Home Unknown facts వెంకటేశ్వర స్వామిని అల్లుడిగా భావించే ఈ ఆలయాన్ని ముస్లీమ్ లు దర్శించుకుంటారు!

వెంకటేశ్వర స్వామిని అల్లుడిగా భావించే ఈ ఆలయాన్ని ముస్లీమ్ లు దర్శించుకుంటారు!

0

దేవునికి ప్రత్యేకంగా ఒక రూపం అంటూ ఏముంటుంది? క్రైస్తవుల క్రీస్తు అయినా, హిందువుల కృష్ణుడైనా భక్తుల కులమతాలను పట్టించుకోరు కదా! అందుకే భక్తులు కూడా తమ మనసులో కోరికలని తీర్చమంటూ కనిపించిన దైవానికల్లా మొక్కుకుంటారు. దానికి నిదర్శనమే దేవునికడపలో సాగే ముస్లింల ప్రార్థనలు. దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు.

Tirumala“దేవుని గడప” అనే పదాల నుండి ఉద్భవించిన గడపా అనే పదానికి కడప అని పేరు పెట్టారు, దీని అర్థం “ వెంకటేశ్వర స్వామి ప్రవేశ ద్వారం”. ఇక్కడి వెంకటేశ్వరుని విగ్రహం కృపాచార్య చేత స్థాపించబడింది, అందువల్ల దేవుని కడప యొక్క పురాతన పేరు పురాణాలలో “కృపావతి క్షేత్రం” గా పేర్కొనబడింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం విజయనగర నిర్మాణానికి ఉదాహరణగా నిలుస్తుంది. తల్లాపాక అన్నమచార్య ఈ స్థలాన్ని సందర్శించారని, అద్వైత మఠం యొక్క శంకరాచార్యులందరూ మరియు గొప్ప కవి క్షేత్రయ్య కూడా ఈ స్థలాన్ని సందర్శించారని చెబుతారు. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది.

రాష్ట్రంలోని ప్రతి ఆలయంలాగానే ఇక్కడి వెంకన్న ఆలయం కూడా ఉగాది రోజున కిటకిటలాడిపోతుంది. ఆ సందడిలో పాలుపంచుకునే ముస్లింల భక్తిని చూసితీరాల్సిందే! వెంకన్న భార్యలలో ఒకరైన బీబీనాంచారమ్మ ముస్లింల ఆడపడుచే కదా! అందుకనే కడప చుట్టుపక్కల ముస్లింలు వెంకటేశ్వరస్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. ఏటా ఉగాదినాడు తప్పకుండా ఆయనను దర్శించుకుంటారు. అలాగని ఏదో మొక్కుబడిగా గుడికి వస్తారనుకుంటే పొరపాటే! ఉగాది రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఉగాది పచ్చడిలో వేసే బెల్లం, వేపపువ్వు, చెరుకుగడలు, చింతపండు వంటి సరుకులను తీసుకుని ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కూడా వీరి భక్తి ప్రపత్తులు హైందవులకి ఏమాత్రం తీసిపోవు. తాము తెచ్చిన పదార్థాలను స్వామివారికి నివేదించి, కొబ్బరికాయను కొట్టి, హారతిని కళ్లకు అద్దుకుని, శఠారిని స్వీకరించి… తీర్థప్రసాదాలను అందుకుంటారు.

ఈ రోజంతా వారు మద్యమాంసాలను ముట్టరు. ఇలా ఉగాది రోజున ముస్లింలు దేవుని సేవించుకునే ఆచారం వందల ఏళ్లుగా నిరాటంకంగా వస్తోందని చెబుతున్నారు. కాలం మారినా… కల్మషాలు రేగినా, ఈ ఆచారం ఇలా సాగుతూనే ఉంటుందని అక్కడి ముస్లిం పెద్దలు భరోసాని అందిస్తున్నారు.

ఈ గుడిలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి, సోమేశ్వరాలయం, దుర్గాలయం చూడదగినవి. ఇక్కడ ఇటీవల నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ. గర్భగుడి వెనుకవైపు 13 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహముంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రానికి పాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాపనివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు.

దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అనికూడా అంటారు. కొలనులోని నిరయమంటపం, పడమరన తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి నీరొచ్చే మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏడో రోజు మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామి గ్రామంలో ఊరేగుతాడు

 

Exit mobile version