మనుషులను సరైన ధర్మం దారిలో నడిపిస్తారని హిందువులు దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. అయితే పురాణాల్లోని ప్రతినాయకులను కూడా ఇదే హిందూవులు ఆరాధించి పూజలు చేస్తారు. రామాయణంలో దుష్టుడైన రావణాసురుడైన మహాభారతంలో దుర్మార్గుడైన దుర్యోధనుడిని కూడా ఆరాధించి పూజలు చేసే హిందువులు ఉన్నారు. నిజమే… దుర్యోధనుడికి మనదేశంలోనే రెండు ఆలయాలు ఉన్నాయి.
దుర్యోధనుడనగానే దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర గుర్తుకువస్తుంది. అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గం గుర్తుకువస్తుంది. మరికొందరేమో కర్ణుడితో స్నేహం మూలంగా దుర్యోధనుడిని స్నేహానికీ, అభిమానానికీ ప్రతీకగా భావిస్తారు. ఆయనని కూడా ఒక దేవునిగా కొలుస్తారు. కానీ దుర్యోధనుడికి ఏకంగా ఆలయమే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఉత్తర భారతదేశంలోని జార్ఖండ్ లో ఒక ఆలయం ఉండగా దక్షిణ భారతం కేరళలో కూడా దుర్యోధనుడికి ఆలయం ఉంది. కేరళలోని కొల్లం జిల్లాలో పోరువళి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఆ కొండని మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం. ఈ మలనాడలో దుర్యోధనుడిని మలయప్పొపాన్ గా పూజిస్తారు. కాగా ఈ ఆలయం వెనుక చాలా వింత చరిత్రే వినిపిస్తుంది. కౌరవులతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్నీ, ఏడాది అజ్ఞాతవాసాన్నీ అనుభవించేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే.
అజ్ఞాత వాసంలో ఉన్న సమయంలో వారిని పట్టుకునేందుకు ధూర్యోధనుడు, శకుని వేయని పధకాలు ఉండవు. అజ్ఞాత వాసంలో ఉన్న పాండవులను పట్టుకుంటే వారు మరో 12 ఏళ్లు అజ్ఞాత వాసం చేయాల్సి ఉంటుంది. అందుకే పాండవుల జాడ కనుగొనేందుకు దుర్యోధనుడే స్వయంగా వారిని వెతుక్కుంటూ బయలు దేరతాడు.
అలా వెళ్లిన దుర్యోధనుడు చాలా దూరం ప్రయాణించి కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకున్న తర్వాత దప్పికతో నీరసించి సేద తీరుతుంటాడు. ఆ సమయంలో దుర్యోధనుడి పరిస్థితి గమనించిన కురువ జాతికి చెందిన ఓ మహిళ తన వద్ద ఉన్న కల్లును అతడిని ఇస్తుంది. దుర్యోధనుడు వెంటనే దప్పిక నుంచి ఉపశమనం పొంది సాంత్వన పొందుతాడు. ఆమె చేసిన సహాయానికి కృతజ్ఞతగా తన రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని అక్కడి వారికి కానుకగా ఇస్తాడు. మలనాడ కొండపై ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరున్ని ప్రార్ధిస్తాడు. ఆ విశ్వాసంతో కురువ జాతికి చెందిన పూర్వీకులు మలనాడ కొండపై దుర్యోధనుడికి ఆలయం కట్టించినట్లు చెబుతారు.
కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది. గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని ఊహించుకుంటారు. ఈ ఆలయంలోని ‘కురవ’ అనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా సాగడం మరో విచిత్రం. దుర్యోధనుడికి కల్లుని అందించిన వృద్ధురాలు ‘కురవ’ స్త్రీ కావడంతో ఈ ఆచారం మొదలై ఉంటుంది.