Home Unknown facts శ్రీవారికి రోజు ఏయే సమయాల్లో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారు?

శ్రీవారికి రోజు ఏయే సమయాల్లో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారు?

0

తిరుమల తిరుపతి లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. అయితే శ్రీవారికి రోజు మిరియాల అన్నం, దోస నైవేద్యంగా పెడతారని చెబుతున్నారు. మరి శ్రీవారికి రోజు ఏయే సమయాల్లో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారు? ఆ వెంకన్నస్వామికి సమర్పించే నైవేద్యాల పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

tirumala tirupati prasadam

ఆగమశాస్త్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఎలాంటి పదార్థాలతో తయారుచేసిన నైవేద్యం ఎవరు ఏవిధంగా ఏయే సమయాల్లో పెట్టాలనే పూర్తి విషయాలు ఉన్నాయి. ఇంకా గర్భగుడిలో స్వామివారి విగ్రహం ఎత్తు 9.5 అడుగుల ఎత్తు ఉండగా, దీనికి అనుగుణంగా స్వామివారికి ఏ పుట ఎంత ప్రసాదం సమర్పించాలో కూడా శాస్రం లో ఉంది. దానికి అనుగుణంగానే తిరుమలలో ప్రసాదాల తయారీ సమర్పణ అనేది జరుగుతుంటుంది. ఇందులో ముందుగా వంట తయారుచేయడానికి ముళ్ల చెట్లను కానీ, పాలు కారే చెట్లను కానీ ఉపయోగించరు. ఇంకా ప్రసాదం వండేవారు వంట చేసే సమయంలో కానీ, వంట చేయడం పూర్తైన తరువాత కానీ వాసన అనేది చూడకుండా ముక్కు, నోరుకి వస్ర్తాన్ని కట్టుకుంటారు. అంతేకాకుండా ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించేంతవరకు బయటి వారు ఎవరు కూడా ప్రసాదాన్ని చూడటానికి వీలు లేదు.

ఇక స్వామివారికి రోజు మూడు పూటల నైవేద్యాన్ని సమర్పిస్తారు. వాటినే బాలభోగం, రాజభోగం మరియు శయనభోగం అని అంటారు.

బాలభోగం:

ప్రతి రోజు ఉదయం ఆరు నుండి ఆరున్నర గంటల సమయంలో బాలభోగం సమర్పిస్తారు. ఇందులో నేతి పొంగలి, చక్కర పొంగలి, రవ్వ కేసరి, పులిహోర, దద్యోజనం, మాత్రాన్నం వంటివి స్వామివారికి సమర్పిస్తారు.

రాజభోగం:

స్వామివారికి పది లేదా పదకొండు మధ్యలో సమర్పించే నైవేద్యాన్ని రాజభోగం అని అంటారు. ఇక మధ్యాహ్నం స్వామివారికి పులిహోర, దద్యోజనం, తెల్ల అన్నం, చక్కర అన్నం, గుడాన్నాం సమర్పిస్తారు.

శయనభోగం:

స్వామివారికి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని శయనభోగం అంటారు. ఇందులో మిర్యాల అన్నం, వడ, లడ్డు, శాకాన్నం అంటే వివిధ రకాల కూరగాయలతో వండిన అన్నం సమర్పిస్తారు.

ఇలా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నంతవరకు కూడా ఆలయంలో గంటలు మోగుతూ ఉంటాయి. స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో గర్భగుడి తలుపులు మూసివేసి, గర్బగుడి లోపల నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే ఉంటాడు. ఇక అర్చకుడు పవిత్ర మంత్రాలూ ఉచ్చరిస్తూ కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకి దానిని స్వామివారి కుడిచేతికి తాకించి స్వామివారి నోటి దగ్గర తాకుతారు. ఇలా రోజు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత భక్తులకు దీనిని పంచుతారు.

ఇక ఉదయం నుండి రాత్రి సమయం వరకు స్వామివారి నైవేద్యం ఎలా మొదలై ఎలా ముగిస్తుందనే విషయానికి వస్తే, ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అప్పుడే తీసిన చిక్కటి ఆవుపాలను సమర్పించి, అర్చన సేవలు పూర్తైన తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు. దీని తరువాత బాలభోగం సమర్పిస్తారు. ఆ తరువాత సర్వదర్శనం మొదలవుతుంది. మళ్ళీ అర్చన ముగిసిన తరువాత రాజభోగం సమర్పించగా ఆ తరువాత సర్వదర్శనం మొదలవుతుంది. ఇక సాయంత్రం గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో అలంకరిస్తారు. మళ్ళీ అర్చన ముగిసిన తరువాత రాత్రి శయనభోగం సమర్పిస్తారు. అర్ధరాత్రి శుద్దన్నాం సమర్పించిన తరువాత స్వామివారు పడుకునేముందు ఏకాంత సేవలో భాగంగా వేడి పాలు, పండ్ల ముక్కలు, నేతిలో వేయించిన బాదాం, జీడిపప్పులు స్వామివారికి సమర్పిస్తారు.

ఈవిధంగా తిరుమల స్వామివారికి ప్రతి రోజు ఉదయం సుప్రభాత సేవ దగ్గరి నుండి రాత్రి స్వామివారి ఏకాంతసేవ వరకు ఆగమశాస్త్రం ప్రకారం ఇలా పలురకాల నైవేద్యాలను శ్రీవారికి సమర్పిసారు.

Exit mobile version