Home Unknown facts బాబా హర్భజన్ సింగ్ ఆత్మ ఇప్పటికీ అక్కడే కాపలా కాస్తుందా ?

బాబా హర్భజన్ సింగ్ ఆత్మ ఇప్పటికీ అక్కడే కాపలా కాస్తుందా ?

0

భారతదేశ సైనికులు అంటేనే మనం చాలా గౌరవిస్తాం. ఎందుకంటే ప్రాణాలకు తెగించి మన దేశాన్ని రక్షిస్తారని… కానీ చనిపోయిన తర్వాత కూడా ఓ సైనికుడు దేశాన్ని కాపాడే పనిలో ఉన్నాడు అంటే నమ్మశక్యంగా లేదు కదా! కానీ ఇది నిజం అంటున్నారు. ఇది ఒకరు ఇద్దరి నమ్మకం కాదు మన దేశ జవాన్లలో చాలా మంది నమ్మకం. చైనా భారత్ బోర్డర్ లో కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు ఒదిలిన బాబా హర్భజన్ సింగ్ ఆత్మ ఇప్పటికీ అక్కడే కాపలా కాస్తుందట. ఆ ఆత్మ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం…

Baba Harbhajan Singh1946 ఆగస్టు 30 న పంజాబ్‌లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన హర్భజన్ సింగ్, ఫిబ్రవరి 09, 1966 న భారత సైన్యంలో చేరాడు. రెండేళ్లు దేశానికి సేవలందించారు. అయితే 1968 లో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షపాతం కారణంగా వరదలు ఎక్కువయ్యాయి, కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రజలను కాపాడేందుకు ఆ ప్రాంతాలలో సహాయక చర్యల కోసం భారత ఆర్మీ సైన్యాన్ని పంపింది. ఆ సమయంలో సైన్యంతో అక్కడికి చేరుకున్న హర్బజన్ సింగ్ అక్టోబర్ 4, 1968 న, ఒక దురదృష్టకర పరిస్థితిలో వేగంగా ప్రవహించే ప్రవాహంలో పడటంతో ప్రాణాలు కోల్పోయాడు.

హర్భజన్ సింగ్‌ మృతదేహం కోసం భారత సైన్యం విస్తృతంగా గాళించినా లాభం లేకుండా పోయింది. ఈ విషాద సంఘటన తరువాత, మూడు రోజులకు హర్భజన్ సింగ్ తన తోటి సైనికుడు ప్రీతమ్ సింగ్ కలలో కనిపించి, తను ఎక్కడ చనిపోయాడో చెప్పాడట. వెళ్లి చూస్తే ఆశ్చర్యకరంగా, ప్రీతమ్ సింగ్ కు అమరవీరుడు హర్భజన్ సింగ్ కలలో చెప్పిన స్థలంలోనే మృతదేహం కనిపించిందట. దీని తరువాత కూడా సైనికులు చనిపోయిన హర్భజన్ ఉనికిని తెలుసుకునేలా అనేక సంఘటనలు జరుగుతూనే వచ్చాయి.

శత్రువుల నుండి ప్రమాదం ఉన్నప్పుడల్లా హర్భజన్ ఏదో ఒక విధంగా మన సైనికులకు తెలిసేలా చేసేవాడట. అలారోజులు గడిచేకొద్దీ, హర్భజన్ సింగ్ యొక్క ఆత్మ కథలు నెమ్మదిగా మతపరమైన మలుపు తిరిగాయి. ముఖ్యంగా సిక్కింలోని నాథూలా పాస్ దగ్గర మరణించడంతో భారత సైన్యం ఆయన్ని “నాథు లా హీరో” గా గుర్తించింది. భారత సైనికులు హర్భజన్ సింగ్‌ను బాబా హర్భజన్ సింగ్ అని పిలుస్తారు. ఆయన గౌరవార్థం ఒక మందిరం కూడా నిర్మించారు. అంతే కాదు సైనికులు ఆయన్ని ఒక సాధువుగా భావిస్తారు. తనను ఆరాధించే వారిని యుద్ధరంగంలో రక్షిస్తాడని చెబుతారు.

భారత్ చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు, మన సరిహద్దులపై దాడి చేస్తున్నట్లు బాబా హర్భజన్ సింగ్ ముందుగానే భారత సైనికులను హెచ్చరించారని సైనికులు పలు నివేదికల్లో వెల్లడించారు. హర్భజన్ సింగ్ ఆత్మ సరిహద్దుల్లో తిరుగుతూన్నట్టు చైనా సైనికులు కూడా చెబుతుంటారు. అంతేకాదు సైనికులు డిస్సిప్లైన్డ్ గా లేకపోయినా, తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించకపోయినా బాబా స్వయంగా చెంపదెబ్బతో శిక్షించారని చాలా మంది సైనికులు చెప్పారు.

నాథూ లా పాస్ వద్ద సినో ఇండియన్ సరిహద్దులో బాబా ఉండటం భారత సైనికుల విశ్వాసం పెంచడానికి సహాయపడుతుంది. అందువల్లే సరిహద్దు అవతలి వైపు శత్రువు తరచు దూకుడుగా వ్యవహరిస్తున్నా… ప్రతికూలా వాతావరణాన్ని ఎదుర్కొంటు చిరునవ్వుతో, దేశానికి పహారా కాస్తున్నారు. వారిని సంరక్షిస్తున్న ఆత్మపై సైనికులు తమ నమ్మకాన్ని ఉంచారు, “డ్రాగన్ అతనిని చూసి భయపడుతుంది. ఈ సరిహద్దు వద్ద, మాకు బాబా హర్భజన్ అండ ఉండగా ఇక్కడ ఏ తప్పు జరగదు.” అని భారత జవాన్లు చెబుతుంటారు. విధి నిర్వహణకు మరణం కూడా అడ్డుకాదని, సంకల్ప సాధనకు ఆత్మబలం సరిపోతుందని బాబా హర్భజన్ సింగ్ నిరూపించాడు.

 

Exit mobile version