అందుకే ఇక్కడి ఆంజనేయస్వామిని మహాశక్తివంతుడు అని అంటారు.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, 1927 లో సికింద్రాబాద్ నగరంలో నివసించే ప్రజలు ప్లేగు వ్యాధి భయంతో వారిని ఇండ్లని వదిలేసి తాడుబందు ప్రదేశంలో నివాసాన్ని ఏర్పాటుచేసుకున్నారు. అయితే ఇక్కడ నివసించే ఒక భక్తుడి కలలో ఆంజనేయస్వామి వారు కనిపించి విగ్రహ జాడని తెలియచేయగా, ఆ భక్తుడు కొందరి సహాయంతో వెళ్లి వెతుకుతుండగా ఒక మూళ్ళ పొదలో ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపించడంతో సంతోషించి స్వామివారిని ప్రతిష్టించి పూజించగా ఈ ప్రాంతంలో ప్లేగువ్యాధి పూర్తిగా నశించినది.
ఈవిధంగా మహాశక్తివంతుడైన ఆంజనేయస్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో సీతారామలక్ష్మణ సమేత శ్రీ ధ్యానాంజనేయస్వామి, శివపంచాయతనం, నవ గ్రహాలు, స్వామివారి వాహనమైన ఒంటె ఈ ఆలయంలో ప్రతిష్టించబడి ఉన్నాయి. మన దేశంలో ఈవిధంగా ప్రతిష్ఠితమైన ఏకైక ఆలయం ఇది మాత్రమే అని చెబుతారు. ఇక ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆంజనేయస్వామిని దర్శనం చేసుకుంటారు.