Home Unknown facts శివరాత్రి రోజున అర్థనారీశ్వర శివలింగం ఒకటిగా కలసి దర్శనం ఇచ్చే ఆలయం

శివరాత్రి రోజున అర్థనారీశ్వర శివలింగం ఒకటిగా కలసి దర్శనం ఇచ్చే ఆలయం

0

మన దేశంలో ఎన్నో అద్భుత శివాలయాలు ఉన్నాయి. శివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తుంటాడు. శివలింగం అంటే హిందూమతంలో పూజించబడే శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. శివం అంటే శుభప్రదమైనది, లింగం అంటే సంకేతం అని అర్ధం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, దేశంలో ఎక్కడ లేని విధంగా శివలింగం అర్థనారీశ్వర రూపంలో దర్శనం ఇస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, శివరాత్రి రోజున ఈ అర్థనారీశ్వర శివలింగం ఒకటిగా కలసి దర్శనం ఇస్తుందని చెబుతారు. మరి ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో విశేషాలు ఉన్న ఈ అర్థనారీశ్వర శివలింగం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mahashivratri

హిమాచల్ ప్రదేశ్, కత్ గాథ్ అనే ప్రాంతంలో ఈ శివాలయం ఉంది. ఈ ఆలయంలో అర్థనారీశ్వర శివలింగం భక్తులకి దర్శనం ఇస్తుంటుంది. ఈ శివలింగ ఆకారం ఒక భాగం పెద్దదిగా, మరిక భాగం చిన్నదిగా ఉంటుంది. పెద్దగా ఉన్న భాగం శివుడని, చిన్నగా ఉన్న భాగం పార్వతీదేవి అని భక్తులు పూజలు చేస్తుంటారు. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ రెండు భాగాలు కూడా గ్రహాలకి అనుగుణంగా కదులుతూ ఉంటాయని చెబుతుంటారు.

ఇలా అర్థనారీశ్వర రూపంలో ఉన్న శివలింగం వేసవి కాలంలో దూరంగా, చలికాలంలో దగ్గరగా ఈ రెండు శివలింగ భాగాలు జరుగుతుంటాయని చెబుతుంటారు. పూర్వం ఈ ఆలయాన్ని సికిందర్ అనే రాజు నిర్మించినట్లుగా చెబుతున్నారు. అక్కడి స్థానికుల కథనం ప్రకారం సికిందర్ అనే రాజు భూమి లోపల ఉన్న ఈ అర్థనారీశ్వర శివలింగాన్ని బయటికి తీసి ఖగోళ సూత్రాలకు అనుగుణంగా నిర్మించాడని ఒక నమ్మకంగా చెబుతుంటారు.

ఇక శివలింగం విషయానికి వస్తే, రెండు భాగాలుగా ఉండే ఈ శివలింగం ఒక భాగం ఎనిమిది అడుగులు ఉండగా, ఇంకొకటి ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. ఇవి రెండు కూడా నల్లటి ఆకారంలో ఉంటాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, గ్రహ స్థితులకు అనుగుణంగా చలనం కలిగి ఉన్న ఈ శివలింగాలు శివరాత్రి రోజున మాత్రం ఒకటి అవుతాయి. ఇలా అవ్వడం వెనుక ఇప్పటికి ఎవరు కూడా స్పష్టమైన ఆధారాలు చెప్పలేకపోయారు.

ఇలా ఎక్కడ లేని విధంగా వెలసిన ఈ ఆశ్చర్యకర అర్థనారీశ్వర శివలింగాన్ని దర్శించడం కోసం శివరాత్రి సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version