Home Unknown facts Tirupathi Laddu – Main Reason Why This Famous Prasadham Was Actually Started

Tirupathi Laddu – Main Reason Why This Famous Prasadham Was Actually Started

0

మన దేశంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో పులిహోర, లడ్డు వంటివి  దేవుడి ప్రసాదంగా ఇస్తారు. అయితే అందులో ముఖ్యంగా చెప్పుకుంటే తిరుమల తిరుపతి లడ్డుకి ఉన్న ప్రత్యేకత ప్రపంచంలో ఏ ఇతర ఆలయానికి లేదనే చెప్పవచ్చు. మరి తిరుపతిలో లడ్డు ప్రసాదం అనేది ఎప్పటి నుండి మొదలైంది? అసలు తిరుపతి లడ్డుకి ఎందుకు అంత ప్రత్యేకత అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-temple

తిరుపతి  వెంకన్న ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి నైవేద్య వేళలు ఖరారయ్యాయట. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేదీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదు. దాంతో దూరప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది. అప్పుడే లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందట. అది కాస్తా చివరకు 1940లో లడ్డూగా స్థిరపడింది.

2-Laddu

లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేలు అంటారు. పడిని కొలమానంగా నిర్ణయించుకున్నారు. పడి అంటే 51 వస్తువులు అని అర్ధం.

అయితే కొడుకు ఆకలి తల్లికి మాత్రమే తెలుసు. అందుకేనేమో, తల్లిప్రేమకు చిహ్నంగా మూలమూర్తి కొలువుండే గర్భాలయానికి శ్రీవారి వంటశాల కు ముందు శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహాన్ని నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయ మూల ఆలయంలో నిర్మించిన పోటులో ప్రసాదాలు తయారు చేస్తారు. వాటిని వకుళమాత ముందు కొంతసేపు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డూ వడలు మొదలైన పనియారాల్ని ఆలయంలోని సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు.

తిరుపతి లో మూడు రకాల లడ్డూలు ఉంటాయి. ఆ లడ్డూల్ని ఆస్థానం లడ్డు, కల్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారుచేసి, గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది. దీని ధర రూ.100. మూడవది ప్రోక్తం లడ్డు. ఇదే చిన్న లడ్డు. భక్తులకు లభించే లడ్డు. 175 గ్రాములు బరువుండే దీని ధర రూ.25.

ఇక 1940 తొలిరోజుల్లో లడ్డూ అనేది కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది. ఆ లడ్డు రేటు కూడా ఎనిమిదణాలే. ఆ తర్వాత 2 రూపాయలకు విక్రయించేవారు. మెల్లగా అది నాలుగు, ఐదు, పదికి పెరిగింది. ఇప్పుడు ఏకంగా రూ.25కు చేరింది. రేటు పెరిగినా దానికున్న డిమాండ్ మాత్రం అంతా ఇంతా కాదు. రూ.50 నుండి రూ.75 వరకు చెల్లించినా లడ్డూలు దొరకని సందర్భాలు ఉన్నాయి.

అయితే రోజు రోజుకి తిరుపతి లడ్డూ రుచి మారుతోందని భక్తులు అంటున్నారు. కాలంతోపాటు మార్పు సహజమే అయినా ఆనాటి పరిస్థితులు ఈ రోజుల్లో ఎక్కడున్నాయని అధికారులు అంటున్నారు. లడ్డూ తయారీలో వినియోగించే శెనగపప్పు , చెరకు ను గతంలో సేంద్రీయ ఎరువులతో పండించేవారు. ప్రస్తుతం కృత్రిమ ఎరువులతో పండిస్తున్నారు. పొయ్యికింద కట్టెలకు బదులు గ్యాస్‌ను, బూందీని, చక్కెరపాకాన్ని కలపడానికి యంత్రం వాడుతున్నారు. లడ్డూల్ని యంత్రాలతో తయారు చేయడం వల్ల వాటిమీద ఉన్న చక్కెరపాకం కారిపోతోంది. ఫలితంగా ఒక్కరోజులోనే గట్టిపడిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండుకు అనుగుణంగా లక్షలాది లడ్డూలు తయారు చేయాలంటే పాత పద్ధతిని అనుసరిస్తే సాధ్యమయ్యే పనేనా అంటున్నారు అధికారులు.

ఏది ఏమైనప్పటికి ఆ తిరుపతి లడ్డుని మించిన ప్రసాదం ప్రపంచంలో మరొకటి లేదని చెప్పవచ్చు.

Exit mobile version